డొక్కా?..లిక్క‌ర్ బ్యాన్‌ కు మోదీకి లింకెట్టేశారే!

Update: 2019-05-13 14:26 GMT
మ‌ద్యపాన నిషేధం... అది కూడా ఏపీలో. ఈ విష‌యంపై చాలా విష‌యాలే చెప్పుకోవాలి. అయితే ముందుగా టీడీపీ ఎమ్మెల్సీ, ప్ర‌జా పాల‌న‌పై కాస్తంత మంచి ప‌ట్టు ఉన్న నేత‌గా పేరు సంపాదించుకున్న డొక్కా మాణిక్య వ‌ర‌ప్ర‌సాద్ మ‌ద్య‌పాన నిషేధంపై చేసిన కామెంట్ల‌ను అన్నింటి కంటే ముందు గుర్తు చేసుకోవాలి. తాము అధికారంలోకి వ‌స్తే మ‌ద్యపాన నిషేధాన్ని అమ‌లు చేస్తామ‌ని ఆయ‌న ఇప్పుడు కొత్త‌గా చెప్పుకొచ్చారు. అయితే ముందుగా ప్ర‌ధాని మోదీ దానిని అమ‌లు చేయాలట‌. ఆ త‌ర్వాత మాత్ర‌మే టీడీపీ మ‌ద్య‌పాన నిషేధాన్ని త‌మ మేనిఫెస్టోలో పెడుతుంద‌ట‌. మోకాలికి బోడిగుండుకు ముడిపెట్ట‌డ‌మంటే ఇదేనేమో. నిజ‌మే మ‌రి... త‌మ రాష్ట్రంలో మ‌ద్య‌పాన నిషేధాన్ని అమ‌లు చేయాలనుకుంటే... దానికి కేంద్రంతో ముడిపెట్ట‌డం ఎందుకో? ఆడ‌లేక మ‌ద్దెల ఓడు అంటే ఇదేనేమో.

మ‌ద్య‌పాన నిషేధాన్ని అమ‌లు చేయాలనుకుంటే... అమ‌లు చేసి తీరాలి గానీ... దానికి ఇంకో పార్టీతో, లేదంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో ముడిపెట్ట‌డం ఏమిటో మ‌రి. సరే ఏపీలో మ‌ద్య‌పాన నిషేదం గురించిన వివ‌రాల్లోకెళితే... ఇదే డొక్కా ఉన్న టీడీపీని స్థాపించి 9 నెల‌ల్లోనే పార్టీని అధికారంలోకి తెచ్చిన స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క‌రామారావు మ‌ద్య‌పాన నిషేధాన్ని అమ‌లు చేసి పారేశారు. అయితే నాడు ఎన్టీఆర్ స‌ర్కారు క‌ళ్లుగ‌ప్పి... ఆయ‌న సొంత పార్టీ నేత‌లే పొరుగు రాష్ట్రాల నుంచి మ‌ద్యాన్ని అక్ర‌మ మార్గాల్లో త‌ర‌లించి భారీగా సొమ్ములు వెన‌కేసుకున్న సంగ‌తి స‌రేస‌రి. అయితే ఆ త‌ర్వాత ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ఆయ‌న చేతిలో అధికారంతో పాటు ఆయ‌న స్థాపించిన పార్టీని లాగేసుకున్న నారా చంద్ర‌బాబునాయుడు... ఆ వెంట‌నే మ‌ద్యపాన నిషేధాన్ని ఎత్తిపారేశారు. మ‌ద్యాన్ని ఏరులై పారించేలా కొత్త త‌ర‌హా మ‌ద్యం పాలసీని తీసుకొచ్చారు. ఇక ఇప్పుడు రాష్ట్రంలో ఎక్క‌డ ప‌డితే అక్క‌డ మ‌ద్యం దొరికేలా బెల్టు షాపుల ఏర్పాటు కూడా చంద్ర‌బాబు పుణ్య‌మే. మ‌ద్య‌పాన నిషేధం అంటేనే ఆయ‌న నోటికి తాళం ప‌డిపోతుంది.

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో భాగంగా విప‌క్ష వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తాను అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత మ‌ద్య‌పాన నిషేధాన్ని ద‌శ‌ల వారీగా అమ‌లు చేస్తానని ప్ర‌క‌టించేశారు. అదే స‌మ‌యంలో టీడీపీ పుణ్య‌మా అని స్వైర విహారం చేస్తున్న బెల్టు షాపుల‌పై చాలా కాలం నుంచే విమ‌ర్శ‌లు గుప్పిస్తోంది. ఈ నేప‌థ్యంలో బీజేపీకి కౌంట‌ర్ ఇచ్చేందుకు ఎంట్రీ ఇచ్చిన డొక్కా... తాము కూడా మ‌ద్య‌పాన నిషేధాన్ని అమ‌లు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. అయితే అందుకు ముందుగా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ దేశవ్యాప్తంగా మ‌ద్య నిషేధాన్ని అమ‌లు చేసి తీరాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. అయినా దేశ‌వ్యాప్తంగా మ‌ద్య‌పాన నిషేధాన్ని కేంద్ర‌మే అమ‌లు చేస్తే... ఇక ఏపీలో టీడీపీ మ‌ద్య‌పాన నిషేధాన్ని అమ‌లు చేయాల్సిన అవ‌స‌ర‌మేముంటుందో డొక్కాకే తెలియాలి.
Tags:    

Similar News