మోడీ స‌మ‌ర్పించు..కేసీఆర్ ముంద‌స్తు ఎన్నిక‌లు?

Update: 2018-09-11 05:06 GMT
స్విచ్ క‌నిపించ‌దు. కానీ..లైటు వెలుగుతుంటుంది. ఇలాంటివి మోడీ మెద‌డులో చాలానే ఉంటాయి. తాజాగా తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయాల్ని హాట్ హాట్ గా మార్చేయ‌ట‌మే కాదు.. ప్ర‌జ‌లు సైతం మిగిలిన విష‌యాలు మ‌ర్చిపోయి.. ఎన్నిక‌ల చ‌ర్చ‌ల్లో మునిగిన వైనం చూస్తే.. మోడీనా మ‌జాకానా? అన్న భావ‌న క‌లుగ‌క మాన‌దు.

పూర్తిస్థాయిలో అధికారం చేతిలో ఉండ‌ట‌మే కాదు.. తిరుగులేని రీతిలో ప‌వ‌ర్ ఉండి కూడా తొమ్మిది నెల‌ల ముందు ఎన్నిక‌ల‌కు వెళ్ల‌టం ఎందుకు? అన్న ప్ర‌శ్న‌కు తెలంగాణ అప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్ నోటి నుంచి స‌రైన స‌మాధానం ఇప్ప‌టివ‌ర‌కూ వ‌చ్చింది లేదు. ముంద‌స్తుకు కార‌ణం ఇదేనంటూ స‌రైన పాయింట్ ఇప్ప‌టివ‌ర‌కూ చూపించ‌లేని ప‌రిస్థితి. కానీ.. త‌ర‌చి చూస్తే.. లాజిక‌ల్ గా ఆలోచిస్తే ఆస‌క్తిక‌ర‌మైన కోణం ఒక‌టి క‌నిపించ‌ట‌మే కాదు.. మోడీ మాయాజాలం ఇంత భారీగా ఉంటుందా? అన్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం.

నిజానికి ముంద‌స్తుకు వెళ్లాల్సిన అవ‌స‌రం కేసీఆర్ కు పెద్ద‌గా లేదు. కొన్ని వ‌ర్గాలు చెబుతున్న‌ట్లుగా కేసీఆర్ స‌ర్కారు మీద వ్య‌తిరేక‌త పెరుగుతోంద‌ని.. దీన్ని గుర్తించిన ఆయ‌న..ఆ వ్య‌తిరేక‌త ఒక స్థాయికి చేర‌క‌ ముందే ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని డిసైడ్ అయిన‌ట్లుగా చెబుతున్నారు. త‌ర‌చి చూస్తే.. ఈ వాద‌న‌లో ప‌స లేద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఎందుకంటే.. త‌న మీద పెరిగే వ్య‌తిరేక‌త‌ను ఎలా మేనేజ్ చేయాలో కేసీఆర్ కు తెలిసినంత బాగా మ‌రెవ‌రికీ తెలీదు.

అంతేనా.. త‌న మీద వ్య‌తిరేక‌త పెరిగి.. త‌న‌ను వేలెత్తి చూపించే వేళ‌లో సెంటిమెంట్ అస్త్రాన్ని తెర మీద‌కు తీసుకొచ్చి ప్ర‌జ‌ల్ని భావోద్వేగానికి గురి చేసే మాట‌లు కేసీఆర్ ద‌గ్గ‌ర ట‌న్నులు.. ట‌న్నులు ఉన్నాయ‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. మ‌రి.. అలాంట‌ప్పుడు ముంద‌స్తుకు వెళ్లాల్సిన అవ‌స‌రం ఏంటి? అన్న‌ది చూస్తే.. విప‌క్షాల‌కు ఊహించ‌ని రీతిలో షాకిచ్చి.. దాన్నించి వారు తేరుకునే లోపే ఎన్నిక‌ల‌కు వెళ్లి.. గెలిచేసి రావ‌టంగా మ‌రికొంద‌రు విశ్లేషిస్తున్నారు.

