ఆ పెద్దాయ‌న‌కు రాష్ట్రప‌తి ప‌ద‌వి వ‌ద్ద‌ట‌

Update: 2017-03-29 13:12 GMT
రాష్ట్రప‌తి ఎన్నిక‌కు మ‌రో మూడు నెల‌ల స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ ఇప్పుడే రాజ‌కీయ వేడి ప్రారంభం అయిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఒక్కో సీనియ‌ర్ నేత పేర్లు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. మొద‌ట బీజేపీ కురువృద్దుడు ఎల్‌కే అద్వానీ పేరు వినిపించింది. అనంత‌రం తెలుగు మీడియాలో ఓ దిగ్గ‌జం పేరుపై చ‌ర్చ సాగింది. ఆ త‌దుప‌రి బీజేపీకి చెందిన ప్ర‌స్తుత టాప్ నాయ‌కుల్లో ఒక‌రైన కేంద్ర మంత్రి వెంక‌య్య నాయుడు పేరు కొంద‌రు ప్ర‌స్తావించారు. అయితే తాను రేసులో లేన‌ని ఆయ‌న కొట్టిపారేశారు. ఇటీవ‌ల ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్ పేరు తెర‌మీద‌కు వ‌చ్చింది. భ‌గ‌వ‌త్‌ను రాష్ట్ర‌ప‌తిని చేయాల‌ని శివ‌సేన ఎంపీ సంజ‌య్‌రౌత్ డిమాండ్ చేసిన విష‌యం తెలిసిందే. దీనికి తాజాగా భ‌గ‌వ‌త్‌ తెర‌దించారు.

గుడి ప‌డ్వా (మ‌రాఠీ కొత్త ఏడాది) సంద‌ర్భంగా రాష్ర్టీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ ఇలాకా అయిన‌ నాగ‌పూర్‌ లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో భ‌గ‌వ‌త్ మీడియాతో మాట్లాడారు. తాను రాష్ట్ర‌ప‌తి రేసులో లేన‌ని భ‌గ‌వ‌త్ ఈ సంద‌ర్భంగా స్ప‌ష్టంచేశారు. మీడియాలో ఏం వార్తలు వస్తున్నాయో అది ఎప్పటికీ జరగదని ఆయన తేల్చి చెప్పారు. సంఘ్ లోనే తాను పనిచేస్తానని, ఒకవేళ తన దగ్గర ఆ ప్రతిపాదన వచ్చినా తాను తిరస్కరిస్తానని భగవత్ అన్నారు. కాగా,  ఇప్ప‌టివ‌ర‌కూ రాష్ట్ర‌ప‌తి ప‌ద‌విని ఆరెస్సెస్ స్వ‌యంసేవ‌క్‌ లు ఎవ‌రూ చేప‌ట్ట‌లేదు. ఇదిలాఉండ‌గా శివ‌సేన ఎంపీ వ్యాఖ్య‌ల‌ను రాజ‌కీయ ఎత్తుగ‌డ‌గా భావిస్తున్నారు. మిత్ర‌ప‌క్షాలు అయిన‌ప్ప‌టికీ శివ‌సేన‌-బీజేపీల  మ‌ధ్య స‌ఖ్య‌త లేద‌నే టాక్ ఉంది. ఇలా రెండు పార్టీల మ‌ధ్య జ‌రుగుతున్న పోరులో భాగంగానే భ‌గ‌వ‌త్ పేరును ఆ పార్టీ ఎంపీ ప్ర‌స్తావించిన‌ట్లుగా దీనిని ప‌రిగ‌ణించారు. తాజాగా ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో నాలుగింట్లో ప్ర‌భుత్వాలు ఏర్పాటు చేసిన బీజేపీ.. రాష్ట్ర‌ప‌తి ఎల‌క్టోర‌ల్ కాలేజీలో సగం మార్క్‌కు ద‌గ్గ‌ర‌లో ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News