తారక్ భేటీతో 'ఆర్ఆర్ఆర్' పూర్తి చేసిన మోడీషా

Update: 2022-08-25 04:14 GMT
అనూహ్య పరిణామాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు మోడీషాలు. ఒకేలా ఉండే ఈ ఇద్దరి ఆలోచనా తీరుతోనే లక్క బంగారంగా మారిన ఈ ఇద్దరిని ఏ సందర్భంలోనూ విడదీసి చూడలేని పరిస్థితి. మోడీ ఆలోచనల్ని ఎప్పటికప్పుడు చేతలతో పూర్తి చేసే విషయంలో అమిత్ షా కు మించినోళ్లు లేరనే చెప్పాలి. ఆదివారం తెలంగాణకు వచ్చిన ఆయన.. తన టూర్ మొత్తం అనుకోని భేటీలతో వార్తల్లో వ్యక్తిగా మారారని చెప్పాలి. అన్నింటికి మించిన ప్రముఖ సినీ నటుడు తారక్ అలియాస్ జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ అయిన వైనంపై జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు.

ఎవరెన్ని వాదనలు.. సిద్ధాంతాల్ని తెర మీదకు తీసుకొచ్చినా.. ప్రతి దాన్లోనూ ఏదో ఒక లోపం కనిపిస్తూనే ఉంది తప్పించి.. ఇద్దరిమధ్య భేటీ మర్మం ఏమిటన్న దానిపై పక్కా వాదన వినిపించినోళ్లే కనిపించని వైనం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోందని చెప్పాలి.

తారక్ ను పిలిపించుకొని మరీ భేటీ అయిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీరుపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్ఆర్ఆర్ మూవీకి అభినందనలు తెలియజేసేందుకు తారక్ ను పిలిపించినట్లుగా చెబుతున్నప్పటికి.. చాలామంది ఆ వాదనను అంగీకరించని పరిస్థితి.

నిజంగానే ఆర్ఆర్ఆర్ సినిమాలో అద్భుతంగా నటించిన ఎన్టీఆర్ ను  అభినందించటమే లక్ష్యమైతే.. ఈ సినిమాలో అద్భుతంగా నటించిన రాంచరణ్ ను ఎందుకు ఆహ్వానించలేదు? అన్నది ప్రశ్నగా మారింది. దీనికి వస్తున్న సమాధానం ఆసక్తికరమే కాదు.. నిజమే కదా? అన్నట్లు అనిపిస్తున్నా.. అందులో ఏ మాత్రం నిజం లేదంటున్నారు.

నిజానికి ఇంతవరకు పెండింగ్ ఉన్నది తారక్ అని.. అది కాస్తా పూర్తి అయ్యిందని చెబుతున్నారు. అదెలానంటే.. 'ఆర్ఆర్ఆర్'కి సంబంధించి ఇప్పటికే రాంచరణ్ ను అభినందించటం తెలిసిందే. మరో 'ఆర్' అయిన రాజమౌళి విషయానికి వస్తే.. ఆయన తండ్రికి రాజ్యసభ సీటును కేటాయించటం ద్వారా లెక్కలు సెట్ చేశారని చెప్పాలి.

ఇదంతా చూస్తే.. ఇక మిగిలింది తారక్ ఒక్కరే. తాజాగా ఆయన్ను కూడా పిలిపించిన అమిత్ షా.. తారక్ తో భేటీ ద్వారా.. 'ఆర్ఆర్ఆర్' లెక్కను క్లోజ్ చేసినట్లుగా చెప్పక తప్పదు. ఈ కారణంతోనే తారక్ ను కలవటం ద్వారా.. అటు సినిమాకు సంబంధించిన బ్యాలెన్స్ ను పూర్తిచేయటంతో పాటు.. తమకు అవసరమైన పొలిటికల్ బజ్ ను క్రియేట్ చేయటంలో సక్సెస్ అవుతామన్న ఆలోచనతోనే భేటీఏర్పాటు చేసినట్లుగా చెబుతున్నారు. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా.. ఈ భేటీతో జూనియర్ ఎన్టీఆర్ ఒక్కసారిగా అందరి నోళ్లలో నానారని చెప్పక తప్పదు.
Tags:    

Similar News