ఆయన రూటే సెపరేటు : చంద్రబాబు తో మోహన్ బాబు భేటీ

Update: 2022-07-27 03:44 GMT
మోహన్ బాబు విలక్షణ నటుడే కాదు, ముక్కుసూటి మనిషి. ఆయన ఇంటిపేరు మంచు. అలాగే మంచితనం ఆయన సొంతం. కానీ ముక్కు మీద కోపం ఉంటుంది. ఆయన సినీ హీరోగా ఎన్నో హిట్స్ కొట్టారు. కానీ రాజకీయాల్లో మాత్రం ఎత్తుపల్లాలు చాలా చూశారు. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరిన తొట్ట తొలి టాలీవుడ్ నటుడు ఇంకా చెప్పాలీ అంటే ఎన్టీయార్ పార్టీని ప్రకటించిన మరుక్షణం ఆయన టీడీపీ జెండా ఎత్తారు.

నాడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. తెలుగుదేశం వస్తుందో రాదో తెలియదు అయినా సరే ఆయన డేరింగ్ గా ఎన్టీయార్ కి మద్దతు ఇచ్చారు. ఆనాడు మహామహులైన టాలీవుడ్ ప్రముఖులు ఎన్టీయార్ రాజకీయ ప్రవేశం మీద సైలెంట్ అయ్యారు కానీ మోహన్ బాబు మాత్రం అన్న గారి వెంటే అని చెప్పిన అసలైన తమ్ముడు.

తెలుగుదేశం పార్టీ  విజయం కోసం ఎన్నికల ప్రచార సభలను నిర్వహించిన మోహన్ బాబు అధికార వైభోగాలు మాత్రం అందుకోలేదు. చివరిని ఎన్టీయార్ విపక్షంలో ఉండగా మేజర్ చంద్రకాంత్ సినిమా తీసి ఆ అభిమానంతో ఆయన రాజ్యసభ సభ్యుడు అయ్యారు. అయితే లక్ష్మీ పార్వతి ఎపిసోడ్ లో చంద్రబాబుకు మద్దతుగా నిలిచారు. కానీ రాజ్యసభ మెంబర్ షిప్ కంటిన్యూ కాలేదు.

ఆ మీదట బాబుతోనూ వైరం పెంచుకున్నారు. ఒక్క మాట చెప్పాలీ అంటే రెండు దశాబ్దాలుగా చంద్రబాబుకు దూరంగా మసలిన మోహన్ బాబు చాలా ఇంటర్వ్యూలలో ఆయన గురించి ఏమీ అడగవద్దు అని కూడా గట్టిగా మాట్లాడేవారు. అలాంటి మోహన్ ఒక ఫైన్ ఈవెనింగ్ చంద్రబాబు ఇంటికి వెళ్ళి ఆయనతో భేటీ కావడం అంటే చాలా చాలా రాజకీయ చిత్రంగా చూడాలి.

చంద్రబాబుతో భేటీలో గంటన్నరకు పైగా ఆయన మంతనాలు జరిపారు అని అంటున్నారు. మరి దేన్ని గురించి ఆయన చర్చించారు అన్నది తెలియక పోయినా టీడీపీ అధినేత బాబుతో మోహన్ బాబు సమావేశం కావడం అంటే మాత్రం అది కచ్చితంగా సంచలనమే అవుతుంది. 2019 ఎన్నికల్లో వైసీపీకి మద్దతు పలికిన మోహన్ బాబు చంద్రబాబు మీద చాలా మాట్లాడారు, ఘాటు విమర్శలు చేశారు.

కానీ ఇపుడు మాత్రం ఆయన అదే బాబు వద్దకు వెళ్ళి చల్లగా మంతనాలు జరిపారూ అంటే ఆయన రాజకీయ రూటే సెపరేట్ అనుకోవాలేమో. ఈ మధ్యనే తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ తాను బీజేపీ మనిషిని అని చెప్పుకున్న మోహన్ బాబు అంతలోనే ఇంత మార్పు అన్నట్లుగా చంద్రబాబుని కలవడం అంటే రాజకీయ విశేషంగానే చూడాలని అంటున్నారు.

మోహన్ బాబు రాజకీయం తమాషాగా ఉంటుంది. ఆయన ఎపుడు ఎవరిని కలుస్తారో మరెప్పుడు ఎవరిని విమర్శిస్తారో కూడా ఎవరూ చెప్పలేని పరిస్థితి. దాంతో మోహన్ బాబు టీడీపీలో చేరుతున్నారా అంటే అవును అనే అనుకోవాలేమో. ఏపీలో చంద్రబాబు గ్రాఫ్ పెరుగుతూండడంతో ఆయన పార్టీ అధికారంలోకి వస్తుంది అని మోహన్ బాబు అంచనా వేసి ముందుగానే వచ్చి కలిశారా అన్న చర్చ కూడా ఉంది.

ఏది ఏమైనా కూడా మోహన్ బాబు తీసుకున్న ఈ స్టెప్ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా ఉంది. ఇక మోహన్ బాబు వెంట ఆయన కుమార్తె మంచు లక్ష్మి ఉన్నారు. ఆమె టీడీపీ తరఫున వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా అన్న చర్చ కూడా సాగుతోంది. మొత్తానికి బాబులిద్దరూ చాలా కాలం తరువాత కలసుకుని నవ్వుల పువ్వులు  చిందించిన వైనం మాత్రం ఏపీ రాజకీయాలలో ఇపుడు అతి పెద్ద వైరల్ అవుతోంది.
Tags:    

Similar News