కేసీఆర్‌కు మోడీ ఇన్విటేష‌న్‌.. తెలంగాణ యోధుడు బెట్టు వీడ‌తారా?

Update: 2023-07-07 09:06 GMT
తెలంగాణ యోధుడుగా.. ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రిగా కేసీఆర్‌.. కేంద్రంపై విరుచుకుప‌డుతున్న విష‌యం తెలిసిందే. నిధులు ఇవ్వ‌డం లేద‌ని.. నీళ్ల వివాదాలు ప‌రిష్క‌రించ‌డం లేద‌ని.. త‌మ‌ను తొక్కేస్తున్నార‌ని.. కేంద్రంలోని మోడీ స‌ర్కారుపై ఆయ‌న నిప్పులు చెరుగుతున్నారు. ఈ క్ర‌మంలోనే తన జాతీయ పార్టీని ఉవ్వెత్తున విస్త‌రించి.. కేంద్రంలోనూ పాగా వేస్తామ‌ని.. కొన్నాళ్ల కింద‌ట చెప్పుకొచ్చారు. ఈ నేప‌థ్యంలోనే మోడీతో ఆయ‌న త‌ర‌చుగా వివాదాల‌కు దిగుతున్నారు.

నీతి ఆయోగ్ స‌మావేశాల‌కు ముఖ్య‌మంత్రుల‌ను ఆహ్వానించినా.. కేసీఆర్ మాత్రం ముఖం చాటేశారు. ఇక‌, ప్ర‌ధాని మోడీ నాలుగు సార్లు హైద‌రాబాద్ వ‌చ్చినా.. క‌నీసం ప్రొటోకాల్ కూడా పాటించ‌కుండా.. ఆయ‌న‌కు కూడా ముఖం చాటేశారు.

ఇలాంటి ప‌రిస్థితిలో అనూహ్యంగా కేంద్రం నుంచి కేసీఆర్‌కు ఆహ్వానం అందింది. ఈ నెల 8న ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ తెలంగాణ‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా రైల్వే శాఖ‌కు సంబంధించిన ప‌లు కార్య‌క్ర‌మాల్లో ఆయ‌న పాల్గొంటారు.

అదేవిధంగా బ‌హిరంగ స‌భ‌లోనూ ఆయ‌న పార్టిసిపేట్ చేయ‌నున్నారు. ఈ క్ర‌మంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు .. ప్ర‌ధాన మంత్రి కార్యాల‌యం నుంచి ప్ర‌త్యేక ఆహ్వానం రెండు రోజుల ముందుగానే అందింది. ''రండి.. ప్ర‌ధాన మంత్రి కార్య‌క్ర‌మంలో పాల్గొనండి'' అని పీఎంవో నుంచి కేసీఆర్ ఆఫీస్ కు వ‌ర్త‌మానం అందింది. అయితే.. దీనిపై ప్ర‌గ‌తి భ‌వ‌న్ వ‌ర్గాలు కానీ.. సీఎంవో కార్యాల‌యం కానీ.. ఎలాంటి స్పంద‌నా తెలియజేయ‌లేదు.

ఇదిలావుంటే.. కేసీఆర్ కుమార్తె క‌విత‌.. ఢిల్లీ మ‌ద్యం కుంభ‌కోణంలో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆమె ను అరెస్టు చేస్తార‌ని కూడా అనుకున్నారు. అయితే.. ఆమె అరెస్టు కాలేదు. ఇక‌, ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందో ఏమో.. కేసీఆర్ కేంద్రంపై మెత‌క వైఖ‌రి అవలంబి స్తున్నారు.

ఇక‌, క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో బీజేపీ చావు త‌ప్పి.. అన్న చందంగా చ‌తికిల ప‌డ‌డంతో తెలంగాణ‌లోనూ దూకుడు త‌గ్గించింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధానమంత్రి కార్యాల‌యం నుంచి నేరుగా ఆహ్వానం అందడం.. కేసీఆర్‌ను రావాల‌ని కోర‌డంతో ప‌రిస్థితుల్లో మార్పు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. మ‌రి కేసీఆర్ ఏం చేస్తారో చూడాలి.

Similar News