మోడీ..యోగి ఏలుబ‌డిలో రాముడు అలానా?

Update: 2018-11-19 04:49 GMT
చెప్పుకోవ‌టానికి ఏమీ లేన‌ప్పుడు క‌మ‌ల‌నాథుల‌కు రాముడు చ‌టుక్కున గుర్తుకు వ‌స్తాడు. తమ రాఫెల్ ఘ‌న‌కార్యం గురించి మాట్లాడ‌టానికి ఏ మాత్రం ఇష్ట‌ప‌డ‌ని వారు ద‌శాబ్దాలుగా మాట్లాడి.. మాట్లాడి.. న‌లిగిపోయిన బోఫోర్సు ఇష్యూను అదే ప‌నిగా తెర‌పైకి తెస్తుంటారు. నిజానికి బోఫోర్సు పుణ్య‌మా అని ప‌లుమార్లు అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్‌.. తాను చేసిన త‌ప్పున‌కు ప్ర‌జ‌లు శిక్షించ‌టం జ‌రిగిపోయింది కూడా.

అయిన‌ప్ప‌టికీ శిక్ష వేసిన విష‌యాన్నే అదేప‌నిగా తెర మీద‌కు తెచ్చే తెలివి మాత్రం క‌మ‌ల‌నాథుల‌దే. కాంగ్రెస్ మీద అటాక్ చేసేందుకు బోఫోర్సు.. ఇందిర‌మ్మ ఎమ‌ర్జెన్సీ.. 2జీ స్కాంల‌ను తెర మీద‌కు తెచ్చే మోడీ ప‌రివారం.. త‌మ ముఖ్య‌నేత తీసుకున్న పెద్ద‌నోట్ల ర‌ద్దు లాంటి భారీ డిజాస్ట‌ర్ నిర్ణ‌యం మీద మాత్రం కిమ్మ‌న‌రు.

బ్యాంకులో దాచుకున్న త‌మ డ‌బ్బును తాము తీసుకోవ‌టానికి యావ‌త్ జాతి మొత్తాన్ని నెల‌ల త‌ర‌బ‌డి రోడ్ల మీద నిల‌బెట్టిన ఘ‌న‌త మోడీదే. మ‌రి.. అంత‌టి నిర్ణ‌యం తీసుకున్న‌దానికి దేశానికి ల‌భించిన లాభం ఏమంటే.. గుండు సున్నా అన్న విష‌యం ఇప్ప‌టికే బ‌య‌ట‌కు రావ‌ట‌మే కాదు.. పెద్ద నోట్ల ర‌ద్దు పెద్ద డ్రామాగా ఆరోప‌ణ‌లు చేసే వారు అంత‌కంత‌కూ ఎక్కువ అవుతున్నారు.

పెద్ద నోట్ల ర‌ద్దుతో దాదాపు రూ.3ల‌క్ష‌ల కోట్లకు పైనే బ్లాక్ మ‌నీ చెల్లుబాటు నుంచి త‌ప్పుకుంటుంద‌ని.. దాంతో పెద్ద ఎత్తున ప్ర‌భుత్వానికి ఆర్థిక ద‌న్ను ల‌భిస్తుంద‌న్న మాట చెప్పిన‌ప్ప‌టికీ.. అవ‌న్నీ మాట‌లే త‌ప్పించి నిజాలు కావ‌న్న వైనం ఇప్పుడు దేశ ప్ర‌జ‌ల‌కు అర్థ‌మైప ప‌రిస్థితి. ఇది స‌రిపోద‌న్న‌ట్లుగా రాఫెల్ డీల్ తో మోడీ ప్రాభ‌వం పూర్తిగా అడుగంటిన వైనాన్ని ఒప్పుకోక త‌ప్ప‌దు.

ఇలాంటివేళ‌.. అప్పుడెప్పుడో ఆగమాగం చేసిన రాముడి మాట క‌మ‌లనాథుల‌కు చ‌టుక్కున గుర్తుకు వ‌చ్చింది. అయోధ్య‌లో రామాల‌యం అంటూ హిందువుల భావోద్వేగంతో ఒక ఆట ఆడుకోవ‌టం తెలిసిందే. రాముడి మీద ఈ మ‌ధ్య‌న బీజేపీ నేత‌ల‌కు ట‌న్నుల లెక్క‌న ప్రేమ పొంగుకొచ్చింది. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ రామాల‌యాన్ని నిర్మిస్తామంటూ వారీ మ‌ధ్య‌న చెల‌రేగిపోతున్నారు. రామాల‌యం మీద అంత ప్రేమే ఉంటే.. గ‌డిచిన నాలుగున్న‌రేళ్లు ఏం చేశారు బాసూ? అన్న ప్ర‌శ్న‌కు ఒక్క‌రంటే ఒక్క బీజేపీ పెద్ద మ‌నిషి స‌మాధానం చెప్ప‌లేని ప‌రిస్థితి.

ఇదిలా ఉంటే.. తాజాగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. మోడీ.. అమిత్ షా అడుగుజాడ‌ల్లో న‌డుస్తూ అయ్య‌గారు చేసిన వ్యాఖ్య‌ల్ని విన్నోళ్ల‌కు ఒళ్లు మండిపోతోంది. ఇంత‌కీ ఆయ‌న‌గారు చేసిన వ్యాఖ్య‌ల్ని చూస్తే.. మోడీలాంటి గొప్ప ప్ర‌ధాని.. యోగి లాంటి గొప్ప సీఎంలు ఉన్నార‌ని.. ఇద్ద‌రూ హిందుత్వ‌ను విశ్వ‌సించే వారేన‌ని వ్యాఖ్యానించారు. అయితే.. అలాంటి వారి ఏలుబ‌డిలోనూ అయోధ్య రాముడు ఒక టెంట్‌ కు ప‌రిమితం కావ‌టం ఏమిటంటూ రాములోరి మీద తెగ ప్రేమ‌ను పొంగించేశారు.

ఇప్ప‌టివ‌ర‌కూ జ‌రిగిన ఆల‌స్యాన్ని ప‌క్క‌న పెట్టేసి.. ఇక‌పై ఎట్టి ప‌రిస్థితుల్లో ఊరుకునేది లేద‌ని.. టెంట్‌ను ప‌క్క‌న పెట్టేసి.. గుడిని అర్జెంట్ గా క‌ట్టేయాలన్న వాద‌న‌ను వినిపిస్తున్నారు. టెంటు వేద‌న.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఆర్నెల్ల ముందు గుర్తుకు రావ‌టం ఏమిటో?
Tags:    

Similar News