ఎమ్మెల్యేల ఏడాది ఆదాయం ఎంతో తేల్చారు!

Update: 2018-09-18 04:48 GMT
ఒక ఏడాదిలో ఎమ్మెల్యేల స‌రాస‌రి ఆదాయం ఎంతుంటుంది? ఈ ప్ర‌శ్న‌ను ఇంత‌కు ముందు అడిగితే స‌మాధానం కోసం త‌డుముకోవాల్సిందే. కానీ.. ఇప్పుడు అలా కాదు. అందుకు సంబంధించిన లెక్క ఒక‌టి తెర మీద‌కు వ‌చ్చింది. దేశంలో ఎన్నిక‌ల సంస్క‌ర‌ణ‌ల కోసం కృషి చేస్తున్న సంస్థ ఆసోసియేష‌న్ ఫ‌ర్ డెమొక్ర‌టిక్ రిఫార్మ్స్ అండ్ ద నేష‌న‌ల్ ఎల‌క్ష‌న్ వాచ్.

ఈ సంస్థ దేశ వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేల‌లోని 4086 మందికి 3145 మంది ఎన్నిక‌ల అఫిడ‌విట్ల‌ వివ‌రాల్ని ప‌రిశీలించింది.  మిగిలిన ఎమ్మెల్యేలు (941 మంది) త‌మ ఆదాయానికి సంబంధించిన వివ‌రాల్ని వెల్ల‌డించ‌లేదు. దీంతో.. త‌మ‌కు అందుబాటులో ఉన్న అఫిడ‌విట్ల‌ను క్షుణ్ణంగా ప‌రిశీలించి.. దేశ వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేల స‌రాస‌రి  వార్షిక ఆదాయాన్ని లెక్క‌క‌ట్టే ప్ర‌య‌త్నం చేశారు.

ఈ అధ్య‌య‌నం ప్ర‌కారం  ఏడాదికి స‌రాస‌రి ఒక్కో ఎమ్మెల్యే రూ.24.59 ల‌క్ష‌ల ఆదాయాన్ని ఆర్జిస్తున్న‌ట్లుగా తేల్చారు. ఈ అధ్య‌య‌నంలో క‌ర్ణాట‌క ఎమ్మెల్యేల స‌గ‌టు ఆదాయం కోటికి పైనే ఉన్న‌ట్లు గుర్తించారు. ఆదాయంలో క‌ర్ణాట‌క ఎమ్మెల్యే అగ్ర‌స్థానంలో ఉంటే.. అతి త‌క్కువ వార్షిక ఆదాయం ఉన్న ఎమ్మెల్యేల‌లో ఛ‌త్తీస్ గ‌ఢ్ రాష్ట్రానికి చెందిన శాస‌న‌స‌భ్యులు నిలిచారు. వారి వార్షిక స‌రాస‌రి ఆదాయం కేవ‌లం రూ.5.4ల‌క్ష‌లు మాత్ర‌మే.

దేశంలోని నాలుగు దిక్కుల్లో ఉన్న రాష్ట్రాల ఎమ్మెల్యే ఆదాయాల్ని చూస్తే.. ద‌క్షిణాదిన ఉన్న 711 ఎమ్మెల్యేల్లో గ‌రిష్ఠంగా ఒక్కొక్క‌రు రూ.51.99 ల‌క్ష‌లు సంపాదిస్తున్న‌ట్లు తేల‌గా.. అతి త‌క్కువ‌గా తూర్పు ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు నిలిచారు.త‌మ‌కు అందుబాటులోకి వ‌చ్చిన 614 మంది ఎమ్మెల్యేల అఫిడ‌విట్ల‌ను ప‌రిశీలించ‌గా.. వారి స‌రాస‌రి వార్షిక ఆదాయం కేవ‌లం రూ.8.53 ల‌క్ష‌లు మాత్ర‌మేన‌ని తేలింది. రాష్ట్రాల వారీగా చూస్తే క‌ర్ణాట‌క ఎమ్మెల్యేల ఆదాయం అగ్ర‌స్థానంలో నిలుస్తుంది. రెండో స్థానంలో మ‌హారాష్ట్రకు చెందిన ఎమ్మెల్యేలు ఒక్కొక్క‌రు రూ.43.4 ల‌క్ష‌లు సంపాదిస్తున్నారు.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. జార్ఖండ్ ఎమ్మెల్యేలు ఛ‌త్తీస్ గ‌ఢ్ ఎమ్మెల్యేల‌కంటే మెరుగైన ఆదాయాన్ని క‌లిగిన ప్ర‌జాప్ర‌తినిధులుగా నిలుస్తున్నారు. అన్ని రంగాల్లో ఉన్న‌ట్లే రాజ‌కీయ రంగంలోనూ లింగ వివ‌క్ష కొట్టొచ్చిన‌ట్లు క‌నిపించింది. మ‌హిళా ఎమ్మెల్యేల‌తో పోలిస్తే.. పురుష ఎమ్మెల్యే ఆదాయం రెండు రెట్లు ఎక్కువ‌న్న విష‌యాన్ని గుర్తించారు. పురుష ఎమ్మెల్యేల స‌రాస‌రి వార్షికాదాయం రూ.25.85 ల‌క్ష‌లు ఉండ‌గా.. మ‌హిళా ఎమ్మెల్యేల ఆదాయం స‌రాస‌రిన కేవ‌లం రూ.10.53 ల‌క్ష‌లే కావ‌టం గ‌మ‌నార్హం.

3145 మంది ఎమ్మెల్యేల అఫిడ‌విట్ల‌ను ప‌రిశీలిస్తే.. 55 మంది త‌మ వృత్తి వివ‌రాల్ని వెల్ల‌డించ‌కుంటే.. వ్యాపారం త‌మ వృత్తిగా పేర్కొన్న వారు 777 మంది ఉంటే.. వ్య‌వ‌సాయాన్ని త‌మ వృత్తిగా ప్ర‌క‌టించిన వారు 758 మంది నిలిచారు. ఎమ్మెల్యేల‌లో 1052 మంది ఎడ్యుకేష‌న్ క్వాలిఫికేష‌న్ ప్ల‌స్ టూ కాగా.. వారి వార్షికాదాయం రూ.31 ల‌క్ష‌లుగా ఉంది.

అదే స‌మ‌యంలో డిగ్రీ విద్యార్హ‌త అని చెప్పిన 1997 మంది ఎమ్మెల్యేల వార్షిక ఆదాయం రూ.20.87 ల‌క్ష‌లు. అలా అని బాగా చ‌దువుకున్న వారి ఆదాయం ఎక్కువ‌న్న ముక్తాయింపున‌కు వ‌స్తే.. ముల‌క్కాయ పులుసులో కాలేసిన‌ట్లే. ఎందుకంటే ఎనిమిదో త‌ర‌గ‌తి వ‌ర‌కు మాత్ర‌మే చ‌దివిన‌ట్లు ప్ర‌క‌టించిన 134 మంది ఎమ్మెల్యేల వార్షికాదాయం స‌రాస‌రి రూ.89.88 ల‌క్ష‌లు కావ‌టం గ‌మ‌నార్హం. సో.. ఆదాయానికి ఎమ్మెల్యేల చ‌దువున‌కు ఏ మాత్రం సంబంధం లేద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.


Tags:    

Similar News