ఇది క‌నీవినీ ఎరుగ‌ని ప్రాజెక్టు.. చంద్రుడినే కింద‌కు దించుతున్న ఆ దేశం!

Update: 2022-09-18 00:30 GMT
దుబాయ్‌.. ఈ పేరు విన‌నివారు ఎక్క‌డా ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. చిన్న‌ప్పుడు చ‌దువుకున్న క‌థ‌ల నుంచి ప్ర‌స్తుతం సినిమాల వ‌ర‌కు దుబాయ్ పేరు నానుతూనే వ‌స్తోంది. అంతేనా గ‌ల్ఫ్ కంట్రీస్‌లో ముఖ్యంగా దుబాయ్‌లో పనిచేసే భార‌తీయ కార్మికుల సంఖ్య కూడా ఎక్కువే. అంతేనా ప్ర‌పంచ ప్రసిద్ధ ప‌ర్యాట‌క ప్రాంతం కూడా దుబాయ్‌. ప్ర‌పంచంలో ఏటా ఎక్కువ మంది ప‌ర్యాట‌కులు వ‌స్తున్న న‌గ‌రాల్లో దుబాయ్ టాప్‌లో నిలుస్తోంది.

కేవ‌లం ఒక‌ప్పుడు ఎడారి ప్రాంత‌మైన దుబాయ్ ఆ త‌ర్వాత ప్ర‌పంచీక‌ర‌ణ‌, ఆర్థికాభివృద్ధితో జెడ్ స్పీడుతో అభివృద్ధి చెందింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా అన్ని దేశాల‌కు మ‌ధ్య స్థానంలో ఉండ‌టం, దాదాపు చాలా దేశాల విమానాల‌కు దుబాయ్ ఒక హాల్ట్‌గా ఉండ‌టం త‌దిత‌ర కార‌ణాల‌తో ఈ న‌గ‌రం అభివృద్ధిలో దూసుకుపోయింది. ఇక ఆ త‌ర్వాత ఆకాశాన్ని తాకుతున్న‌ట్టు ఉండే బుర్జ్ ఖ‌లీపా క‌ట్టాక దుబాయ్‌కు వెళ్లే ప‌ర్యాట‌కుల సంఖ్య విప‌రీతంగా పెరిగింది. మ‌న బాంబే న‌గ‌రం నుంచి సముద్రానికి ఆవ‌ల అతిద‌గ్గ‌ర‌లోనే ఉండ‌టం కూడా భార‌తీయ ప‌ర్యాట‌కుల‌ను ఆ న‌గ‌రం ఆక‌ర్షిస్తోంది. ఒక్క భార‌తీయుల‌నే కాకుండా ప్ర‌పంచ‌వ్యాప్త ప‌ర్యాట‌కుల‌కు గమ్య‌స్థానంగా దుబాయ్ నిలుస్తోంది.

కాగా ఇప్పుడు ఏటా మ‌రో 30 లక్ష‌ల మంది ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్షించే ల‌క్ష్యంతో మ‌రో భారీ ప్రాజెక్టుకు దుబాయ్ సిద్ధ‌మ‌వుతోంది. అచ్చంగా చంద్రుడిని పోలిన మ‌రో చంద్ర మండ‌లాన్ని భూమిపై మూన్ దుబాయ్ పేరుతో నిర్మించ‌నున్నారు. కెనడియన్ ఆర్కిటెక్చరల్ కంపెనీ సాండ్రా జీ మాథ్యూస్ అండ్ మైఖేల్ ఆర్ హెండర్సన్... మూన్ వరల్డ్ రిసార్ట్స్ ఈ అతిపెద్ద మూన్ ప్రాజెక్ట్‌ను 5 బిలియన్ డాలర్ల (రూ. 3,96,85,85,00,000) భారీ వ్య‌యంతో నిర్మించేందుకు ముందుకొచ్చింది. ఈ మేర‌కు దుబాయ్ ప్రభుత్వం ముందు ప్ర‌తిపాద‌న‌ను పెట్టింది.

మూన్ దుబాయ్‌లో భాగంగా మూన్ వరల్డ్ రిసార్ట్స్ నిర్మాణాన్ని నాలుగేళ్లలో పూర్తి చేయనున్నట్లు ఆర్కిటెక్చరల్ కంపెనీ... సాండ్రా జీ మాథ్యూస్ అండ్ మైఖేల్ ఆర్ హెండర్సన్ చెబుతోంది. అలాగే ఈ భారీ నిర్మాణాన్ని 224 మీటర్ల ఎత్తుతో నిర్మించనుంది.

ఇందులో భాగంగా దుబాయ్ లోని మీనా అనే ప్రాంతంలో మూన్ దుబాయ్ పేరిట సరికొత్త ప్రపంచాన్ని యూఏఈ ప్ర‌భుత్వం కెన‌డియ‌న్ కంపెనీతో క‌ల‌సి సృష్టిస్తోంది. ఇది అచ్చం చంద్రుడినే త‌ల‌పిస్తుంద‌ని చెబుతున్నారు. ఇందులోకి వెళ్తే చంద్రుడి ఉపరితలంపై ఉన్న అనుభూతినే కలిగిస్తుంద‌ని పేర్కొంటున్నారు. కేవ‌లం పర్యాటకులే కాకుండా అంతరిక్ష పరిశోధన సంస్థలు సైతం ఇక్కడ తమ వ్యోమగాములకు శిక్షణ ఇచ్చేందుకు అనువుగా దీన్ని తీర్చిదిద్ద వ‌చ్చ‌ని కంపెనీ చెబుతోంది.

ఈ మూన్ రిసార్ట్‌ను 10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తారు. అలాగే లూనార్ పేరిట నిర్మించే ప్రైవేట్ కాలనీలో ఇల్లు కూడా కొనుక్కోవ‌చ్చ‌ట‌. చంద్రుడి ఉప‌రిత‌లంపైకి వెళ్తే ఎలా ఉంటుందో.. అలాంటి అద్భుతమైన అనుభూతిని ఈ ఇళ్లు ఇస్తాయ‌ని చెబుతున్నారు. చంద్రుడిపై ఎలా ఉంటుందో అలాంటి వాతావరణాన్ని లూనార్ కాల‌నీలో సృష్టిస్తారు. స్పేస్ టూరిజంపై ఆస‌క్తి ఉన్న‌వారికి, చంద్రుడిపై ఉండాల‌నుకునేవారి కోసం మొత్తం 300 ప్రైవేట్ నివాస గృహాలు కూడా ఉంటాయి. వీటిని బయటి వ్యక్తులు కొనుగోలు చేయొచ్చ‌ని చెబుతున్నారు. కాగా ఈ మూన్ దుబాయ్ ప్రాజెక్టును బయటి నుంచి చూస్తే అచ్చుగుద్దినట్టుగా చందమామ ఉపరితలాన్ని పోలి ఉంటుందని దీన్ని నిర్మిస్తున్న కెన‌డియ‌న్ కంపెనీ వివ‌రిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News