దశ ప్రజల్ని మోడీ ఎంతగా మార్చేశాడు..

Update: 2016-11-19 04:36 GMT
డిజిటల్ ప్రపంచంలో ఒకే ఇంట్లో ఉండేవారే మాట్లాడుకోని దౌర్భాగ్య పరిస్థితి. అందరూ కలిసి సరదాగా బయటకు వెళ్లినా..పాడు సెల్ ఫోన్ ఫుణ్యమా అని ఎవరి ప్రపంచంలో వారు బతికేస్తుంటారు. ఒకే కప్పుకింద ఉన్నారన్న మాటే కానీ.. ఎవరి వాట్సప్ వారిదే. ఎవరి ఫేస్ బుక్ వారిదే. ఇలాంటి పరిస్థితుల్లో పక్కింటోడు.. ఎదురింటోడి సంగతే జనాలు పట్టించుకోని పరిస్థితి. ఇలాంటివేళ.. ముక్కుముఖం తెలీనోళ్లతో మాట్లాడటమే కాదు.. వారి కష్టాల గురించి తెలుసుకోవటం.. తన కష్టం గురించి మాటగా చెప్పుకోవటం కొత్తగా కనిపిస్తున్న ధోరణి.

ఇదంతా ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది? అన్న ప్రశ్నలు వేసుకోకుండానే మోడీ గుర్తుకు వచ్చేస్తున్నారు అందరికి. నోట్ల రద్దుపై ఆయన తీసుకున్న నిర్ణయంతో జాతి జనుల జీవితాలు ఒక్కసారిగా మారిపోయాయి. సామాన్యులు.. అసమాన్యులు ఒక్కటైపోయారు. మార్క్స్.. ఏంగిల్స్ లాంటోళ్లు నెత్తి నోరుకొట్టికొని.. విప్లవాల మీద విప్లవాలు చేసినా సాధ్యం కానిది తన ఒక్క కలంపోటుతో అందరిని ఒకేలా చేయగలిగారు (తాత్కాలికంగా).

అప్పటివరకూ వెయ్యినోట్లు జేబులో పెట్టుకొని దర్జాగా తిరిగిన వాడి ముఖం వేలాడిపోతే.. అతడి దగ్గర పని చేసే సామాన్యుడి జేబులో ఉన్న చిల్లర నోట్లు పెద్ద ఆదరవుగా మారింది. మోడీ దెబ్బ సామాన్యులకు శాపంగా మారిందని చెబుతున్నారు కానీ.. అసమాన్యులుగా చెప్పుకునే.. ఫీలయ్యే సెలబ్రిటీలకు ఉక్కిరిబిక్కిరి అయినట్లుగా అయిపోయారు. లేకపోతే. బిపాసాబసు లాంటి యాక్టర్ కోడిగుడ్లు కొనుక్కోవటానికి రూ.100 ఇంటి పనోళ్ల దగ్గర అప్పు తీసుకోవటం ఏమిటి? సింగర్ చిన్మయి.. ఆమె భర్త టీ తాగటానికి వారింటి వాచ్ మెన్ దగ్గర రూ.20 అప్పు తీసుకోవటం ఏమిటి?

ఇదంతా వింటే సామాన్యుడి క్యూ కష్టాలు ఏపాటివి? చాలామంది తమకొచ్చినంత కష్టం మరెవరికీ రాలేదన్నట్లుగా మాట్లాడుతున్నారు కానీ.. అందరికి అలాంటి కష్టాలే ఉన్నాయన్న విషయాన్ని కొంతమంది మర్చిపోతున్నారు. నిత్యం నీతులు వల్లించే వారు.. దేశంలో సైనిక పాలన రావాలండీ.. నియంతృత్వం వస్తే కానీ దేశం బాగుపడిపోదంటూ ఫుల్ గా టిఫిన్ తినేసి.. టీ.. కాఫీలు వగైరాలు గట్రా తాగేసిన సాదాసీదా జనం ఇప్పుడు అగ్గి ఫైర్ అయిపోతున్నారు. సామాన్యుడ్ని ఇంతలా వేధిస్తారా? అని వాపోతున్నవాళ్లు.. గుండెలు బాదుకుంటున్న వాళ్లు ఎంతోమంది.

