జగన్‌ కు ఆ సలహా ఇచ్చింది మోహన్‌ బాబేనట!

Update: 2019-06-02 16:31 GMT
రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్‌ సినిమా - టీవీ - నాటక రంగ అభివృద్ధి సంస్థ(ఎఫ్‌ డీసీ) చైర్మన్‌ పదవికి ప్రముఖ నిర్మాత - తెలుగుదేశం పార్టీ నేత అంబికా కృష్ణ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో టీడీపీ అధికారాన్ని కోల్పోవడంతో ఆయన ఈ నామినేటెడ్ పదవికి రాజీనామా చేశారు. వాస్తవానికి అంబికా కృష్ణకు ఈ పదవి ఇచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో సినీ - టీవీ - నాటక రంగ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. ఆయన ఈ పదవిలో ఉన్నప్పుడే సినిమా రంగంలోని వారికి ఇచ్చే ప్రతిష్టాత్మకమైన నంది అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించారు. ఇప్పుడు ఆయన రాజీనామా చేయడంతో ఆ పదవి ఎవరిని వరిస్తుందోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీనికి కారణం అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో సినీ పరిశ్రమకు చెందిన చాలా మంది ఉండడమే.

 ఎన్నికలకు ముందు చాలా మంది నటులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతేకాదు, ఆ పార్టీ తరపున ప్రచారం కూడా నిర్వహించారు. వీరిలో ఒకరికి ఈ పదవి ఇస్తారని అనుకుంటున్న సమయంలో సహజ నటి జయసుధ పేరు తెరపైకి వచ్చింది. దీంతో ఆమెకు ఎఫ్‌డీసీ చైర్మన్‌ పదవి ఇవ్వబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే, దీనికి సంబంధించిన మరో ఆసక్తికర విషయం తాజాగా బయటకు వచ్చింది. జయసుధ పేరును ప్రతిపాదించింది సీనియర్ నటుడు - మాజీ ఎంపీ మంచు మోహన్‌ బాబు అని తెలుస్తోంది. ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన ఆయన ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. అందుకే ఆయన ఏ సలహా ఇచ్చినా జగన్ అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే జయసుధ పేరు చెప్పారని సమాచారం.

 వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన జయసుధ.. ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత మరోసారి పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆమె.. 2016లో తెలుగుదేశం పార్టీలో చేరారు. అయినా.. ఆ పార్టీలో మొదటి నుంచీ క్రియాశీలకంగా వ్యవహరించలేదు. మొన్నటి ఎన్నికలకు ముందు ఆమె హఠాత్తుగా ఆ పార్టీ నుంచి బయటికి వచ్చి - వైసీపీలో చేరారు. వాస్తవానికి ఆమె చేరిక వెనుక మోహన్‌ బాబు ఉన్నారని ఆ మధ్య ప్రచారం జరిగింది. ఆయన జయసుధను వైసీపీలో చేరమని సలహా ఇచ్చారని - అందుకే ఆమె ఆ పార్టీలో చేరారని వార్తలు వెలువడ్డాయి. అందుకే ఇప్పుడు న్యాయం చేయాలనే ఉద్దేశ్యంతోనే నామినేటెడ్ పదవికి ఆమె పేరును ప్రతిపాదించారని గుసగుసలు వినిపిస్తున్నాయి.


Tags:    

Similar News