మోడీ మంత్రుల్లో ఉండేదెవరు? ఊడేదెవరు?

Update: 2017-03-16 07:40 GMT
కేంద్ర మంత్రి మనోహర్ పారికర్ గోవా సీఎంగా వెళ్లడంతో తాత్కాలికంగా ఆ బాధ్యతలు అరుణ్ జైట్లీకి అప్పగించినా మంత్రివర్గంలో మార్పులు చేర్పులు తప్పవని తెలుస్తోంది. పునర్ వ్యవస్థీకరణకు ప్రధాని మోడీ అంతా సిద్ధం చేశారని తెలుస్తోంది. ఏప్రిల్ 12 తరువాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని బీజేపీ వర్గాల్లో వినిపిస్తోంది. 12తో పార్లమెంటు సమావేశాలు ముగుస్తుండడంతో విస్తరణకు ఆ తరువాతే తెరతీస్తారని సమాచారం.  దీంతో మంత్రివర్గంలోకి ఎవరిని కొత్తగా తీసుకుంటారు.. ఎవరిని బయటకు పంపిస్తారన్న చర్చలు జరుగుతున్నాయి.
    
మంత్రివర్గంలో ఉన్న ఖాళీలను భర్తీ చేయడం, కొత్తవారికి చోటు ఇవ్వడం ఈ రెండు అంశాల ఆధారంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుంది.  ఇప్పటికే సహాయ మంత్రులుగా రాణిస్తున్న వారికి ప్రమోషన్లు కూడా ఉంటాయని తెలుస్తోంది. రక్షణ మంత్రిగా ఉన్న మనోహర్ పారికర్ గోవా ముఖ్యమంత్రిగా వెళ్లిపోవడంతో ఆయన నిర్వహించిన బాధ్యతలను ప్రధాని మోదీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి అప్పగించారు. నిజానికి ఆర్థిక శాఖ, రక్షణ శాఖలు చాలా పెద్దవి. కనుక ఈ రెండింటినీ జైట్లీయే నిర్వహించే పరిస్థితి లేదు. ఈ దృష్ట్యా మంత్రివర్గ విస్తరణ చేయక తప్పని పరిస్థితి.  ఇక విదేశాంగ శాఖా మంత్రిగా ఉన్న సుష్మాస్వరాజ్ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స  చేయించుకున్న నేపథ్యంలో ఆమె నిర్వహిస్తున్న శాఖ విషయంలోనూ మార్పులు ఉంటాయన్న సమాచారం వినిపిస్తోంది.
    
మోడీ చివరిసారిగా గతేడాది జూలైలో మంత్రివర్గ విస్తరణ చేపట్టారు. స్మృతి ఇరానీని మానవవనరుల శాఖ నుంచి తప్పించి టెక్స్ టైల్స్ శాఖకు పంపారు. సదానందగౌడను న్యాయశాఖ నుంచి గణాంకాల శాఖకు మార్చారు. వెంకయ్యనాయుడికి అదనంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బ్రాడ్ కాస్టింగ్ శాఖను అప్పగించారు. ఎంజే అక్బర్ కు విదేశాంగ శాఖ సహాయ మంత్రి బాధ్యతలు అప్పగించారు.
    
ఇప్పుడు మార్పులు చేస్తే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా ఉన్న ముగ్గురిని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారని తెలుస్తోంది.  ఇలా చేయడం వల్ల వారి సామర్థ్యాలను జాతీయ స్థాయిలో ఉపయోగించుకోవడంతో పాటు ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఉంటే దాన్ని కొద్దికాలం పాటు ఆపగలిగే అవకాశం ఉంటుందన్నది కూడా మోడీ ఆలోచనగా తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News