మోడీ షా కంటికి ఆనని సేనాని....?

Update: 2022-09-03 01:30 GMT

ఆయన వెండి తెర పవర్ స్టార్. ఏపీ రాజకీయాల్లో కూడా డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉండబోతున్నారు.  పైగా ఆయన బీజేపీకి మిత్రుడు. అలాంటి పవన్ కళ్యాణ్ పుట్టిన రోజున సినీ రాజకీయ వర్గాల నుంచి శుభాకాంక్ష‌లు వెల్లువెత్తాయి. వివిధ రంగాల ప్రముఖుల నుంచి గ్రీటింగ్స్ వెల్లువలా వచ్చాయి. పవన్ కళ్యాణ్ కి మెగాఫ్యామిలీ నుంచి అభినందనలు వెల్లి విరిసాయి.

అదే విధంగా ఏపీ బీజేపీ నాయకులు కూడా వరసబెట్టి తన ట్విట్టర్ హ్యాండిల్స్ కి పని చెప్పారు. పవన్ని సర్వ శక్తిమంతుడిగా ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు అభివర్ణించారు. ఇక రాజ్య సభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అయితే పవర్ కళ్యాణ్ ని పొలిటికల్ పవర్ స్టార్ గా పేర్కొన్నారు. విష్ణువర్ధన్ రెడ్డి పవన్ సినిమాలతో పాటు రాజకీయ ప్రయత్నాలు ఫుల్ సక్సెస్ కావాలని కోరారు. ఇక ఏపీ బీజేపీ ఇంచార్జి సునీల్ డియోధర్, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి కూడా పవన్ కి బర్త్ డే విషెస్ చెప్పారు.

ఇంతమంది చెప్పినా బీజేపీకి అసలైన పెద్దలుగా ఉన్న మోడీ అమిత్ షాల నుంచి గ్రీటింగ్స్ లేకపోవడం ఒక వెలితిగానే అంతా భావిస్తున్నారు. పవన్ని తనతో సమానంగా పక్కన కూర్చోబెట్టుకుని 2014 ఎన్నికల్లో ఏపీ అంతా మోడీ తిరిగారు. ఇక ఆనాడు మోడీ ఏపీకి వచ్చినపుడల్లా  పవన్ ప్రస్థావన లేకుండా ప్రసంగాలు చేసేవారు కారు, అలాగే మోడీ అమిత్ షాల అపాయింట్మెంట్స్ పవన్ కి చిటికలో దొరికేవి.

ఏపీకి సంబంధించంతవరకూ పవన్ని వారు చాలా జాగ్రత్తగా చూసుకునేవారు. ఇదంతా చాలా ఏళ్ళుగా సాగిన రాజకీయ కధ. అలాంటి పవన్ పార్టీతో పొత్తులకు కూడా కేంద్ర స్థాయిలోనే కసరత్తు సాగింది అని చెబుతారు. కేంద్ర పెద్దల నుంచి భరోసా వచ్చిన మీదటనే ఏపీ బీజేపీతో పవన్ పొత్తు పెట్టుకున్నారు. ఇంత జరిగినాక పవన్ పాత్ర కేంద్రం వద్ద జాతీయ నాయకత్వం వద్ద మెల్లగా తగ్గిపోతోందా అంటే జరుగుతున్న పరిణామాలు దాన్ని రుజువు చేస్తున్నాయి. పవన్ అన్నని వారు పూర్తిగా ఇగ్నోర్ చేస్తున్నారా అని కొత్త డౌట్లు వచ్చిపడుతున్నాయి.

పవన్ కళ్యాణ్ బర్త్ డే కి గ్రీట్ చేయడానికి కూడా లేకపోయిందా అన్న చర్చ నడుస్తోంది. పవన్ అన్నను మరచిపోయారా లేక ఆయన బీజేపీ పెద్దల కంటికి ఆనడంలేదా అన్న మాట కూడా ఇపుడు గట్టిగా వినిపిస్తోంది. మొత్తానికి చూస్తే పవన్ని జాతీయ స్థాయిలో కాకుండా కేవలం ఏపీకి సంబంధించిన నాయకుడిగానే ఆ పార్టీ పెద్దలు చూస్తున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

పవన్ కళ్యాణ్ పవర్ స్టారిజం సౌత్ స్టేట్స్ అంతా విస్తరించి ఉందని ఒకనాడు నమ్మి ఆయన్ని అలాగే ఫోకస్ చేసిన ఢిల్లీ పెద్దలు ఇపుడు ఆయన్ని ఒక రాష్ట్రానికే అన్నట్లుగా పరిమితం చేయడం అంటే అది పవన్ని చిన్నబుచ్చినట్లుగానే చూడాలని అంటున్నారు. పవన్ అయితే తనకు కేంద్ర నాయకత్వంతో మంచి రిలేషన్స్ ఉన్నాయని, ఏ విషయం అయినా అక్కడే మాట్లాడుకుంటాను అని చెబుతూ వచ్చేవారు.

కానీ ఏపీకి మోడీ వచ్చినా భీమవరంలో అల్లూరి 125వ జయంతి ఉత్సవం జరిగినా పవర్ స్టార్ కి పిలుపు రాలేదు. ఆ తరువాత కిషన్ రెడ్డి తానుగా కల్పించుకుని ఆహ్వానం పంపారని ప్రచారం సాగింది. ఇక అమిత్ షా హైదరాబాద్ వచ్చి జూనియర్ ఎన్టీయార్ ని కలిశారు, జేపీ నడ్డా వచ్చి  నితిన్ తో భేటీ వేశారు. అయినా పవన్ని మాత్రం జాతీయ పార్టీ పెద్దలు ఎవరూ పిలవకపోవడంతోనే ఒక కీలక చర్చ అయితే  మొదలైంది. ఇపుడు బర్త్ డే వేళ ఒక్క ట్వీట్ కూడా జేపీ నడ్డా స్థాయిలో పడకపోవడం చూస్తే ఎక్కడో తేడా కొడుతోంది అనే అంటున్నారు. చూడాలి మరి దీని ఫలితాలు పర్యవశానాలు ఎలా ఉంటాయో.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News