మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుకు 31 ఏళ్ళు జైలుశిక్ష

Update: 2022-04-09 09:34 GMT
ముంబాయ్ పేలుళ్ళ సూత్రదారి, తీవ్రవాద సంస్ధ లష్కరో తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ కు పాకిస్ధాన్ న్యాయస్ధానం కఠినమైన శిక్షను విధించింది. 2008లో ముంబాయ్ లో జరిగిన వరుసపేలుళ్ళల్లో సుమారు 350 మంది చినిపోగా కొన్ని వేలమంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటన జరిగిన తర్వాత నుండి పేలుళ్ళ సూత్రదారులు, పాత్రదారులంతా పాకిస్ధాన్ కు పారిపోయారు.

అయితే అంతర్జాతీయంగా పాకిస్ధాన్ పై భారత్ తెచ్చిన ఒత్తిడి ఫలితంగా సూత్రదారులు, పాత్రదారులపై సంవత్సరాల తరబడి పాకిస్ధాన్ సుప్రింకోర్టులో విచారణ జరిగింది. అందుబాటులో ఉన్న ఆధారాల ప్రకారం న్యాయస్ధానం శుక్రవారం హఫీజ్ సయీద్ కు 31 సంవత్సరాల జైలు శిక్షను విధించింది. పేలుళ్ళకు సంబంధించిన రెండు కేసుల్లో హఫీజ్ ను న్యాయస్ధానం దోషిగా తేల్చింది. జైలుశిక్షతో పాటు రు. 3.40 లక్షల జరిమానా కూడా విధించింది.

జైలుశిక్ష, జరిమానా కాకుండా హఫీజ్ ఆస్తులన్నింటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, హఫీజ్ నిర్మించినట్లగా ప్రచారంలో ఉన్న మసీదులను, మదర్సాలను కూడా ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని న్యాయస్ధానం ఆదేశించింది.

ఒక్క ముంబాయ్ లోనే కాకుండా మనదేశంలో జరిగిన అనేక పేలుళ్ళ ఘటనల్లో హఫీజ్ హస్తముందని నిఘాసంస్ధలు ఆరోపణలు చేస్తున్నాయి. అయినా ఇంతకాలం పాకిస్ధాన్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవటంలేదు.

హఫీజ్ తీవ్రవాద కార్యకలాపాలు భారత్ ను దాటి అమెరికాతో పాటు ఎన్నో దేశాలను బాగా ఇబ్బందులు పెట్టింది. ముందు అమెరికా హఫీజ్ తలకు కోటి డాలర్లను బహుమతిగా ప్రకటించింది.  దీని ఫలితంగానే అమెరికా ఐక్య రాజ్య సమితిపై బాగా ఒత్తిడి తెచ్చింది. దాంతో హఫీజ్ ను ఐక్యరాజ్యసమతి అంతర్జాతీయ తీవ్రవాదిగా ప్రకటించింది.

అంతర్జాతీయంగా ఉగ్రవాద కార్యకలాపాలకు హఫీజ్ నిధుల సహాయం చేస్తున్నాడని, తీవ్రవాదులకు శిక్షణ ఇప్పిస్తున్నాడని, తీవ్రవాదులకు రక్షణ కల్పిస్తున్నాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అలాగే అంతర్జాతీయంగా మనీల్యాండరింగ్ లో కూడా బాగా బిజీగా ఉన్నట్టు అమెరికా ఆరోపిస్తోంది. ఇలా అన్నీ వైపుల నుండి వచ్చిన ఒత్తిళ్ళ కారణంగా పాకిస్ధాన్ న్యాయస్ధానం హఫీజ్ పై విచారణ జరిపి 31 ఏళ్ళు జైలుశిక్ష విధించింది.
Tags:    

Similar News