మోడీ చెప్పిన చిన్న దీపావళి!

Update: 2016-10-24 12:59 GMT
ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లో పర్యటిస్తోన్న ప్రధాని నరేంద్ర మోడీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అలా అని అవి రాజకీయాలకో - ప్రత్యర్థుల పై విమర్శలకు సంబందించినవో కావు.. నియంత్రణ రేఖ వెంబడి భారత సైన్యం జరిపిన సర్జికల్ దాడులకు సంబందించినవి. ఉత్తరప్రదేశ్‌ లోని వారణాసిలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన ప్రధాని... "మనం సెప్టెంబర్ 29వ తేదీన చిన్న దీపావళి సంబరాలు చేసుకున్నాం" అని అన్నారు. అయితే ఆ రోజును భారతీయులు ఎవరూ మరిచిపోలేరని చెప్పొచ్చు. ఎందుకంటే.. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ లోని ఉగ్రవాద లాంచ్‌ ప్యాడ్లపై భారత సైన్యం విరుచుకుపడి పెద్దసంఖ్యలో ఉగ్రవాదులను హతమార్చింది. ఈ సర్జికల్ స్ట్రైక్ పై శత్రువు తేలు కుట్టిన దొంగలా మిన్నకున్న సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా ఆ రోజును గుర్తుచేసుకున్న మోడీ... "అది మనకు చిన్న దీపావళి" అని అన్నారు. మన సైన్యం సరిహద్దుల్లో తమ ధీరత్వాన్ని ప్రదర్శించినప్పుడు వారణాసి మొత్తం ఆనందం వెల్లువెత్తిందని, అందుకు అందరికీ కృతజ్ఞతలని ఆయన అన్నారు. సైన్యం చూపించిన ధైర్యసాహసాలకు దేశం మొత్తం అభినందనలతో పాటు అపార మద్దతు కూడా తెలిపిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జవాన్లకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేయాలని దేశప్రజలను కోరిన మోడీ... రోజులో ప్రతి నిమిషం మనం వారిపట్ల గర్వంగా ఉన్నామన్న విషయాన్ని తెలియజేయాలని సూచించారు. పగలనక, రాత్రనక సైనికులు మనకోసం పోరాడుతున్నారు కాబట్టి దీపావళి రోజున మన భద్రతాదళాలకు సందేశం పంపుదామని సూచించారు.

కాగా ప్రస్తుతం దేశరాజకీయాల్లో ఉత్తరప్రదేశ్ సెగ బాగా తగులుతున్న సమయంలో మోడీ యూపీ పర్యటన ఆసక్తికరంగా సాగుతోంది. అయితే ఈ విషయాల్లో మోడీ ప్రసంగంలో రాజకీయాల కంటే ఎక్కువగా "సర్జికల్ స్ట్రైక్", "తలాక్" ల విషయాలే ఎక్కువగా ధ్వనిస్తున్నాయి. అయితే యూపీలో బీజేపీ జెండా పాతాలని చాలా ఏళ్లుగా చూస్తోంది, గత 15 ఏళ్లుగా సమాజ్‌ వాదీ పార్టీయే అక్కడ రాజ్యమేలుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News