యూపీపై ఎందుకు ఫోక‌స్ పెట్టారంటే...

Update: 2016-06-20 12:57 GMT
పేరుకే వ‌చ్చే ఏడాది ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న‌ప్ప‌టికీ ఉత్తరప్రదేశ్ గురించి ఇప్ప‌టికే అన్ని రాజ‌కీయ‌పార్టీలు చ‌ర్చ‌లు మొద‌లుపెట్టేశాయి. ఈ రాష్ట్రానికి దేశంలోనే ఉన్న‌ ప్రత్యేకతే ఇందుకు కార‌ణం. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలున్నాయి. జవహర్ లాల్ నెహ్రూ - లాల్ బహాదుర్ శాస్త్రి - ఇందిరా గాంధీ - రాజీవ్ గాంధీ - చరణ్ సింగ్ - వీపీ సింగ్ ఇలా ఎందరో భారత ప్రధానమంత్రులు ఉత్తర ప్రదేశ్ నుంచి దేశానికి ప్రధానులుగా ఎన్నికయిన నాయకులైనవారే. అటల్ బిహారీ వాజపేయి కూడా లక్నో నుంచి ఎన్నికైన వారే. ప్రధాని నరేంద్ర మోడీ సహా కాంగ్రెస్ చీఫ్ సోనియా గాందీ - ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు కూడా ఉత్తరప్రదేశ్ నుంచే గెలుపొందిన సంగతి తెలిసిందే.

సరిగ్గా మరో తొమ్మిది నెలల్లో ఇక్కడ శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ అత్యధిక స్థానాలు గెలుచుకుని అధికారంలోకి వస్తే తమకు తిరుగు ఉండదని బీజేపీ భావిస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ తమకు ఈ ఫలితాలు ఉపయోగపడతాయని బీజేపీ యోచిస్తోంది. ఈ క్రమంలోనే భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని ఇటీవల అలహాబాద్‌లో నిర్వహించింది. ప్రధాని మోడీ - పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలతో పాటు కేంద్రమంత్రులు - బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు - పార్టీ ఎంపీలు అంతా కలిసి వచ్చే ఎన్నికలకు సంబంధించిన కార్యాచరణ చేపడుతున్నారు. ఇప్పటికే పార్టీ ముఖ్యనేతలతో అమిత్ షా భేటీయ్యారు. ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో గెలుపొందడమే లక్ష్యంగా ఇక్కడ వ్యూహాలు రచిస్తున్నారు. యూపీ అసెంబ్లీలో మిషన్ 265 ప్లస్ లక్ష్యంతో పనిచేయాలని ఇటీవల అమిత్ షా కూడా పేర్కొన్నారు. 80 లోక్‌సభ స్థానాలున్న యూపీలో 2014 ఎన్నికల్లో బీజేపీ ఆశ్చర్యకరంగా 71 స్థానాలు కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ 224 - బీజేపీ 47 - బీఎస్పీ 80 సీట్లు సాధించాయి. ఈ నేపథ్యంలో 2017 ఎన్నికల్లో యూపీలో బీజేపీ సీఎం అభ్యర్థిగా బలమైన వ్యకిని నిలిపేందుకు కసరత్తు సాగుతోంది. కేంద్ర హోంమంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ ను సీఎం అభ్య‌ర్థిగా ఖరారు చేయగా ఆయన అయిష్టత వ్యక్తంచేశారు.

కాగా వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించిన బీజేపీ అక్కడి సమాజ్‌ వాదీ పార్టీ(ఎస్పీ) ప్రభుత్వాన్నిటార్గెట్ చేసుకుంది. ఇటీవలి మథుర - కైరానా హింసాత్మక ఘటనలను ప్రస్తావిస్తూ సీఎం అఖిలేష్ యాదవ్‌ పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టింది. 2017 సంవత్సరంలో యూపీతోపాటు ఉత్తరాఖండ్ - పంజాబ్ - గుజరాత్ - హిమాచల్‌ ప్రదేశ్ రాష్ట్రాల్లో తమ జెండా ఎగురవేయాలని బీజేపీ భావిస్తోంది. అలాగే, 2019లో కేంద్రంలోనూ తిరిగి అధికారం కైవసం చేసుకుంటామనే ధీమాతో బీజేపీ ఉంది. అలాగే ఇతర పార్టీలూ ప్రణాళికలు రచిస్తున్నాయి.

కాంగ్రెస్ పార్టీ గట్టి వ్యూహమే రచిస్తున్నట్లు తెలుస్తోంది. తమ పార్టీ తరుపున ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో గతంలో తర్జనభర్జనలుపడినా ఇప్పుడొక నిర్ణయానికి వచ్చింది. గతంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని లేదా, ప్రియాంకా గాంధీని ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ప్రకటించాలనుకున్నారు. కానీ, కాంగ్రెస్ పార్టీ మాత్రం మొత్తానికి తన గత నిర్ణయాలకు భిన్నంగా ప్రతి వ్యూహాన్ని రచిస్తోంది. కాంగ్రెస్ పార్టీ యూపీ వ్యవహరాల ఇన్ చార్జిగా గులాం నబీ ఆజాద్‌ ను నియమిస్తూ ఏఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. మొన్నటి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పుదుచ్చేరిలో అధికార కైవసం, తమిళనాడులో డీఎంకేతో పొత్తు తదితర వ్యవహారాలను చక్కగా చక్కబెట్టి అధినేత్రి ప్రశంసలు పొందిన గులాం నబీ ఆజాద్. యూపీలోనూ తనదైన మార్కు చూపించగలరని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఎన్నికల వ్యూహకర్త కిషోర్ కుమార్ కూడా యూపీ ఎన్నికలయ్యేంత వరకు కాంగ్రెస్ తోనే ఉండాలని నిర్ణయించుకోవడం, ఆయన సూచనల మేరకు పొత్తుల ఎత్తుల్లో ఆరితేరిన ఆజాద్ లాంటి ఇన్ చార్జిలుగా నియమితం కావడంతో యూపీ కాంగ్రెస్ శ్రేణులకు గెలుపుపై కాస్త ధీమా పెరిగినట్లయింది. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ తరఫున సీఎం అభ్యర్థి రేసులో ఇప్పుడు ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ పేరు వినిపిస్తోంది. సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రాకు యూపీలో ప్రధాన ప్రచారకర్త బాధ్యతల్ని అప్పగించాలని పార్టీ భావిస్తోందని తెలిపాయి. ఇప్పటికే యూపీలో సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, భాజపాలు పోటాపోటీగా ఎన్నికలకు సిద్ధమవుతుంటే వారికి దీటుగా కాంగ్రెస్ పోరులో నిలిచేందుకు ప్రయత్నిస్తోంది. బ్రాహ్మణ వ్యక్తిని సీఎం అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా యూపీ ఎన్నికల్లో లబ్ధి చేకూరుతుందని ప్రశాంత్ కిషోర్ సూచనలతో కాంగ్రెస్ ముందుకు వెళుతున్నట్లు కనిపిస్తోంది. మొత్తంగా ప్ర‌ధాన‌మంత్రుల రాష్ట్రంగా పేరున్న యూపీ ఎన్నిక‌ల‌కు ఎంతో ముందునుంచే పొలిటిక‌ల్ హీట్‌ను తెర‌మీద‌కు తెస్తోంది.
Tags:    

Similar News