మోత్కుప‌ల్లి గులాబీ పొత్తు మాట లెక్కేంది బాబు?

Update: 2017-10-08 05:13 GMT
తెలంగాణ టీడీపీలో హాట్ టాపిక్ న‌డుస్తోంది. ఈ మ‌ధ్య తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి. రానున్న ఎన్నిక‌ల్లో తెలంగాణ అధికార‌ప‌క్ష‌మైన టీఆర్ ఎస్‌ తో పొత్తు పెట్టుకునే అవ‌కాశం ఉంద‌న్న మాట‌లు ఆయ‌న నోటి నుంచి రావ‌టం తెలిసిందే. గ‌వ‌ర్న‌ర్ గిరి ప‌క్కాగా వ‌స్తుంద‌న్న గంపెడు ఆశ‌తో ఉన్న ఆయ‌నకు షాకిస్తూ మోడీ నిర్ణ‌యం ఉన్న వేళ‌.. మీడియాతో మాట్లాడిన ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

టీఆర్ ఎస్‌ కు వ్య‌తిరేకంగా తెలంగాణ విపక్షాల‌న్నీ ఒకే తాటి మీద‌కు వ‌స్తాయంటూ టీటీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చెబుతున్న త‌రుణంలో అందుకు భిన్న‌మైన మాట‌ల బాంబును మోత్కుప‌ల్లి పేల్చ‌టం గ‌మ‌నార్హం. కాంగ్రెస్ కు వ్య‌తిరేకంగా తెలుగుదేశం ఆవిర్భ‌వించింద‌ని.. ఆ పార్టీతో పొత్తు ఉండ‌నే ఉండ‌ద‌న్న విష‌యాన్ని మోత్కుప‌ల్లి స్ప‌ష్టం చేశారు. భావ‌సారూప్య‌త అన్న‌ది కాంగ్రెస్ తో ఎంత‌మాత్రం లేద‌ని.. అలాంట‌ప్పుడు ఆ పార్టీతో పొత్తు మాట సాధ్యం కాద‌ని తేల్చేశారు. విప‌క్షాల ఐక్య‌త‌ను దెబ్బ‌తీసేలా మోత్కుప‌ల్లి మాట‌లు ఉండ‌ట‌మే కాదు.. టీడీపీని మిగిలిన పార్టీలు ద‌గ్గ‌ర‌కు తీసుకోన‌ట్లుగా ఆయ‌న మాట‌లు ఉండ‌టం వెనుక ఏదైనా వ్యూహం ఉందా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.

టీఆర్ఎస్ తో జ‌ట్టు క‌ట్టే విష‌యంపై మోత్కుప‌ల్లి సంచ‌ల‌న వ్యాఖ్య చేసినా.. పార్టీ అధినేత చంద్ర‌బాబు సైతం మౌనంగా ఉండ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో దారుణంగా దెబ్బ పార్టీకి.. టీఆర్ఎస్ చేయూత‌తో అయినా ఐదారు సీట్లు గెలుచుకోవ‌చ్చ‌న్న మాట వినిపిస్తోంది. ఓవైపు తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీ లేనే లేదంటూ సీఎం కేసీఆర్ తేల్చేసిన వేళ‌.. టీడీపీతో పొత్తుకు బాబు సిద్దంగా ఉన్నా.. కేసీఆర్ అందుకు ఓకే అంటారా? అన్న సందేహాన్ని ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు.

మోత్కుప‌ల్లి మాట‌లకు మ‌రో ఆస‌క్తిక‌ర విశ్లేష‌ణ చేస్తున్న వారూ లేక‌పోలేదు. పార్టీ నుంచి రేవంత్‌ను సాగ‌నంపే కార్య‌క్ర‌మంలో భాగంగానే పొత్తు మాట‌ల్ని మోత్కుప‌ల్లి మాట్లాడి ఉండొచ్చ‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఓట్ల‌కు నోట్ల కేసులో తాను చిక్క‌ట‌మే కాదు.. త‌న‌ను కూడా అడ్డంగా బుక్ చేసిన రేవంత్ పై బాబు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్న‌ట్లు చెబుతారు. ఓటుకు నోటు ఎపిసోడ్ త‌ర్వాత నుంచి పార్టీ వేదిక‌ల మీద రేవంత్‌ కు బాబు ప్రాధాన్య‌త ఇవ్వ‌క‌పోవ‌టాన్ని ఈ సంద‌ర్భంగా గుర్తు చేస్తున్నారు. రేవంత్‌ ను వ‌దిలించుకోవ‌టానికి వీలుగా తాజా ప‌రిణామాలు చోటు చేసుకుంటున్న‌ట్లుగా చెబుతున్నారు. ఇందులోని వాస్త‌వం ఎంత‌న్న‌ది కాలం మాత్ర‌మే తేలుస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News