మోడీకి కేసీఆర్ సాయం అవ‌స‌ర‌మైందా?

Update: 2017-05-05 07:24 GMT
స‌మ‌కాలీన భార‌త రాజ‌కీయాల్లో య‌మా స్ట్రాంగ్ అయిన ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి ఒక ప్రాంతీయ పార్టీ అధినేత సాయం చేయాల్సిన అవ‌స‌రం ఉందా? అంటే అవున‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అంత పెద్ద మోడీకి.. కేసీఆర్ సాయం ఎందుకు అవ‌స‌ర‌మైంది? ఎలాంటి అవ‌స‌రం అన్న‌ది చూస్తే ఆస‌క్తిక‌రంగా అనిపించ‌క మాన‌దు. త‌న‌దైన శైలిలో దూసుకెళుతున్న మోడీకి లోక్ స‌భ‌లో సంపూర్ణ‌మైన మెజార్టీ ఉన్న‌ప్ప‌టికీ.. రాజ్య‌స‌భ‌లో అలాంటి ప‌రిస్థితి లేదు. 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం సాధించిన మోడీ త‌ర్వాత జ‌రిగిన ప‌లు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మిశ్ర‌మ ఫ‌లితాల్ని మాత్ర‌మే సాధించార‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడదు.

ఢిల్లీ.. బీహార్.. ప‌శ్చిమ‌బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో దారుణ‌మైన ప‌రాభ‌వాన్ని ఎదుర్కొన్నారు. అదే స‌మ‌యంలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లాంటి రాష్ట్రంలో భారీ విజ‌యాన్ని మూట‌గ‌ట్టుకున్నారు. ఏతావాతా ప‌లు రాష్ట్రాల‌ అసెంబ్లీ ఎన్నిక‌ల కార‌ణంగా బీజేపీ కొంత‌మేర ల‌బ్థి పొందినా.. ఆశించినంత మేర కాద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఈ కార‌ణంతోనే.. రాజ్య‌స‌భ‌లో క‌మ‌లనాథులు అంచ‌నా వేసినంత ఎక్కువ‌గా బ‌లాన్ని సంపాదించ‌లేక‌పోయింది.

యూపీలో ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో బంప‌ర్ మెజార్టీని సాధించ‌టంతో రాజ్య‌స‌భ‌లో బీజేపీ గ‌ణ‌నీయంగా బ‌లం పెరిగింద‌ని చెప్పాలి. అయితే.. ఇది బీజేపీ నేత‌ల‌కు సంతృప్తినివ్వ‌లేద‌ని చెప్పాలి. ఎందుకంటే.. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే రాష్ట్రప‌తి ఎన్నిక‌కు అవ‌స‌ర‌మైన ఓట్ల‌కు ఇంకా పాతిక‌వేల ఎల‌క్ట్రోల్ ఓట్లు వెనుక‌బ‌డి ఉంది.

రాష్ట్రప‌తిగా తాను బ‌రిలో నిలిపిన అభ్య‌ర్థిని గెలిపించుకోవ‌టానికి అవ‌స‌ర‌మైన ఓట్ల‌లో మోడీ అండ్ కో 25వేల ఓట్లు దూరాన ఉంది. శివ‌సేన కానీ చివ‌ర్లో షాక్ ఇస్తే.. మ‌రికొన్ని ఓట్లు కూడా అవ‌స‌ర‌మ‌వుతాయి. ఇలాంటి వేళ‌.. బీజేపీ అభ్య‌ర్థికి అవ‌స‌ర‌మైన ఓట్ల కొర‌త‌ను తీర్చే వారు ఎవ‌రున్నారంటే.. కంటి ముందుకు క‌నిపించే అతి పెద్ద ఆప్ష‌న్ తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆరే. తెలంగాణ రాష్ట్ర అధికార‌ప‌క్ష‌మైన టీఆర్ ఎస్‌ కు సొంతంగా ఉన్న ఎమ్మెల్యేల‌తో పాటు.. ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ తో పెరిగిన ఎమ్మెల్యేలు.. వారి కార‌ణంగా సొంతం చేసుకున్న ఎమ్మెల్సీల‌తో.. ఇప్పుడా పార్టీకి ఏకంగా 22వేల ఎల‌క్ట్రోర‌ల్ కాలేజీ ఓట్లు ఉన్నాయి. అంటే.. కేసీఆర్ కానీ మోడీ అండ్ కో కు సాయంగా నిలిస్తే.. వారి రాష్ట్రప‌తి అభ్య‌ర్థి సునాయ‌సంగా విజ‌యాన్ని సొంతం చేసుకోవ‌టం ఖాయం.

ఒక‌వేళ కేసీఆర్ కానీ క‌లిసి రాక‌పోతే..పాతిక‌వేల ఓట్ల‌ను స‌మ‌కూర్చుకోవ‌టం మోడీ అండ్‌కోకు కొత్త త‌ల‌నొప్పిగా మారుతుంది. అందుకే.. రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో కేసీఆర్ కీ రోల్ పోషించే అవ‌కాశం ఉంద‌ని చెప్పొచ్చు. ఇప్పుడున్న రాజ‌కీయ ప‌రిస్థితుల్లో ఎన్డీయే నిలిపే రాష్ట్రప‌తి అభ్య‌ర్థికే త‌న మ‌ద్ద‌తు తెలిపే అవ‌కాశాలుఎక్కువ‌గా ఉన్నాయ‌ని చెబుతున్నారు. త‌మ రాష్ట్రానికి ఉన్న అవ‌స‌రాల్ని తీర్చుకోవ‌టానికి ఈ అవ‌కాశాన్ని వినియోగించుకునే వీలుంద‌ని చెప్పొచ్చు. అయితే.. రాష్ట్రప‌తి అభ్య‌ర్థిని నిర్ణ‌యించే విష‌యంలో ఎంతోకొంత ప్ర‌భావాన్ని చూపించే అవ‌కాశం ఉంద‌ని చెప్పొచ్చు. ఎన్డీయే కూట‌మిలో మిత్ర‌ప‌క్షాలు ఎన్ని ఉన్నా.. ఎవ‌రికి ద‌క్క‌ని ప్రివిలైజ్ రాష్ట్రప‌తి ఎన్నిక సంద‌ర్భంగా కేసీఆర్ కు ద‌క్కే ఛాన్స్ ఉంద‌ని చెబుతున్నారు. మొత్తంగా రాష్ట్రప‌తి ఎన్నిక‌ను స్మూత్ గా పూర్తి చేసుకోవ‌టానికి మోడీ అండ్‌కోకు కేసీఆర్ సాయం చాలా అవ‌స‌ర‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News