మోడీ కొత్త పిలుపు: స్టాచ్యూ క్లీనింగ్‌

Update: 2016-01-29 12:34 GMT
దేశం చాలామంది ప్ర‌ధానుల్ని చూసింది. కొంత‌మంది మ‌న‌సుల్ని దోచుకున్నారు. మ‌రికొంద‌రు మ‌న‌సు ద‌రిదాపుల్లోకి రాలేక‌పోయారు. అయితే.. వారంతా ప్ర‌ధానులుగా మాత్ర‌మే గుర్తుంటారు. నెహ్రూ.. లాల్ బ‌హుదూర్ శాస్త్రి.. వాజ్ పేయ్ లాంటి మ‌హానుభావులు సైతం దేశం మొత్తాన్ని త‌మ పిలుపులతో క‌దిలించినోళ్లు.. చీపురు ప‌ట్టించునోళ్లు లేర‌నే చెప్పాలి. కానీ.. త‌న‌కు తాను ఛాయ్ వాలాగా చెప్పుకునే ప్ర‌ధాని మోడీ మాత్రం అందుకు భిన్నంగా సెల‌బ్రిటీల నుంచి సామాన్యుల వ‌ర‌కూ అంద‌రి చేత చీపురు ప‌ట్టించారు. ఊడిపించే ప‌ని మొద‌లెట్టారు. అయితే.. ఆ హ‌డావుడి ఎన్ని రోజులు ఉంద‌న్న విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. ప‌రిస‌రాలు శుభ్రంగా ఉండాల‌న్న మాట‌ను కొద్దిరోజులైనా దేశం మాట్లాడుకున్న సంగ‌తి. అందులో కొందరు శుభ్రతకు అలవాటుపడిపోయారు కూడా.

ఇలాంటి చిన్న చిన్న విష‌యాల‌ను ప్ర‌స్తావిస్తూ దేశ ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో నిలిచిపోయే విల‌క్ష‌ణ వ్య‌క్తిత్వం మోడీ సొంతం. మొన్న‌టి స్వ‌చ్ఛ‌భార‌త్ నినాదం పాత‌బ‌డుతున్న వేళ‌.. తాజాగా స‌రికొత్త నినాదాన్ని షురూ చేశారు. ఒక‌ర‌కంగా చెప్పాలంటే స్వ‌చ్ఛ‌భార‌త్ కు సెకండ్ స్టేజ్ లాంటి ఈ కార్య‌క్ర‌మాన్ని తాజాగా ప్ర‌క‌టించారు మోడీ.

స్టాచ్యూ క్లీనింగ్ అంటున్న ఆయ‌న‌.. స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధులు కావొచ్చు.. రాజ‌కీయ నాయ‌కులు కావొచ్చు.. ప్ర‌ముఖులు కావొచ్చు.. ఎవ‌రైనా స‌రే ఒక గొప్ప వ్య‌క్తిని స్మ‌రించుకునేందుకు ఏర్పాటు చేసే విగ్ర‌హాల‌ను చ‌క్క‌గా క‌డిగి శుభ్రంగా ఉంచాల‌న్న‌ది తాజాగా మోడీ పిలుపు. ఈ కార్య‌క్ర‌మంలోప్ర‌తిఒక్క‌రూ భాగ‌స్వామ్యం కావాలంటున్న ఆయ‌న‌.. ఇందుకోసం సోష‌ల్ మీడియాలో  #statuecleaning పేరిట ఒక హ్యాష్ టాగ్ ఓపెన్ చేశామ‌ని.. ప్ర‌తిఒక్క‌రూ తాము క‌డిగి.. శుభ్ర‌ప‌రిచిన విగ్ర‌హాల ఫోటోల్ని పోస్ట్ చేయాల‌ని.. తాను కొన్ని  ఫోటోల్ని రీట్వీట్ చేస్తానంటూ మోడీ ప్ర‌క‌టించారు. ఏమో.. సుడి తిరిగితే మీరు శుభ్రం చేసిన విగ్ర‌హాన్ని ప్ర‌ధాని రీట్వీట్ చేసే ఛాన్స్ ఉంది సుమా. నిన్న‌టివ‌ర‌కూ చీపురు ప‌ట్టించిన మోడీ.. ఇప్పుడు చెంబుడు నీళ్ల‌ను పట్టుకొని రోడ్ల మీద‌కు వ‌స్తారా? ఏమైనా ఇలాంటి చిత్ర‌మైన పిలుపులు మోడీకి మాత్ర‌మే సాధ్య‌మ‌వుతాయేమో..?
Tags:    

Similar News