మోడీ త‌ర్వాతి టార్గెట్ బంగార‌మేనా?

Update: 2016-11-25 11:20 GMT
పెద్ద నోట్ల రద్దు దేశంలోని న‌ల్ల కుబేరుల వెన్నులో వ‌ణుకుపుట్టిస్తున్న ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ త‌దుప‌రి చ‌ర్య‌కు సిద్ధ‌మ‌వుతున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. న‌ల్ల‌ధ‌నంపై యుద్ధం ఇప్పుడే మొద‌లైంద‌న్న ప్ర‌ధాని మోడీ...మ‌రిన్ని క‌ఠిన చ‌ర్య‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నారని కేంద్ర ప్ర‌భుత్వం అంటోంది. ఇప్ప‌టికే నోట్ల ర‌ద్దుతో అక్ర‌మ సంపాద‌న‌ప‌రుల్లో గుబులు పుట్టించిన కేంద్ర ప్ర‌భుత్వం.. త‌న త‌ర్వాతి లక్ష్యాన్ని కూడా ఎంచుకున్న‌ట్లు వార్త‌లు వస్తున్నాయి. మ‌న దేశంలో న‌ల్ల‌ధ‌నం ఎక్కువ‌గా పోగ‌య్యేది భూములు - బంగారం రూపంలోనే. దీంతో నోట్ల ర‌ద్దు త‌ర్వాత కేంద్రం.. బంగారంపై దృష్టిసారించే అవ‌కాశం ఉన్న‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఇళ్ల‌లో బంగారు నిల్వ‌ల‌ను నియంత్రించే దిశ‌గా చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశం ఉందని స‌మాచారం. బంగారం వ్యాపార‌స్తులు ముందు జాగ్ర‌త్త ప‌డుతుండ‌టంతో ఈ మేర‌కు అంచనాలు వెలువ‌డుతున్నాయి.

గ‌త‌వారం దేశంలో గోల్డ్ ప్రీమియ‌మ్స్ రెండేళ్ల గ‌రిష్ఠానికి చేరింది. నోట్ల ర‌ద్దు త‌ర్వాత బంగారం దిగుమ‌తుల‌పై ప‌రిమితులు విధించే అవ‌కాశం ఉంద‌న్న వార్త‌ల నేప‌థ్యంలో బంగారం వ్యాపారస్తులు ఇప్పుడే పెద్ద ఎత్తున కొనుగోళ్లు చేస్తున్నారు. ప్ర‌పంచంలో బంగారం కొనుగోళ్ల‌లో భార‌త్ రెండోస్థానంలో ఉంది. ఏడాదికి సుమారు వెయ్యి ట‌న్నుల బంగారాన్ని భార‌త్ కొనుగోలు చేస్తోంది. ఇందులో సుమారు మూడోవంతు వ్యాపారం న‌ల్ల‌ధ‌నంతోనే జ‌రుగుతున్న‌ట్లు అంచ‌నా. లెక్క‌ల్లోకి రాని సొమ్ముతోనే బంగారాన్ని భారీగా కొనుగోలు చేస్తున్నారు. ఇప్ప‌టికే పెద్ద నోట్ల ర‌ద్దు నిర్ణ‌యంతో న‌గ‌దు ఆధారిత గోల్డ్ స్మ‌గ్లింగ్ త‌గ్గిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. పెద్ద నోట్ల ర‌ద్దు - కొత్త కరెన్సీ కొర‌త వ‌ల్ల ఇప్ప‌టికే వినియోగ‌దారుల ద‌గ్గ‌ర న‌గ‌దు కొర‌త తీవ్ర‌మైంది. ఆ ప్ర‌భావం బంగారం కొనుగోళ్ల‌పై ప‌డే అవ‌కాశం ఉన్న‌ట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా ఈ ప‌రిణామంపై స్పందించ‌డానికి ఆర్థిక‌శాఖ నిరాక‌రించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News