దీనిలోనూ పెద్ద‌గా ప‌స ఉన్న‌ట్లు క‌నిపించ‌దు. ఎందుకంటే.. కేసీఆర్ ముంద‌స్తుకు వెళ్లే ఆలోచ‌న చేస్తున్న‌ట్లుగా గ‌డిచిన మూడు నెల‌లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఎప్పుడు ఎలాంటి నిర్ణ‌యమైనా తీసుకునే స‌త్తా ఉన్న కేసీఆర్‌..ముంద‌స్తుకు వెళితే ఏం చేయాల‌న్న దానిపై రాజ‌కీయ పార్టీలు ప‌క్కాగా ప్లాన్ చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.  కానీ.. అలాంటి ప‌నేమీ చేయ‌లేదు. అలాంట‌ప్పుడు ముంద‌స్తుపై స‌న్న‌ద్ధ‌త లేని వైనాన్ని మ‌రోలా చెప్ప‌టంలో అర్థం లేదు.

ఈ కార‌ణాల్ని ప‌క్కన పెడితే.. కేసీఆర్ ముంద‌స్తుకు ఎందుకు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు అంటే.. దానికి మోడీ స్కెచ్ ఉంద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. అయితే.. మోడీ స్కెచ్ ను కేసీఆర్ ఎందుకు ఓకే చేశారు?  దాని వెనుక ఉన్న అస‌లు ఆలోచ‌న ఏమిట‌న్న దానిపై అస్ప‌ష్ట‌త వ్య‌క్త‌మ‌వుతోంది. అయితే.. మోడీ చెప్పిన‌ట్లే కేసీఆర్ ముంద‌స్తుకు వెళ్లార‌న్న మాట మాత్రం బ‌లంగా వినిపిస్తోంది.

కేసీఆర్ ముంద‌స్తుకు వెళితే మోడీకి లాభం ఏమిటి? అన్న‌ది చూస్తే చాలానే ఉన్నాయ‌ని చెప్పాలి. త్వ‌ర‌లో జ‌ర‌గాల్సిన నాలుగురాష్ట్రాల ఎన్నిక‌ల్లో బీజేపీకి భారీ లాస్ ఖాయ‌మ‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. ఇలాంటి వేళ‌.. నాలుగు రాష్ట్రాల ఎన్నిక‌ల‌కు కాస్త ముందు కానీ.. నాలుగు రాష్ట్రాల‌తో క‌లిపి కానీ తెలంగాణ‌లో ఎన్నిక‌లు జ‌రిగితే.. కేసీఆర్ పుణ్య‌మా అని విజ‌యం ప‌క్కా అన్న మాట వినిపిస్తోంది. మిగిలిన రాష్ట్రాల్లో మోడీ మాష్టారికి త‌గిలే దెబ్బ తీవ్ర‌త‌ను తెలంగాణ‌లో టీఆర్ ఎస్ గెలుపు కాస్త ఊర‌ట‌నిస్తుంద‌ని చెప్పాలి. మూడు రాష్ట్రాల్లో బీజేపీ ప్ర‌భుత్వాల‌పై ఉన్న వ్య‌తిరేక ఓటు కార‌ణంగానే తాము ఓడిపోయామే త‌ప్పించి.. మోడీ మీద ప్ర‌జ‌ల్లో ఎంత‌మాత్రం ఆద‌ర‌ణ త‌గ్గ‌లేద‌న్న వాద‌న‌ను వినిపిస్తారు. అందుకు సాక్ష్యంగా తెలంగాణ‌ను చూపిస్తారు. కాంగ్రెస్ బ‌లోపేతం కావ‌ట‌మే నిజ‌మైతే.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కార‌ణ‌మైన కాంగ్రెస్ మ‌రోసారి ఎందుకు ఓడిపోతుంద‌న్న ప్ర‌శ్న‌తో త‌మ‌కు జ‌రిగే డ్యామేజ్ ను కంట్రోల్ చేస్తార‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. ఈ కార‌ణంతోనే మోడీ స‌మ‌ర్పించిన కేసీఆర్ ముంద‌స్తు ఎన్నిక‌ల చిత్రం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో న‌డుస్తోంద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.


Tags:    

Similar News