రంగంలోకి మోడీ

Update: 2021-07-12 11:30 GMT
దేశ భ‌విత‌ను మార్చే నాయ‌కుడు వ‌చ్చాడంటూ 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ప్ర‌ధాని ప‌ద‌విని అలంక‌రించిన మోడీకి ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. దేశాన్ని అభివృద్ధి వైపు న‌డిపించే దిశ‌గా పెద్ద‌నోట్ల ర‌ద్దు, జీఎస్టీ త‌దిత‌ర నిర్ణ‌యాల‌తో మోడీ ఏదో మంచే చేయ‌బోతున్నార‌నే అభిప్రాయం ప్ర‌జ‌ల్లో క‌లిగింది.  అంత‌ర్జాతీయంగానూ మోడీ మంచి పేరు తెచ్చుకున్నారు. అందుకే 2019 ఎన్నిక‌ల్లోనూ మ‌రోసారి మోడీకి అధికారాన్ని క‌ట్ట‌బెట్టారు. కానీ ఇప్పుడు ప‌రిస్థితులు త‌ల‌కిందులైన‌ట్లు క‌నిపిస్తున్నాయి. దేశంలో విల‌య‌తాండ‌వం చేస్తున్న క‌రోనాను క‌ట్ట‌డి చేయ‌డంలో విఫ‌ల‌మ‌య్యారంటూ మోడీపై దేశ ప్ర‌జ‌ల‌తో పాటు అంత‌ర్జాతీయ మీడియా విమ‌ర్శ‌లు చేస్తోంది. మ‌రోవైపు పెట్రోల్‌, డీజిల్ రేట్లు పెరుగుతూ పోతూనే ఉన్నాయి. రైతులు వ్య‌తిరేకిస్తున్న వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై మోడీ మెండి ప‌ట్టు వ‌ద‌ల్లేదు. దీంతో దేశంలో ఆయ‌న ప్ర‌భ క్ర‌మంగా త‌గ్గుతోంది. ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన మోడీ తాజాగా దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు పూనుకున్నారు.

అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఇటీవ‌ల తొలిసారిగా భారీ ఎత్తున కేంద్ర మంత్రివ‌ర్గంలో మోడీ మార్పులు చేశారు. క‌రోనా క‌ట్ట‌డి వైఫ‌ల్యానికి ఆరోగ్య మంత్రి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌ను బ‌లి చేస్తూ ఆయ‌న‌పై వేటు వేశారు. మ‌రోవైపు ట్విట్ట‌ర్ వివాదంతో అంత‌ర్జాతీయంగా చెడ్డ‌పేరు తెచ్చుకున్న ఐటీ మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్‌నూ తొల‌గించారు. ప్ర‌కాశ్ జ‌వ‌డేక‌ర్‌, స‌దానంద గౌడ్‌, ర‌మేశ్ పోఖ్రియాల్ లాంటి సీనియ‌ర్ మంత్రుల‌కూ ఉద్వాస‌న ప‌లికారు. ప‌నితీరుతో ఆక‌ట్టుకున్న యువ నాయ‌కులకు పెద్ద  ఎత్తున మంత్రి వ‌ర్గంలో చోటు క‌ల్పించారు. ఇక ఇప్పుడు బీజేపీ రాష్ట్ర శాఖ‌ల‌పై మోడీ దృష్టి సారించారు.

వ‌చ్చే ఏడాది జ‌రిగే ఐదు రాష్ట్రాల శాస‌న‌స‌భ ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని త‌న‌పై వ‌స్తున్న వ్య‌తిరేక‌త‌ను త‌గ్గించే ప్ర‌య‌త్నాల‌ను మోడీ ప్రారంభించారు. కేంద్ర మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో భాగంగా ప‌క్క‌న‌పెట్టిన సీనియ‌ర్ మంత్రుల‌కు కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించేందుకు క‌స‌ర‌త్తు జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలోనే మోడీ తాజాగా భాజ‌పా జాతీయ కార్య‌ద‌ర్శుల‌తో త‌న అధికారిక నివాసంలో భేటీ అయ్యారు. ఈ స‌మావేశంలో ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం. మంత్రి ప‌ద‌వులు వదులుకున్న సీనియ‌ర్ల‌ను పార్టీ ప‌ద‌వుల్లో నియ‌మించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది.  

స‌దానంద‌, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌ల‌ను వాళ్ల సొంత రాష్ట్రాలైన  క‌ర్ణాట‌క‌, డిల్లీకి పంప‌నున్న‌ట్లు స‌మాచారం. యూపీకి చెందిన ప్ర‌ముఖ ఓబీసీ నేత సంతోష్ గంగ్వార్‌ను గ‌వ‌ర్న‌ర్‌గా నియ‌మించే అవ‌కాశం ఉంది. థావ‌ర్‌చంద్‌ను గ‌వ‌ర్న‌ర్‌గా పంప‌డంలో ఖాళీ అయిన రాజ్య‌స‌భ స‌భాప‌క్ష నేత ప‌ద‌విని ముక్తార్ అబ్బాస్ న‌ఖ్వీకి లేదా ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌కి అప్పగించే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌దవితో పాటు బిహార్‌, గుజ‌రాత్‌ల‌లో పార్టీ వ్య‌వహారాల బాధ్యుని ప‌ద‌విని కూడా భ‌ర్తీ చేయాల్సి ఉంది. యూపీ, ఉత్త‌రాఖండ్‌, పంజాబ్‌, హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌, గోవా, గుజ‌రాత్‌లలో పార్టీ వ్య‌వ‌హార బాధ్య‌త‌ల‌ను ర‌విశంక‌ర్ ప్ర‌సాద్‌, ప్ర‌కాశ్ జ‌వ‌డేక‌ర్ లాంటి అనుభ‌వం ఉన్న‌వాళ్ల‌కు అప్ప‌గించ‌నున్న‌ట్లు స‌మాచారం. మ‌రి ఈ మార్పులు మోడీకి ఏ మేర‌కు క‌లిసి వ‌స్తాయో చూడాలి.
Tags:    

Similar News