దోవల్ కాల్ తర్వాత మోడీ ఫోన్ ఎవరికంటే..

Update: 2016-10-01 11:53 GMT
పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాల మీద భారత సైన్యం జరిపిన సర్జికల్ దాడులు విజయవంతమయ్యాక.. ఆ విషయాన్ని ప్రధాని మోడీకి చెప్పేందుకు ఫోన్ చేశారు జాతీయ భద్రతా సలహాదారు దోవల్.  ఆయన చెప్పిన మాటలు విన్న తర్వాత విపరీతమైన సంతోషానికి గురయ్యారట మోడీ. ఆయనకు అభినందలు తెలిపిన తర్వాత మోడీ ఎవరికి ఫోన్ చేశారన్నది ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించిన సమాచారం తాజాగా బయటకు వచ్చింది.

తెల్లవారుజామున సర్జికల్ దాడుల సమాచారం తెలిసిన వెంటనే.. ఇక ఆపుకోలేని మోడీ వెంటనే ఫోన్ చేసింది మరెవరికో కాదు.. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడికే. అంత తెల్లవారుజామున ఫోన్ కాల్ రావటం.. అదీ మోడీ నుంచి కావటంతో వెంక‌య్య‌ కాస్తంత ఆశ్చర్యానికి గురయ్యారట. వెంకయ్యజీ.. ఒక్కసారి ఇంటికి వస్తారా? అన్న మోడీ గొంతులోని మార్పు విన్న వెంటనే అలాగే అని చెప్పి బయలుదేరారట. మోడీ ఆ టైంలో ఫోన్ చేసింది ఎందుకన్న విషయం అర్థం కాకున్నా.. ఏదో ముఖ్యమైన విషయం తనతో మాట్లాడటానికే మోడీ ఫోన్ చేశారన్న విషయం వెంకయ్యకు అర్థమైందట.

మోడీ ఇంటికి వెళ్లిన వెంకయ్యకు.. వెలిగిపోతున్న మోడీ ముఖం కనిపించిందట. గడిచిన రెండున్నరేళ్లలో అంత ఉత్సాహంగా మోడీని చూడని వెంకయ్య.. మరోసారి ఆశ్చర్యపోయారట. చాలా సంతోషంగా ఉంది వెంకయ్యజీ అంటూ తన మాటల్ని మొదలెట్టిన మోడీ.. పాక్ పై జరిపిన సర్జికల్ దాడుల గురించి వివరించారట. ఇటీవల కాలంలో సోషల్ మీడియాపై తన మీద వస్తున్న విమర్శలు.. పెడుతున్న పోస్టింగ్ లు తనను తీవ్రంగా కలిచివేశాయని.. ముఖ్యంగా ఎన్నికల సమయంలో చెప్పిన 56 అంగుళాలు ఛాతీ ముచ్చట ఏమైందంటూ చేస్తున్న వ్యంగ్య వ్యాఖ్యలు తనను బాధించినట్లు చెప్పారట. పాక్ తో స్నేహం కోసం ఎంత ప్రయత్నించినా.. ఆ దేశం తీరు మారటం లేదని.. ఉరీ ఉగ్రఘటన నేపథ్యంలో పాక్ కు బుద్ధి చెప్పేందుకే తామీ ఆపరేషన్ చేసినట్లుగా చెప్పారట. ఆసక్తికరంగా అనిపిస్తున్న ఈ ఘటన వివరాలు అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి అందటం గమనార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News