అద్వానీకి గౌరవం ఎంతగా పెరిగిపోయిందంటే..

Update: 2016-11-23 04:23 GMT
కాలం మహా సిత్రమైంది. అల్లం లాంటోళ్లను బెల్లం చేస్తుంది.బెల్లం లాంటి వాళ్లనుఅల్లంగా మారుస్తుంది. అలా మార్చే శక్తి ఒక్క కాలానికి మాత్రమే ఉంది. బీజేపీలో ఇప్పుడు అలాంటి పరిస్థితే నెలకొంది. ఎవరినైతే తన శిష్యుడిగా భావించి తయారుచేసుకన్నారో.. అదే శిష్యుడి చేత తానెన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని.. చివరకు సదరు శిష్యుడి మంత్రివర్గంలో తనకు స్థానం దక్కదని.. తన కోరిక అయినా భారత ప్రధాని పదవి దక్కుకుండా పోతుందని బీజేపీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ అస్సలు ఊహించి ఉండరు.ఈ కోర్కెలు తీరకపోవటంలాంటివి పక్కన పెడితే.. తాను ఏ మాత్రం ఊహించని రీతిలో అవమానాలు ఎదురవుతాయని మాత్రం కలలో కూడా అనుకొని ఉండరు.

తన ముందే తనవాడైన వ్యక్తి జట్టు కట్టటం.. తన చుట్టూ తిరిగిన వారు.. తనకు దూరంగా ఉండటమే కాదు.. సమూహంలో ఒక్కడిగా చేసిన వైనం అద్వానీ లాంటి పెద్దమనిషికి కష్టం కలిగించి ఉండొచ్చు. అందుకే కాబోలు ఈ మధ్యన పార్లమెంటులో జరిగిన సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన ఆయన.. చిత్రపటానికి నివాళులు అర్పిస్తూ.. ముందుకెళ్లే క్రమంలో అక్కడే ఉన్న ప్రధాని మోడీ నమస్కారం పెట్టినా.. దాన్ని అస్సలు లెక్కలోకి తీసుకోకుండా.. ఆ మాటకు వస్తే.. మోడీ అన్న వ్యక్తి అక్కడ లేనట్లుగా ముందుకెళ్లిపోయిన వైనం అందరూ కాకున్నా కొందరు మాత్రం గుర్తించిన విషయాన్ని మర్చిపోకూడదు.

ఇందాక చెప్పినట్లు కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదన్నట్లుగా.. నోట్ల రద్దు నిర్ణయంతో విపక్షాలన్నీ అధికారపక్షంపై ఎదురుదాడి చేస్తున్న వేళ.. కురువృద్ధుడి అవసరం.. ఆయన మాట దన్ను మోడీ పరివారానికి అవసరమైనట్లుంది. దీంతో.. ఆయనకు  ఈ మధ్య కాలంలో ఎప్పుడూ దొరకనంత మర్యాద.. గౌరవం లభించటం లాంటి అరుదైన సన్నివేశాలు తాజాగా జరిగిన బీజేపీ పార్లమెంటరీ సమావేశం సందర్భంగా చోటు చేసుకున్నాయని చెప్పాలి.

మంగళవారం దేశ రాజధానిలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ సమావేశానికి హాజరైన అద్వానీ పట్ల.. ప్రధాని మోడీ సహా హేమాహేమీల్లాంటి నేతలంతా ఎంతో మర్యాదను.. గౌరవాన్ని ప్రదర్శించారు. అద్వానీ వచ్చే సమయానికి మొదటి వరుసలో ప్రధాని మోడీకి ఒకవైపు రాజ్ నాథ్ కూర్చంటే.. మరోవైపు కుర్చీ ఖాళీగా ఉంది. అద్వానీ రాకను గుర్తించిన బీజేపీ అగ్రనేతలంతా ఆయనకు సీటు చూపించే పనిలో ఉంటే.. వారితో పాటు ప్రధాని మోడీ సైతం లేచినిలబడి తన పక్కనున్నసీటులో కూర్చోవాలని చూపించిన తీరు చూసినప్పుడు.. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదన్న విషయం అద్వానీకే కాదు.. ఆ సీన్ చూసిన చాలామందికి అనిపించక మానదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News