శివుడు - తేలు.. ఓ మోడీ కథ..

Update: 2018-10-30 07:44 GMT
మోకాలికి బోడిగుండుకి మెలిపెట్టడం అంటే ఇదే.. బీజేపీలో వ్యక్తిపూజ ఎంతలా పెరిగిపోయిందంటే.. మోడీని అన్న విమర్శను కూడా దేవుడికి అప్లై చేసి తమ హిందుత్వ ఆయుధంతో ప్రత్యర్థులను సైతం డిఫెన్స్ లోకి నెట్టేలా బీజేపీ నేతలు పెట్రేగిపోతున్నారు.   హిందుత్వాన్ని బలంగా.. ఎదుటివారికి బలహీనతగా మార్చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీలో వస్తున్న ఈ నయా పోకడలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి..

కేంద్రమాజీ మంత్రి - కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ఇటీవల ఓ పుస్తకం రాశారు. దాన్ని బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో విడుదల చేసి విశ్లేషణ చేశారు. ఆ పుస్తకంలో ఆర్ ఎస్ ఎస్  అగ్ర నేత.. ఓ పాత్రికేయుడితో  మోడీ వ్యవహారశైలి గురించి చెప్పిన వ్యాఖ్యలను ఉటంకించారు.

‘శివలింగం మీద తేలులాంటి వాడు ప్రధాని మోడీజీ. దాన్ని చేతితో తీయలేం.. తీస్తే కాటేస్తుంది.. అలాగని చెప్పుతో కొట్టలేం.. కింద ఆదిదేవుడైన మహాశివుడికి అపచారం కలుగుతుంది. బీజేపీలో ప్రమాదకరంగా తయారైన  మోడీ తీరు ఇలా ఉంది’ అంటూ ఆర్ ఎస్ ఎస్ నేత చెప్పిన విషయాన్ని పుస్తకంలో రాశానని శశిథరూర్ వెల్లడించారు.

ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ ‘అనగనగా మోడీ మరియు ఒక తేలు కథ’ వైరల్ గా మారింది. మోడీ స్వభావాన్ని అచ్చుగుద్దినట్టు వర్ణించిన శశిథరూర్ పై బీజేపీ శ్రేణులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. నిజానికి ఆ వ్యాఖ్యలు శశిథరూర్ చేసినవి కావు.. ఎవరో ఆర్ ఎస్ ఎస్ సీనియర్ నేత చేసినవి.. అతనెవరో చెప్పాలని బీజేపీ నేతలు ప్రశ్నించాలి. కానీ దాన్ని మరిచిపోయి.. శశిథరూర్ ను టార్గెట్ చేయడం.. అందునా మా హిందూ దేవుడు పరమశివుడిని చెప్పుతో కొడతావా అని దుమారం లేపడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. శశిథరూర్ శివుడిని అవమానించాడంటూ ఎదురుదాడి చేస్తున్నారు.

నిజానికి శివుడిపై భక్తితోనే ఆ తేలును చెప్పుతో చంపడం లేదన్నది శశిథరూర్ మాట... అంటే శివుడిపై భక్తి ఉన్నట్టే.. మరి బీజేపీ నేతలు వాదిస్తున్నట్టు శివుడిని ఎక్కడ అవమానించాడో చెప్పాలి. అర్థం పర్థం లేని విమర్శలతో మోడీ స్వామిభక్తి కోసం ఆరాటపడుతున్న బీజేపీ నేతలు.. పాపం సంబంధం లేని శివుడిని మధ్యలో దూర్చి శశిథరూర్ ను ఆడుకుంటున్నారు. సిద్ధాంతాలు లేని  వ్యక్తి పూజ బీజేపీలో పెరిగిపోయిందనడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ లేదంటున్నారు విమర్శకులు.
   

Tags:    

Similar News