ఆసియాన్ గోల్డెన్ జూబ్లీ విందులో ఆ వంట‌కం మిస్‌

Update: 2017-11-13 04:15 GMT
ఈ రోజు ప‌త్రిక‌లు అన్నింటిలోనూ అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌.. భార‌త ప్ర‌ధాని మోడీ క‌లుసుకున్న ఒక ఫోటో ప్ర‌ముఖంగా అచ్చేశారు. అన్ని మీడియా సంస్థ‌లు ఈ ఫోటోను క్యారీ చేశాయి. ఇంత‌కీ మోడీ సాబ్ ఎక్క‌డికి వెళ్లారు? ప‌్ర‌స్తుతం ఏ దేశంలో ఉన్నార‌న్న విష‌యంలోకి వెళితే.. ఆగ్నేయాసియా దేశాల సంఘం పొట్టిగా చెప్పాలంటే ఆసియాన్ స్వ‌ర్ణోత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకొని ఫిలిప్పీన్స్ రాజ‌ధాని మ‌నీలాలో భారీ కార్య‌క్ర‌మం జ‌రుగుతోంది.

ఈ వేడుక‌కు అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్‌.. భార‌త ప్ర‌ధాని మోడీతో పాటు ఆసియాకు చెందిన ప‌లువురు దేశాధినేత‌లు హాజ‌ర‌య్యారు.  వివిధ దేశాల నుంచి వ‌చ్చిన అతిధుల గౌర‌వార్థం ఫిలిప్పీన్స్ అధ్య‌క్షుడు రోడ్రిగో ద్యుతెర్జె భారీ విందును ఇచ్చారు. 1300 మంది హాజ‌రైన ఈ  విందులో న‌రేంద్ర‌మోడీ తో పాటు ఇత‌ర నేత‌లంతా ఫిలిప్పీన్స్ జాతీయ దుస్తులైన  బ‌రోంగ్ త‌గ‌లోంగ్ (ఎంబ్రాయిడ‌రీ చొక్కా)ను ధ‌రించారు.

భారీగా అతిధులు హాజ‌రైన ఈ విందులోభారీ మెనూను వ‌డ్డించారు. ఇందులో ఫిలిప్పీన్స్ ప్ర‌సిద్ధ వంట‌కాల్ని చేర్చారు. ఇంత‌వ‌ర‌కూ బాగానే ఉన్నా.. పందిమాంసం వంట‌కాల్ని మాత్రం మెనూలో చేర్చ‌న‌ట్లుగా చెబుతున్నారు. ఆసియా దేశాల‌కు చెందిన చాలాచోట్ల హ‌లాల్‌ ను పాటిస్తార‌ని.. అందుకే ముందుజాగ్ర‌త్త చ‌ర్య‌ల్లో భాగంగా పందిమాంసం వంట‌కాల్ని చేర్చ‌లేదంటూ పాక‌శాస్త్ర నిపుణులు వెల్ల‌డించారు. ఆసియాన్ సంద‌ర్భంగా ఈ రోజు (సోమ‌వారం) మోడీ.. ట్రంప్ ల మ‌ధ్య ద్వైపాక్షిక భేటీ జ‌ర‌గ‌నుంది. వీరి చ‌ర్చ‌ల్లో భార‌త్ - ప‌సిఫిక్ ప్రాంతాల్లోని భ‌ద్ర‌త ప‌రిస్థితులకు సంబంధించిన అంశాల్ని చ‌ర్చించ‌నున్న‌ట్లుగా చెబుతున్నారు.

ఈ స‌మావేశాల్లో చైనాకు చెక్ పెట్టేలా భార‌త్‌.. ఆస్ట్రేలియా.. అమెరికా.. జ‌పాన్ దేశాలతో చ‌తుర్భుజ కూట‌మి ఏర్పాటుకు కీల‌క అడుగు ప‌డిన‌ట్లుగా చెబుతున్నారు. ప‌దేళ్ల క్రితం ఈ ఆలోచ‌న వ‌చ్చిన‌ప్ప‌టికీ ఇన్నాళ్లు ఎలాంటి క‌ద‌లిక లేదు. ఇటీవ‌ల కాలంలో చోటు చేసుకున్న ప‌రిణామాల‌తో జపాన్ ఈ విష‌యాన్ని తెర మీద‌కు తీసుకురాగా.. భార‌త్ అందుకు సానుకూలంగా స్పందించింది. వీరు అనుకున్న‌ట్లుగా కూట‌మిగా ఏర్ప‌డితే భ‌ద్ర‌తా ప‌రంగా చైనా నుంచి ఎదుర‌య్యే స‌వాళ్ల‌ను ఎదుర్కొనే వీలుంటుంది.
Tags:    

Similar News