కాశ్మీర్ కు సాయం ఓకే.. ఏపీ సంగతేంది మోడీ

Update: 2015-07-13 23:07 GMT
మోడీకి ముందుచూపు ఎక్కువ. అంతేకాదు.. తాను అనుకున్నదే చేస్తారు కానీ.. మిగిలిన ఏ విషయాన్ని పట్టించుకోరు. జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టాలన్న తన పంతాన్ని తీర్చుకోవటం కోసం ప్రధాన హోదాలో ప్రతి నెలా కాశ్మీర్ కు క్రమం తప్పకుండా వెళ్లేవారు. ఎన్నికలు పూర్తయి.. అక్కడ ప్రభుత్వాన్ని (సంకీర్ణమే అనుకోండి) ఏర్పాటు చేశాక.. కాశ్మీర్ కథ కంచికి చేరింది.

అలా అని మోడీ దృష్టిని నుంచి కాశ్మీర్ దాటి పోలేదు. ఆయన కాశ్మీర్ మీద పట్టు సాధించేందుకు భారీ ప్లాన్ వేశారని చెబుతున్నారు. ముస్లింలకు అత్యంత ప్రీతిపాత్రమైన రంజాన్ పర్వదినాన యావత్ కాశ్మీరీలు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యేలా భారీ తోఫా ఇస్తారని చెబుతున్నారు. ఈ నెల 18 కానీ.. 19 కానీ మోడీ ప్రకటిస్తారని చెబుతున్న ఈ తోఫాతో ఆ మంచు రాష్ట్రం రూపురేఖలు మారిపోతాయని చెబుతున్నారు.

రంజాన్ సందర్భంగా కాశ్మీర్ రాష్ట్రంలో ప్రధాన సమస్యగా ఉన్న నిధుల కొరత.. ఆర్థిక అసమానతలు.. పునరావాసం.. అభివృద్ధి ప్రణాళికలే థ్యేయంగా భారీ ప్యాకేజీని ప్రకటిస్తారని చెబుతున్నారు. ఈ ప్యాకేజీ విలువ రూ.70వేల కోట్ల నుంచి రూ.లక్ష కోట్ల మధ్య ఉంటుందని చెబుతున్నారు. ఈ ప్యాకేజీ ప్రకటించిన తర్వాత.. మైనార్టీల్లో మోడీ ఇమేజ్ మారుతుందన్న అంచనా వ్యక్తమవుతోంది.

కాశ్మీర్ కు ప్యాకేజీ ఇవ్వటాన్ని తప్పుపట్టలేం. వ్యూహాత్మకంగా సరైనదే. మరి.. కాశ్మీర్ మీద మోడీ చూపిస్తున్న శ్రద్ధ.. ఏపీ మీద ఎందుకు చూపటం లేదన్నది ప్రశ్న. సార్వత్రిక ఎన్నికల సమయంలో తిరుపతి.. విశాఖపట్నంలో భావోద్వేగంతో మాట్లాడుతూ.. విభజన వల్ల ఏపీ నష్టపోయిందని.. ఆ నష్టాన్ని తాను తీరుస్తానంటూ సాంత్వన పరిచిన మనిషి.. ఇప్పటివరకూ ఏపీ విషయంలో చెప్పిన ఏ హామీని తీర్చిన పాపాన పోలేదు. కాశ్మీర్ విషయంలో ప్రదర్శించాలని భావిస్తున్న పెద్దమనసు.. ఆంధ్రుల మీద మోడీ ఎందుకు చూపించటం లేదన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఇలాంటి విషయాలపై మోడీ కాకున్నా.. మిగిలిన బీజేపీ నేతలు సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది.
Tags:    

Similar News