మ‌ళ్లీ మోడీనే పీఎం

Update: 2022-03-10 11:30 GMT
క‌రోనా క‌ట్ట‌డిలో ఘోర వైఫ‌ల్యం.. రైతు వ్య‌తిరేక చ‌ట్టాల‌పై మొండి వైఖ‌రి.. పెరుగుతున్న ఇంధ‌న ధ‌ర‌లు.. పెగాసెస్ వ్య‌వ‌హారం.. దీంతో ప్ర‌జ‌ల్లో పెరుగుతున్న వ్య‌తిరేక‌త‌.. ఈ సారి మోడీ మ‌ళ్లీ గెల‌వ‌డం క‌ష్ట‌మే.. ఇవీ గ‌త కొంత‌కాలంగా వినిపిస్తున్న మాట‌లు. ప్ర‌తిప‌క్ష పార్టీలు కావొచ్చు వివిధ వ‌ర్గాల ప్ర‌జ‌లు కావొచ్చు మోడీ మూడోసారి ప్ర‌ధాని కాలేర‌ని న‌మ్మ‌కంగా చెబుతూ వ‌స్తున్నాయి.

కానీ తాజాగా అయిదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో త‌న‌పై త‌న ప్ర‌భుత్వంపై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌కు మోడీ స‌మాధానం చెప్పార‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. పంజాబ్ మిన‌హా ఉత్త‌రాఖండ్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, గోవా, మ‌ణిపూర్‌లో మ‌ళ్లీ బీజేపీ ప్ర‌భుత్వ‌మే కొలువు దీరనుంది. ఈ నేప‌థ్యంలో మ‌ళ్లీ దేశ ప్ర‌ధాన‌మంత్రిగా మోడీని గెలుస్తార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

దేశ రాజ‌కీయాల్లో ఎంతో కీల‌క‌మైన ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో అధికారాన్ని బీజేపీ నిల‌బెట్టుకుంద‌నే చెప్పాలి. దేశంలోనే అత్య‌ధికంగా అసెంబ్లీ (403) స్థానాలు, లోక‌స‌భ (80) స్థానాలు ఉన్న ఆ రాష్ట్రంలో గెలిచే పార్టీ ఢిల్లీ పీఠానికి చేర‌వ‌వుతుంద‌నే అంచ‌నాలున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలో లోక్‌స‌భ స్థానాల‌కు జ‌రిగే ఎన్నిక‌ల్లో ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉండ‌డ‌మే అందుకు కార‌ణం.

ఇప్పుడు అక్క‌డ వ‌రుస‌గా రెండోసారి విజ‌యంతో క‌మ‌ల ద‌ళం పూర్తి జోష్‌లో ఉంటుంది.  దీంతో మోడీకి ముచ్చ‌ట‌గా మూడోసారి ప్ర‌ధాని అయ్యేందుకు మార్గం సుగ‌మ‌మైందనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. పీఎంగా మోడీ హ్యాట్రిక్ కొట్ట‌డం ఖాయ‌మ‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.

నాలుగు రాష్ట్రాల్లోని ప్ర‌జ‌లు తిరిగి బీజేపీకే ప‌ట్టం క‌ట్ట‌డంతో జ‌నాల్లో ఆ పార్టీపై వ్య‌తిరేక‌త పెద్ద‌గా లేద‌నే విష‌యం స్ప‌ష్ట‌మైంది. ప్ర‌ధానిగా మోడీ నాయ‌క‌త్వానికి, పాల‌న‌కు మంచి మార్కులే ప‌డ్డాయ‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. ముఖ్యంగా యూపీలో బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్‌, స‌మాజ్‌వాదీ పార్టీ తీవ్రంగా ప్ర‌య‌త్నించాయి. తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి, ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ కూడా ఎస్పీ అధినేత అఖిలేష్‌కు మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేసింది.

అయినా ప్ర‌త్య‌ర్థుల‌ను చిత్త‌చేస్తూ సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌, పీఎం మోడీ మ‌రోసారి త‌మ స‌త్తాచాటారు. ఇక గోవాలో పాగా వేయాల‌న్ని మ‌మ‌తా బెన‌ర్జీ ఆశ‌ల‌కు బీజేపీ గండి కొట్టింది. ఉత్త‌రాఖండ్‌, మ‌ణిపూర్‌లో కాంగ్రెస్ ప‌త‌నాన్ని బీజేపీ శాసించింది.
Tags:    

Similar News