టీడీపీ స‌రే.. ఇప్పుడు టీఆర్ ఎస్ వంతు!

Update: 2017-10-31 10:40 GMT
ఉద్య‌మ నేప‌థ్యంగా ఏర్ప‌డిన తెలంగాణ‌ రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎలాంటి ప‌రిణామాలు ఎదుర‌వుతాయో చెప్ప‌లేని ప‌రిస్థితి నెల‌కొంటోంది. 2019 ఎన్నిక‌లు చేరువ‌వుతున్న కొద్దీ రాజ‌కీయ గోడ‌దూకుళ్లు పెరుగుతున్నాయి. స‌మీక‌ర‌ణ‌లు మారుతున్నాయి. ఎవ‌రు ఎప్పుడు ఏ పార్టీలోకి దూకుతారో? ఏ ప‌ద‌వికి రిజైన్ చేస్తారో కూడా చెప్ప‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది రెండు రోజుల కింద‌ట టీడీపీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి త‌న పార్టీకి , ప‌ద‌వికి రాజీనామా చేసేశారు. ఇక‌, మంగ‌ళ‌వారం కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ స‌మక్షంలో ఆయ‌న కాంగ్రెస్ కండువా క‌ప్పేసుకున్నారు. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉంది.

ఇక‌, ఇప్పుడు తాజాగా ఈ గోడ‌దూకుడు వ్య‌వ‌హారం అధికార టీఆర్ ఎస్‌ కు కూడా పాకింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అదేంటి వింత‌గా ఉంది? అనుకుంటున్నారా?  నిజ‌మేన‌ట‌! టీఆర్ ఎస్‌ కు ఇన్నాళ్లూ సేవ చేశాన‌ని, అయినా ఎలాంటి గుర్తింపు లేకుండా పోయింద‌ని, ఇంకో రెండేళ్లు ఉన్నా ఇదే ప‌రిస్థితి ఉంటుంద‌ని కొంద‌రు నేత‌లు వాపోతున్నారు. ఈ క్ర‌మంలోనే వారు దీపం ఉండ‌గా ఇల్లు చ‌క్క‌పెట్టుకునే సూత్రాన్ని అమ‌లు చేసేస్తున్నారు. విష‌యంలోకి వెళ్తే.. తెలంగాణాలో  మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్సీ - టీఆర్‌ ఎస్‌ నేత పోట్ల నాగేశ్వరరావు కూడా కాంగ్రెస్ గూటికి చేరిపోవాల‌ని డి సైడ్ అయ్యార‌ట‌.

కొంతకాలంగా టీఆర్‌ ఎస్‌ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పోట్ల పార్టీలో సరైన గుర్తింపు లేదని మథన పడుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2009లో స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా గెలుపొందిన పోట్ల 2015 వరకు టీడీపీ తరఫున కొనసాగారు. జిల్లాలో సంభవించిన అనూహ్య రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2016 ఆయన టీఆర్‌ ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీలో సీనియర్‌ నాయకుడిగా - పలుసార్లు సుజాతనగర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన నేతగా.. పార్టీలో రాష్ట్రస్థాయి పదవులు చేపట్టిన నేతగా పేరొందిన పోట్ల కాంగ్రెస్‌ వైపు చూడటం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

ఆదివారం రేవంత్‌ రెడ్డిని కలిసిన పోట్ల నాగేశ్వరరావు ఆయనతో జిల్లా రాజకీయ అంశాలు చర్చించినట్లు తెలిసింది. కాంగ్రెస్‌ పార్టీలో చేరే జాబితాలో పోట్ల నాగేశ్వరరావు పేరును చేరుస్తున్నారని రేవంత్‌ రెడ్డి నేరుగా పోట్లతో చెప్పినా.. పోట్ల మాత్రం తాను నిర్ణయం తీసుకునేందుకు సమయం కావాలని కోరినట్లు సమాచారం. రేవంత్‌ రెడ్డిని కలిసిన 24 గంటల్లోపే పోట్ల నాగేశ్వరరావు సోమవారం సాయంత్రం కేంద్ర మాజీ మంత్రి - రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరిని కలిశారు. ఆమెతో సుదీర్ఘ చర్చలు జరిపిన అనంతరం కాంగ్రెస్‌ లోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.  ఇదే జ‌రిగితే.. అధికార టీఆర్ ఎస్ స‌హా కేసీఆర్ నాయ‌క‌త్వానికి అగ్ని ప‌రీక్షే అంటున్నారు.
Tags:    

Similar News