కానీ.. వీరంతా మర్చిపోతున్న చిన్న చిన్న విషయాలేమంటే.. నిన్నమొన్నటి వరకూ మనం వాడుకున్న కరెంటు బిల్లుల్ని చెల్లించటం కోసం గంటల కొద్దీ క్యూలైన్లో నిలుచొని.. మేం డబ్బులు కడతాం మహా ప్రభో అన్నా.. విసుక్కొని.. గదమాయించే రోజుల్నిమర్చిపోకూడదు కదా? అప్పుడు గుర్తుకు రాని సామాన్యుడి కష్టాలు ఈ రోజు గుర్తుకు రావటం ఏమిటో?

నోట్ల రద్దు నిర్ణయంతో ఏం జరిగిందన్నది చూస్తే.. ఒక్కటి మాత్రం అందరి అనుభవంలోకి వచ్చేసింది. నిన్నటివరకూ రూ.500నోటును సైతం చాలా సింఫుల్ గా చూసే వారు సైతం ఈ రోజు రూపాయి.. రూపాయిని ఆచితూచి ఖర్చు చేయటం.. రూపాయి విలువ ఎంతన్నది అర్థం చేసుకోవటం.. పొదుపుగా వాడుకోవటం కనిపిస్తుంది. అంతేనా.. నోట్ల కష్టాల గురించి ఒకరికొకరు చెప్పుకోవటం కనిపిస్తుంది. అయితే.. దీనిపై కొందరు ఆవేశపడిపోతుంటే.. మరికొందరు సర్ది చెప్పటం కనిపిస్తుంది. మార్పు ఇప్పుడేనా? అని గొంతు పెంచే వారికి తగ్గట్లే.. ఎప్పడైనా మార్పు తప్పదు కదా? ఇప్పటి నుంచే అయితే తప్పేంది?అంటున్నవాళ్లే కాదు.. కష్టాలు సామాన్యుడికి ఏమైనా కొత్తా? అని నిజాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. మరికొందరి ధోరణి ఇంకోలా ఉంది. రద్దు నిర్ణయాన్నిస్వాగతిస్తేనే.. మరింత బాగా ప్లాన్ చేసి ఉంటే బాగుండన్న మాటను చెబుతున్నారు. నిజమే.. చిన్న చిన్నపనుల్నే నూటికి నూరుశాతం చేయలేని మనం.. తాగే నీరు.. పీల్చే గాలి.. నడిచే రోడ్లు.. ఇలా ఒకటి కాకుంటే ఏ ఒక్కటి సక్రమంగా లేకున్నా లైట్ తీసుకొని బతికేస్తున్న మనం.. నోట్ల రద్దుపై తీసుకున్ననిర్ణయం.. దాని పరిణామాల వల్ల పడే ఇబ్బందుల విషయంలో మాత్రం అస్సలు పొరపాట్లే జరగకూడదని అనుకోవటం ధర్మమా? ఇక్కడ మోడీని సమర్థించటం కాదు. వాస్తవంగా చూస్తే.. చిన్నపాటి ఇబ్బందికి కూడా సిద్ధంగా ఉండకపోవటం. ఇబ్బందులు ఎవరికున్నా పట్టనట్లుగా.. ఎవరికి వారుగా బతికేసే జనం.. తమకంటూ చిన్న కష్టం వచ్చినా అమ్మో.. ఇంత కష్టం తెచ్చి మీద పడేస్తారా? అనేయటం చూసినప్పుడే.. కష్టానికి.. సవాళ్లు మనమెంత సిద్ధంగా ఉన్నామన్న విషయం అర్థమవుతుంది. మనం వల్లించే సిద్ధాంతాలు.. చెప్పే ధర్మాలు.. బోధించే నీతుల్ని ప్రాక్టికల్ గా చేసి చూపించాల్సి వచ్చినప్పుడు.. వాటికి భిన్నంగా వ్యవహరించటం ఏమిటి? ఇదంతా ఎందుకంటారా? చెప్పే మాటలకు.. చేసే పనులకు.. ఊహాలకు.. వాస్తవాలకు మధ్య వ్యత్యాసాన్ని ఎవరికి వారు వారి మనసులతో మాట్లాడుకొమ్మని చెప్పటానికే. ప్లీజ్.. కాసేపు మీతో మీరు మాట్లాడుకోవచ్చుగా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News