`తగ్గేదే లే` అనే పాపులర్ డైలాగ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన కీలక నిర్ణయం విషయంలో వెనకడుగు వేశారు. దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన రైతుల ఉదంతం ఓ వైపు, ఐదు రాష్ట్రాల ఎన్నికలు మరో వైపు ఉన్న తరుణంలో కేంద్ర బడ్జెట్ రూపంలో ఒకింత వెనకడుగు వేశారు. రైతులకు మేలు చేసే పలు నిర్ణయాలను తీసుకున్నారు. ఇంకా చెప్పాలంటే, సామాన్యులు, ఉద్యోగుల కంటే రైతుల హర్షించే నిర్ణయాలనే ఎక్కువగా వెలువరించారు.
పంటల పరిశీలన, భూ రికార్డుల కోసం కిసాన్ డ్రోన్లు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. తద్వారా టెక్నాలజీతో రైతులను అనుసంధానం చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. రైతులకు అద్దెకు వ్యవసాయ పనిముట్లు ఇచ్చే పథకం ప్రవేశపెట్టనున్నట్లు ఆర్థికమంత్రి వెల్లడించారు.
ఈ నిర్ణయం ద్వారా రైతులకు కీలకమైన పనిముట్ల కొరత సమస్య తీరనుంది. 2023ను చిరుధాన్యాల సంవత్సరంగా కేంద్ర మంత్రి ప్రకటించారు. దేశీయంగా నూనె గింజల పంటల పెంపు, రసాయన రహిత వ్యవసాయానికి ప్రోత్సాహం, నదుల అనుసంధానికి పెద్దపీట వేస్తామని కేంద్ర మంత్రి ప్రకటించారు. తద్వారా రైతుల విషయంలో ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు కేంద్ర మంత్రి చెప్పకనే చెప్పారు.
సాగు రంగంలో యాంత్రికీకరణకు పెద్ద ఎత్తున ప్రోత్సాహమిస్తాని తెలియజేశౄరు. వరి- గోధుమ కొనుగోళ్లు, మద్దతు ధరల కోసం రూ.2.37లక్షల కోట్లు కేటాయిస్తున్నామని తీపికబురు చెప్పారు. గంగా పరివాహం వెంబడి నేచురల్ ఫార్మింగ్ కారిడార్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
వ్యవసాయ ఉత్పత్తుల విలువ పెంపు కోసం స్టార్టప్‌లకు ఆర్థికసాయం ఇస్తామని కేంద్ర మంత్రి వెల్లడించారు. మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, త్వరలో కృష్ణా - గోదావరి, కృష్ణా-పెన్నా నధులను అనుసంధానించట్లు కేంద్ర మంత్రి ప్రకటించారు.