మోడీ వ్యూహానికి కాంగ్రెస్ ప్ర‌తి వ్యూహాలు ఏంటి?

Update: 2022-01-09 02:30 GMT
ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల షెడ్యూల్ వ‌చ్చేసింది. ఇక‌, పార్టీల ప్ర‌చారమే త‌రువాయి. ఫిబ్ర‌వ‌రి 10 నుంచి మొత్తం ఏడు ద‌శ‌ల్లో ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నుండ‌గా.. మ‌ణిపూర్ వంటి ఈశాన్య రాష్ట్రంలో రెండు ద‌శ‌ల్లో ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. అయితే.. పంజాబ్‌, గోవా, ఉత్త‌రాఖండ్ రాష్ట్రాల్లో మాత్రం ఒకే ఒక ద‌శ‌తో ఎన్నిక‌లు పూర్తి కానున్నాయి. స‌రే! ఎన్నిక‌ల షెడ్యూల్ వ‌చ్చేసిన నేప‌థ్యంలో పార్టీల వ్యూహాలు ఏంటి? అతి పెద్ద‌పార్టీగా ఉన్న బీజేపీని నిలువ‌రించేందుకు జాతీయ పార్టీ కాంగ్రెస్ ఎలా ముందుకు సాగుతుంది? అనేది ఆస‌క్తిగా మారింది. ఎందుకంటే.. ఈ ఎన్నిక‌ల‌ను తేలిక‌గా తీసుకునే అవ‌కాశం ఎంత మాత్రం లేదు.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కురెండున్న‌రేళ్ల స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ.. ఆ ఎన్నిక‌ల‌ను దృష్టిలోపెట్టుకునే కేంద్రంలోని బీజేపీ పెద్ద‌లు ము ఖ్యంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న యూపీ, ఉత్త‌రాఖండ్ రాష్ట్రాల్లో విస్తృతంగా ప‌ర్య‌టించారు. అనేక అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. నిజానికి ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న అంచ‌నా ప్ర‌కారం.. కేవ‌లం ఏడాది వ్య‌వ‌ధిలో యూపీలో రెండు ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల విలువైన అనేక ప్రాజెక్టుల‌కు ప్రారంభోత్స‌వాలు.. శంకు స్థాప‌న‌లు చేశారు మోడీ. ఇక‌, ఉత్త‌రాఖండ్‌లోనూ త‌ర‌చుగా ప‌ర్య‌టించి.. ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టారు. ఇక‌, ఇటీవ‌ల పంజాబ్‌లోనూ ప‌ర్య‌టించాల‌ని అనుకున్నా.. సాధ్యం కాలేదు.

మిగిలిన రాష్ట్రాలు మ‌ణిపూర్‌, గోవా. ఈ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ నే అధికారంలో ఉంది. అదేవిధంగా యూపీలోనూ.. ఉత్త‌రాఖండ్‌లోనూ బీజేపీనే అధికారంలో ఉంది. ఇక‌, మిగిలిన పంజాబ్‌లో మాత్ర‌మే కాంగ్రెస్ అధికారంలో ఉంది. అంటే.. మొత్తం ఐదు రాష్ట్రాల‌కు ఎన్నిక‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో నాలుగు చోట్ల బీజేపీ అధికారంలో ఉండ‌గా.. ఒక్క రాష్ట్రంలో మాత్ర‌మే కాంగ్రెస్ ఉంది. ఈ నేప‌థ్యంలో బీజేపీ ఎత్తుల‌కు కాంగ్రెస్ ఎలాంటి పైఎత్తులు వేస్తుంద‌నేది ఆస‌క్తిగా మారింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న ప‌రిణామ‌ల‌ను గ‌మ‌నిస్తే.. కాంగ్రెస్‌కు వ్యూహం లేక‌పోవ‌డం పెద్ద మైన‌స్‌గా మారింది. వాస్త‌వానికి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కుమ్ములాట‌లు ఎక్కువ‌గా ఉన్నాయి.

గోవా, ఉత్త‌రాఖండ్ రాష్ట్రాల్లోని బీజేపీ నేత‌ల మ‌ధ్య స‌ఖ్య‌త క‌నిపించ‌డం లేదు. పైగా ఉత్త‌రాఖండ్లో సీఎంల‌ను వ‌రుస పెట్టి మార్చారు. ఇక‌, గోవాలో అసంతృప్తి పెల్లుబుకుతుండ‌గా.. నేత‌లు పార్టీకి దూర‌మ‌య్యారు. అయితే.. ఇలాంటి ప‌రిస్థితిని త‌మ‌కు అనుకూలంగా మార్చుకునే ప్ర‌య‌త్నం .. చేయ‌డంలో కాంగ్రెస్ పూర్తిగా విఫ‌ల‌మైంద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, యూపీలో అయితే.. యోగి పాల‌న‌పై క్షేత్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. కానీ, ఇక్క‌డ కూడా కాంగ్రెస్ బ‌ల‌మైన వ్యూహంతో ముందుకు సాగే విధంగా వ్యూహాలు వేయ‌లేక పోతోంది. రాహులా.. ప్రియాంకా.. ఎవ‌రు ఇక్క‌డ పార్టీని న‌డిపిస్తారు? అనే చ‌ర్చ‌ల్లోనే పుణ్య‌కాలం గ‌డిచిపోతోంద‌నే వాద‌న వినిపిస్తోంది. అంటే.. ఎలా చూసుకున్నా.. బీజేపీని ఢీకొనే స‌త్తా.. కాంగ్రెస్‌లో క‌నిపించ‌డం లేద‌ని.. ఆ పార్టీ సీనియ‌ర్లే.. వాపోతున్నారు. ఈ క్ర‌మంలో ఓట‌రు తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.


Tags:    

Similar News