టీమ్ మెంబర్స్ కు మోడీ క్లాస్

Update: 2016-01-28 04:53 GMT
కేంద్రం పని తీరును.. కేంద్రమంత్రుల మీద తన మనసులో దాగున్న అసంతృప్తిని ప్రధాని మోడీ బయటపెట్టేశారు. బుధవారం ఉదయం క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించిన ఆయన.. అసాధారణ రీతిలో సాయంత్రం తన ఇంట్లో మొత్తం మంత్రుల్ని పిలిపించుకున్న ఆయన దాదాపు రెండు గంటలకు పైనే సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రులకు తనదైన శైలిలో క్లాస్ పీకినట్లు తెలుస్తోంది.

కేంద్రంలో ప్రభుత్వం కొలువుతీరి రెండేళ్లు అవుతుందని..ఈ రెండేళ్లలో చేసిందేమీ లేదని.. డిజిటల్ ఇండియా.. మేకిన్ ఇండియా..స్వచ్ఛభారత్ మీద తాను చాలానే ఆశలుపెట్టుకున్నా.. ఆచరణలో అలాంటిదేమీ కనిపించలేదన్న నిజాన్ని తేల్చి చెప్పిన ఆయన.. తమకింకా రెండేళ్లు మాత్రమే టైం ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు. మిగిలిన మూడేళ్లలో చివరి సంవత్సరం ఎన్నికల ఏడాది అయితే.. చేతికి మిగిలింది కేవలం రెండేళ్లు మాత్రమేనని.. ఈ రెండేళ్లలో తామేం చేయాలన్నా చేయాలని తేల్చి చెప్పటం గమనార్హం.

ఇకపై మంత్రులతా ప్రతి నెలా భేటీ కావాలన్న నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి నుంచి రెండేళ్ల వరకూ వరుసగా ఏవో ఎన్నికలు జరుగుతూనే ఉంటాయని.. తమ పనితీరులో మార్పు రాని పక్షంలో ప్రతికూల ఫలితాలు వెలువడే అవకాశం ఉందని చెప్పిన మోడీ.. ప్రభుత్వ పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని.. పప్పుల ధరల్ని అదుపులోకి తీసుకురావాలన్న విషయాన్ని గుర్తు చేశారు. ఫర్లేదు.. రెండేళ్ల తర్వాత అయినా మోడీకి సామాన్యుడు పడుతున్న కష్టాలు గుర్తుకొచ్చాయే..?
Tags:    

Similar News