అలారం మోత‌ను ఆపెయ్యొద్దు...

Update: 2016-07-29 23:30 GMT
ఎవ‌రైనా వ్యాయామం చేయ‌డానికి స‌మ‌యం లేదంటే.. రోగాల‌ను తెచ్చుకోవ‌డానికి స‌మ‌యం కేటాయిస్తున్న‌ట్టు లెక్క‌! స‌గ‌టు మ‌నిషి జీవితం స‌మ‌యంతో ప‌రుగులు తీస్తోంది. ఉద్యోగం - కెరీర్‌ - టార్గెట్స్‌ - మ‌నీ... వీట‌న్నింటి మ‌ధ్య‌లో వ్యాయామం అనేది దిన‌చ‌ర్య జాబితాలో ఉండ‌టం చాలా క‌ష్ట‌మైపోతోంది. రోజుకి ఓ అర‌గంట వాకింగ్ చేసినా ఎంతో మేలు అని డాక్ట‌ర్లు మొత్తుకుంటున్నా కూడా... ఆ 30 నిమిషాలు కేటాయించేందుకు కూడా చాలామందికి స‌మ‌యం ఉండ‌టం లేదు. వ్యాయామం ఎందుకు చేయ‌డం లేదూ అని ఎవ‌రిని అడిగినా... టైమ్ చాల‌డం లేదు గురూ అని చెప్పేవారే ఎక్కువ‌! అయితే, వ్యాయామానికి టైం కేటాయించి తీరాల‌ని చెబుతున్నారు వైద్యులు. రోజుకి 8 గంట‌ల‌కుపైగా కుర్చీల్లో శ‌రీరాన్ని కుదేసి ప‌నిచేస్తున్న‌వారు త‌ప్ప‌నిస‌రిగా వ్యాయామం చేసి తీరాల‌ని అంటున్నారు. స‌రైన శారీర‌క శ్రమ లేక‌పోతే భారీ మూల్యం చెల్లించాల్సి వ‌స్తుంద‌ని చెబుతున్నారు. అంతేకాదు, ఆ మూల్యం ఎంత అనేదానిపై ఇంట‌ర్‌ నేష‌న‌ల్ టీమ్ ఆఫ్ రీసెర్చ‌ర్స్ ఒక పరిశోధ‌న చేశారు.

ఆ ప‌రిశోధ‌న‌లో తేలింది ఏంటంటే... వ్యాయామం లేక‌పోవ‌డం వ‌ల్ల లేనిపోని ఆరోగ్య స‌మ‌స్య‌లు తెచ్చుకుంటూ, వాటిని న‌యం చేసుకునేందుకు ఏటా 67.5 బిలియ‌న్ డాల‌ర్ల‌ను ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు ఖ‌ర్చు చేస్తున్నారు. వారానికి క‌నీసం 150 నిమిషాల‌పాటు శారీర‌క శ్ర‌మ ఉండాల‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. కానీ, ఆ మార్కును దాటుతున్న‌వారు వ‌యోజ‌నుల్లో క‌నీసం 50 శాతం మంది కూడా ఉండ‌టం లేద‌ని ఆ స‌ర్వే ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. వ్యాయామం లేని కార‌ణంగా గుండె జ‌బ్బులు - డ‌యాబెటిస్‌ - క్యాన్స‌ర్ లాంటి రోగాల బారిన ప‌డుతూ ఏటా 50 ల‌క్ష‌ల మంది ప్రాణాలు కోల్పోవాల్సి వ‌స్తోంద‌ని నివేదిక తేల్చింది. రోజులో ఓ గంట‌... లేదంటే క‌నీసం ఓ అర‌గంట ఆరోగ్యం కోసం కేటాయించ‌క‌పోతే భారీ మూల్యం చెల్లించాల్సి వ‌స్తుంది. వ్యాయామానికి స‌మ‌యం కేటాయించ‌క‌పోతే... వైద్య ఖర్చుల‌కు బడ్జెట్ కేటాయించాల్సి వ‌స్తుంది. ఇలాంటి బ‌డ్జెట్ కేటాయింపుల‌క‌న్నా... స‌మ‌యాన్ని స‌ద్వినియోగం చేసుకోవ‌డ‌మే శ్రేయ‌స్క‌రం క‌దా! సో.. ఇంకెందుకు ఆల‌స్యం... అలారం మోత‌ను ఆపెయ్యొద్దు!
Tags:    

Similar News