బాబు జ‌మానాలో `వెంక‌న్న` విలాసం

Update: 2017-10-10 12:28 GMT
ఎడా పెడా ఏం జ‌రిగినా.. అడిగేదెవ‌డ్రా నా ఇష్టం!! అన్న‌ట్టుగా ఏపీలో అధికార టీడీపీ నేత‌లు త‌మ ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని య‌థేచ్ఛ‌గా నిబంధ‌న‌ల‌కు నీళ్లొదులు తున్నారు. ఎవ‌రైనా అధికారులు `నిబంధ‌న‌లు` అని ప్ర‌శ్నిస్తే.. వాళ్ల కాల‌ర్ ప‌ట్టుకోడానికి కూడా టీడీపీ నేత‌లు - ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు వెనుకాడ‌టం లేద‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. దీనికి ప‌రాకాష్టే.. ఇటీవ‌ల విజ‌య‌వాడ ఆర్టీఏ ఆస్ప‌త్రిలో టీడీపీ ఎంపీ - ఎమ్మెల్యే - ఎమ్మెల్సీలు సృష్టించిన ర‌గ‌డ‌. ఉన్న‌తాధికారి అని కూడా చూడ‌కుండా `అరెయ్‌-ఒరెయ్‌` అంటూ ఓ ఐఏఎస్ అధికారిపై విరుచుకుప‌డ్డారు.

ఇక‌, ఇప్పుడు జ‌రిగిన తాజా ఘ‌ట‌న‌లో  టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న  హ‌ల్‌ చ‌ల్ సృష్టించారు. నిబంధలనకు విరుద్ధంగా సచివాలయంలోని పబ్లిసిటీ సెల్‌ లో మంగళవారం బుద్ధా ప్రెస్‌ మీట్‌ ఏర్పాటు చేశారు. అయితే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు - పార్టీ నేతలకు పబ్లిసిటీ సెల్‌ లో ప్రెస్‌ మీట్‌ లకు అనుమతి లేదని ఐ అండ్‌ పీఆర్‌ అధికారులు తెలిపారు. కేవలం మంత్రులు మాత్రమే మీడియా సమావేశం నిర్వహించుకునేందుకు అనుమతి ఉందన్నారు.

కానీ అలాంటి నిబంధనలేవి పట్టించుకోని వెంక‌న్న తాను నిర్వ‌హించాల్సిన స‌మావేశాన్ని నిర్విఘ్నంగా కొన‌సాగించారు.  అనుమతి లేకుండా ప్రెస్‌ మీట్‌ పెట్టడంపై మీడియా ప్రతినిధులు బుద్ధా వెంకన్నను ప్రశ్నించారు. దానిపై స్పందించిన ఆయన సచివాలయం.. `కమిషనర్ దా` అంటూ.. ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు. దీంతో ఇది పెద్ద దుమారానికి దారి తీసే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు ఉన్న‌తాధికారులు. నిజానికి స‌చివాలయం అంటే నిత్యం సీఎం వ‌చ్చిపోతుండే ప్రాంతం. అలాంటి చోటే సొంత పార్టీ నేత‌లే నిబంధ‌న‌ల‌ను తుంగ‌లో తొక్కితే.. బాబు చూస్తూ ఊరుకుంటారా? అని అధికారులు ప్ర‌శ్నిస్తున్నారు.
Tags:    

Similar News