మోడీని చూసి మోషే ఏమ‌న్నాడు!

Update: 2017-07-06 04:56 GMT
ప్ర‌ధాని మోడీ ఇజ్రాయిల్ ప‌ర్య‌ట‌న‌లో మ‌రో ఆస‌క్తిక‌ర భేటీ ముగిసింది. ముంబ‌యి దాడుల్లో బ‌తికిపోయిన చిన్నారి మోషేను ప్ర‌ధాని మోడీ క‌లిశారు. ఇరువురు కాసేపు మాట్లాడుకున్నారు. త‌న మాట‌ల‌తో చిన్నారి మోషే ప్ర‌ధాని మ‌న‌సును దోచేశారు. అందుకు త‌గ్గ‌ట్లే మోడీ సైతం.. మోషేకు పెద్ద గిఫ్టే ఇచ్చేశారు. ఇంత‌కీ మోషే ఎవ‌రంటారా?

కొన్నేళ్ల క్రితం ముంబ‌యి మ‌హాన‌గ‌రంపై తీవ్ర‌వాదులు దాడులు చేసిన వైనం తెలిసిందే. 2008 న‌వంబ‌రు 26న జ‌రిగిన దాడుల్లో మోషే త‌న త‌ల్లిదండ్రుల్ని కోల్పోయాడు. అప్పుడు మోషే వ‌య‌సు రెండేళ్లు.  నారీమ‌న్ హౌస్ ద‌గ్గ‌ర జ‌రిగిన బాంబు పేలుళ్ల‌లో మోషే పేరెంట్స్ చ‌నిపోయారు. ఇదే స‌మ‌యంలో  మోషేను అత‌ని ఆయా సంద్రా సామ్యూల్స్ ర‌క్షించింది.  ఆ త‌ర్వాత మోషేను ఇజ్రాయెల్‌లో ఉండే అత‌ని బామ్మ‌.. తాత‌య్య‌ల ద‌గ్గ‌ర‌కు చేర్చారు.

చ‌రిత్ర‌లో తొలిసారి భార‌త్ ప్ర‌ధాని ఇజ్రాయెల్ ను ప‌ర్య‌టిస్తున్న నేప‌థ్యంలో.. నాడు ఉగ్ర‌దాడిలో బ‌తికి బ‌ట్ట‌క‌ట్టిన మోషే గురించి తెలుసుకున్న ప్ర‌ధాని మోడీ త‌న ప‌ర్య‌ట‌న‌లో భాగంగా అత‌డ్ని క‌ల‌వ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు.

అందుకు త‌గ్గ‌ట్లే తాజాగా మోషేను మోడీ క‌లిశారు. ఆ చిన్నారిని చూసిన వెంట‌నే మోడీ ఆత్మీయంగా చేతులు చాచి ఆలింగ‌నం చేసుకున్నారు. ఆ సంద‌ర్భంగా చిన్నారి మోషే.. ఐ ల‌వ్యూ మోడీ అంటూ త‌న మ‌న‌సులోని ప్రేమ‌నంతా మాట‌ల్లో కురిపించేశాడు. దీనికి మోడీ భావోద్వేగంతో రియాక్ట్ అయ్యారు.

కుటుంబంతో క‌లిసి భార‌త్‌కు రావాల‌న్న మోడీ.. "ఎప్పుడైనా నువ్వు భార‌త్ రావొచ్చు.. వెళ్లొచ్చు. మీకు ఎప్పుడైనా భార‌త్‌కు వ‌చ్చి వెళ్లేందుకు వీలుగా జీవిత‌కాల కుటుంబ వీసాను అంద‌జేస్తాం" అని హామీ ఇచ్చారు. ఈ భేటీ స‌మ‌యంలో ఇజ్రాయెల్ అధ్య‌క్షుడు కూడా ఉన్నారు. మోడీ మాట‌ల‌కు స్పందించిన అధ్యక్షుడు నెత‌న్యాహు.. మోడీ త‌న‌ను భార‌త్‌కు రావాల‌ని ఆహ్వానించార‌ని.. నువ్వు కూడా నాతో పాటు భార‌త్ రావొచ్చంటూ దేశాధ్య‌క్షుడు మోషేను ఆహ్వానించారు. నాట‌కీంగా సాగిన ఈ ప‌రిణామాలు చూస్తే.. ఇజ్రాయెల్ అధ్య‌క్షుడి భార‌త ప‌ర్య‌ట‌న బృందంలో మోషే ఉండ‌టం ఖాయ‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.


Tags:    

Similar News