జ‌న‌సేలోకి మోత్కుప‌ల్లి..ఇది అలాంటి ఎత్తుగ‌డేన‌ట‌

Update: 2018-08-05 14:30 GMT

తెలంగాణ‌కు చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు - టీడీపీ బ‌హిష్కృత నేత మోత్కుపల్లి నరసింహులు మ‌రోమారు సంచల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న నివాసంలో ఆదివారం మీడియాతో మాట్లాడిన మోత్కుపల్లి నరసింహులు ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు రాజకీయ వ్యభిచారి అని ఆరోపించారు. 40 ఏళ్ల రాజకీయ చరిత్ర అని చెప్పుకునే నీచుడు చంద్రబాబు ప్రజలకు ఏం చేశాడో చెప్పాలని ప్రశ్నిస్తున్నా అంటూ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ``మాటకు కట్టబడని మనిషి చంద్రబాబు. చంద్రబాబు మాటలు నీటి మూటలు. వర్గీకరణ పేరుతో నాడు దళితులను మోసం చేసిన బాబు, నేడు కాపులను మోసం చేయాలని చూస్తున్నాడు` అని ధ్వజమెత్తారు.

పెద్ద మాదిగ అని చెప్పుకున్న చంద్రబాబు ఎందుకు వర్గీకరణ గురించి మాట్లాడట్లేదని మోత్కుప‌ల్లి ప్ర‌శ్నించారు. ``చంద్రబాబు మాయ మాటలు చెప్పి మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏబీసీడీ వర్గీకరణ విషయంలో ఏం చేశాన‌నే విష‌యంలో చంద్ర‌బాబు సమాధానం చెప్పాలి. దళితులను మోసం చేసినట్లు కాపులను మోసం చేస్తాడు. ఇది గ‌మ‌నించాలి`` అని మోత్కుపల్లి విజ్ఞప్తి చేశారు. కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ల కోసం పోరాటం చేస్తున్న ముద్రగడ ప‌ద్మ‌నాభం బయటకు వస్తే చంద్రబాబు భయం వేస్తోందని ఆయ‌న అన్నారు. ``జ‌గన్ కాపులకు రిజ‌ర్వేష‌న్‌ పై స్పష్టత ఇస్తే చంద్రబాబు తన నాయకులతో ఆందోళ‌న‌లు చేపిస్తున్నారు. జగన్ - పవన్ - సీపీఎం - సీపీఐ పార్టీలన్నీ కలిసి అయినా చంద్రబాబుని ఓడించాలి` అని మోత్కుపల్లి విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు చరిత్రహీనుడని మోత్కుప‌ల్లి మండిప‌డ్డారు. ``చంద్రబాబు నందమూరి కుటుంబానికి వెన్నుపోటు పొడిచాడు. టీఆర్ ఎస్  ప్రభుత్వాన్ని వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేశాడు. బీజేపీతో కలిసి పనిచేసి మోడీకి వెన్నుపోటు పొడిచాడు. దళితులకు జడ్జీలుగా అవకాశం ఇవ్వొదోని లేఖ రాసిన దళిత ద్రోహి చంద్రబాబు. వ్యవస్థ కోసం కాకుండా ఓట్ల కోసం  చంద్రబాబు పనిచేస్తున్నాడు`` అంటూ విరుచుకుప‌డ్డారు. చంద్రబాబు తనయుడు సూట్ కేస్‌లు పట్టుకుని తిరుగుతున్నాడుని ఆరోపించారు. ప్ర‌త్యేక హోదాపై చంద్రబాబు చేసేది ధర్మ యుద్ధం కాదు అధర్మ యుద్ధమ‌ని మోత్కుప‌ల్లి వ్యాఖ్యానించారు.

జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ తో స‌మావేశం గురించి వ‌చ్చిన వార్త‌ల‌పై మోత్కుప‌ల్లి న‌ర్సింహులు ఆస‌క్తిక‌రంగా స్పందించారు. అవాస్తవ వార్తలు కావాల‌నే సృష్టిస్తున్నారని ఆయ‌న ఆరోపించారు. త‌న పోరాట దృష్టి మళ్లించే ప్రయత్నంలో  భాగ‌మే ఇంకో పార్టీలో వెళ్తున్నట్లు వ‌స్తున్న క‌థ‌నాలు అని మండిప‌డ్డారు. రాబోయే కాలంలో ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ - జనసేన మాత్రమే ఉంటాయని మోత్కుప‌ల్లి జోస్యం చెప్పారు. తెలంగాణలో తెలుగుదేశం లేదని, ఆ పార్టీకి ఉనికే లేద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.


Tags:    

Similar News