జమ్మూకశ్మీర్ నేతలతో మోడీ భేటి .. ఏం తేల్చారంటే?

Update: 2021-06-24 17:30 GMT
జమ్మూకశ్మీర్ నేతలతో ప్రధాని మోడీ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారి  సమస్యలు విని సావధాన పరిష్కారం దిశగా సాగుతామని మోడీ హామీ ఇచ్చారు. నేతలంతా జమ్మూకశ్మీర్ కు రాష్ట్ర హోదా కోసం పట్టుబడగా కేంద్రం సానుకూలంగా ఉందంటూ మోడీ ఊరట కల్పించారు.

ప్రధాని మోడీతో ఇవాళ జమ్మూకశ్మీర్ కు చెందిన 14 మంది నేతలు సమావేశమయ్యారు. ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్ లో ఉన్న ప్రధాని మోడీ నివాసంలో ఈ భేటికి కేంద్రహోంమంత్రి అమిత్ షా, లెఫ్టినెంట్ గవర్నర్ పాల్గొన్నారు. ఈ భేటిలో జమ్మూకశ్మీర్ లో తీవ్రవాద నిర్మూలన, ప్రజాస్వామ్య స్థాపన కోసం చేపట్టిన చర్యలను నేతలు ఏకరువు పెట్టారు.

ఇక ప్రధాని జమ్మూకశ్మీర్ లో క్షేత్రస్థాయిలో డీడీసీ ఎన్నికలు నిర్వహించామని.. చరిత్రలో తొలిసారి బ్లాక్ స్థాయి ఎన్నికలు కూడా జరిగాయని మోడీ నేతలకు వివరించారు. జిల్లా అభివృద్ధి కౌన్సిళ్ల ఏర్పాటుతో ఈ ప్రాంతంలో ప్రజాస్వామ్యానికి బాటలు వేశామని ప్రధాని చెప్పుకొచ్చారు. పంచాయతీ లోక్ సభ ఎన్నికలను మించి డీడీసీ ఎన్నికల్లో 51శాతం పోలింగ్ నమోదైందని.. ఇది ప్రజాస్వామ్య విజయం అని మోడీ జమ్మూకశ్మీర్ నేతలకు వివరించారు.

కశ్మీర్ ప్రాంతంలోని పంచాయతీలకు రూ.3వేల కోట్ల నిధులు ఇచ్చామని.. తద్వారా వాటి అభివృద్ధికి ఆటంకాలు లేకుండా చేశామని మోడీ తెలిపారు. ప్రతి ఒక్క నేత నుంచి విడివిడిగా అభిప్రాయాలు తెలుసుకున్న మోడీ అనంతరం వారందరూ కలిసి డిమాండ్ చేసిన కశ్మీర్ రాష్ట్ర హోదా, ప్రజాస్వామ్య స్థాపన.. ఎన్నికల నిర్వహణపై సానుకూలంగా స్పందించారు.
Tags:    

Similar News