కేసీఆర్ ఇచ్చిన షాక్‌ తో మోత్కుపల్లి సంచలన నిర్ణయం..!

Update: 2019-05-10 13:46 GMT
మాజీ మంత్రి - తెలుగుదేశం పార్టీ బహీష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు సంచలన నిర్ణయం తీసుకున్నారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు టీడీపీని స్థాపించినప్పటి నుంచి అదే పార్టీలో కొనసాగిన ఆయన.. ఎన్నో కీలక పదవులను అందుకున్నారు. అయితే, కొద్ది నెలల క్రితం తెలంగాణ టీడీపీని తెలంగాణ రాష్ట్ర సమితిలో విలీనం చేయాలంటూ వ్యాఖ్యానించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి - ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహానికి గురయ్యారు. ఆ సమయంలో ఆయనపై సంచలన ఆరోపణలు చేసిన మోత్కుపల్లి.. పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. టీడీపీలో ఓ వెలుగు వెలిగిన ఈ సీనియర్ నేత.. పార్టీ నుంచి బయటికొచ్చాక రాజకీయంగా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

 ఏపీలో చంద్రబాబును ఓడించాలంటూ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చిన తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో జత కట్టారు. అదే సమయంలో మోత్కుపల్లి... టీఆర్ ఎస్‌ - జనసేనలో చేరుతున్నారంటూ వార్తలు హల్‌ చల్ చేశాయి. అయితే ఆయనను చేర్చుకోడానికి ఈ పార్టీలు ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో గత డిసెంబర్‌ లో జరిగిన ముందుస్తు ఎన్నికల్లో ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో టీఆర్ ఎస్ అభ్యర్థి చేతిలో దారుణంగా ఓడిపోయారు. అప్పటి నుంచి సైలెంట్‌గా ఉండిపోయిన ఆయన.. ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ముందు తరచూ మీడియా ముందకు వచ్చి చంద్రబాబుపై విమర్శలు చేశారు. అంతేకాదు, ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలని, జగన్‌ ను ముఖ్యమంత్రిని చేయాలని ఏపీ ఓటర్లను కోరారు.

 ఇక ఎన్నికలు ముగిసిన తర్వాత మోత్కుపల్లి తన రాజకీయ భవిష్యత్‌ పై దృష్టి సారించారట. ఇందులో భాగంగానే ఆయన గులాబీ గూటికి చేరేందుకు ప్రయత్నాలు చేశారని తెలిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ను నేరుగా కలిసే అవకాశం లేకపోవడంతో మధ్యవర్తుల ద్వారా ఆయనకు రాయబారం పంపించారని సమాచారం. కొద్దిరోజులుగా రాష్ట్రంలో ఆపరేషన్ ఆకర్ష్‌ను ప్రయోగిస్తున్నందున తన చేరికను కేసీఆర్ స్వాగతిస్తారని మోత్కుపల్లి భావించారట. కానీ, గులాబీ అధినేత మాత్రం దీనికి ఒప్పుకోలేదనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం లోక్‌ సభ ఎన్నికలు కూడా అయిపోవడం వల్లే మోత్కుపల్లిని ఆయన లైట్ తీసుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారని విశ్వసనీయంగా తెలిసింది. ఈ విషయాన్ని ఓ రహస్య సమావేశం ఏర్పాటు చేసి, తన అనుచరులకు కూడా చెప్పారని వినికిడి. మొత్తానికి కేసీఆర్ ఇచ్చిన షాక్‌ తో మోత్కుపల్లి పొలిటికల్ కెరీర్ ముగిసిపోతుందన్న మాట.
Tags:    

Similar News