షేక్ హ్యాండ్ ఇవ్వని ట్రంప్.. అధ్యక్షుడి స్పీచ్ పేపర్లు చించేసిన స్పీకర్

Update: 2020-02-05 06:30 GMT
అత్యుత్తమ స్థానాల్లో ఉన్నోళ్లు కొన్నిసార్లు మొహమాటం కోసమైనా కొన్ని పనులు చేస్తుంటారు. అందుకు భిన్నంగా ఎవరేం అనుకున్నా ఫర్లేదు.. నేనేం చేయాలో అది మాత్రమే చేస్తానన్నట్లుగా వ్యవహరించే మొండితనం చాలా అరుదు. ఏం చేయకూడదో అది మాత్రమే చేసే అలవాటున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరు తాజాగా మరోసారి వార్తల్లోకి ఎక్కింది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు.. ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీలకు మధ్య విభేదాలు కొత్తేం కాదు. తాజాగా వీరిద్దరి మధ్య పోరు మరింత ముదిరి పాకాన పడింది. ఒకరికొకరు ఏ మాత్రం తగ్గకుండా వ్యవహరించిన వైనం సంచలనంగా మారింది. తాజాగా వార్షిక ప్రసంగం సందర్భంగా నాన్సీ పెలోజీ ముందుకు వచ్చిన అధ్యక్షుడు ట్రంప్ నకు షేక్ హ్యాండ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. దీనికి ట్రంప్ స్పందిస్తూ.. ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ముందుకు రాలేదు. దీంతో ఒళ్లు మండిన స్పీకర్ నాన్సీ అనూహ్యంగా వ్యవహరించారు.

అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం ట్రంప్ కాంగ్రెస్ ఉభయ సభలను ఉద్దేశించి వార్షిక ప్రసంగం చేశారు. అంతకు ముందు తన ప్రసంగ కాపీని నాన్సీకి అందజేశారు. ఆ సందర్భంగా ఆమె అధ్యక్షుడి కి షేక్ హ్యాండ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ.. అందుకు ట్రంప్ సుముఖంగా లేరు. తాను షేక్ హ్యాండ్ కు చేతిని ఇస్తే.. స్పందించకుండా వెనక్కి తిరిగి వెళ్లిన ట్రంప్ తీరుపై ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

అనంతరం ట్రంప్ తన ప్రసంగాన్ని పూర్తి చేస్తున్న వేళ.. సభలోని వారంతా చప్పట్లు కొట్టే సమయం లో స్పీకర్ స్థానం లో ఉన్న నాన్సీ అనూహ్యం గా అధ్యక్షుల వారి ప్రసంగ కాపీని చించేశారు. దీంతో అక్కడి వారు అవాక్కు అయ్యారు. అధ్యక్షుల వారి ప్రసంగ పత్రాల్ని ఎందుకు చించేశారన్న ప్రశ్నకు ఆమె బదులిస్తూ.. ఆయన చేసిన పనికి ప్రత్యామ్నాయం గా ఇదే మర్యాద పూర్వకమైన పని అని బదులిచ్చారు. గతంలోనూ వీరిద్దరి మధ్య రచ్చ ఘటనలు చోటు చేసుకున్నా.. ఇది మరింత తీవ్రమైనదిగా చెబుతున్నారు.
Tags:    

Similar News