శుభవార్త : రాజ‌ధాని రైతుకు గృహ యోగం !

Update: 2022-07-04 06:37 GMT
ఎట్ట‌కేల‌కు ఏపీ స‌ర్కారులో క‌ద‌లిక వ‌చ్చింది. హై కోర్టు తీర్పు నేప‌థ్యంలో అమ‌రావ‌తిలో ప్లాట్ల అభివృద్ధికి సిద్ధం అయింది. ఇందుకు దాదాపు రెండు వంద‌ల కోట్ల రూపాయ‌లు కేటాయించింది. ఇప్ప‌టిదాకా ప‌నులు తాత్సారం చేస్తూ వ‌స్తున్న నేప‌థ్యాన కోర్టు చేసిన సూచ‌న‌లు, ఇచ్చిన ఆదేశాల మేర‌కు సంబంధిత సీఆర్డీఏ అధికారుల్లో చ‌ల‌నం వ‌చ్చింది.

ఇవాళ  అంటే జూలై నాలుగు, 2022, సోమ‌వారం నాడు జోన్ నాలుగులో సంబంధిత ప‌నుల‌కు శంకుస్థాప‌న చేయ‌నుండ‌డం విశేషం. దీంతో  రాజ‌ధాని రైతుల‌లో నెల‌కొన్న ఆందోళ‌న‌ కాస్త‌యిన త‌గ్గుతుంది అని చెప్ప‌వ‌చ్చు.

జోన్ నాలుగు ప‌రిధిలో  అనంతవ‌రం, పిచ్చుకుల పాలెం, దొండ‌పాడులోని కొన్ని ప్రాంతాలు వ‌స్తాయి. వీటి అభివృద్ధి రాష్ట్ర ప్ర‌భుత్వం ప్రాధాన్యం ఇవ్వ‌డం శుభ ప‌రిణామం. ఇప్ప‌టిదాకా వెయ్యి రోజులకుపైగా ఉద్యమాలు చేస్తున్న రైతుల‌తో మాట్లాడేందుకు తాము సిద్ధ‌మేన‌ని మంత్రి బొత్స స‌త్య నారాయ‌ణ లాంటి వారు చెబుతున్నా, అవ‌న్నీ మాట‌ల‌కే ప‌రిమితం అయి ఉన్నాయి. ఇప్ప‌టికైనా రెవెన్యూ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు నేతృత్వంలో అయినా ఓ మంత్రుల క‌మిటీ వేసి చ‌ర్చ‌లు జ‌రిపితే సంబంధిత స‌మ‌స్య‌లు కొలిక్కివ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి.

కోర్టు తీర్పు నేప‌థ్యంలోనే ఈ ఏడాది కౌలు కూడా చెల్లించిన విష‌యం గుర్తుండే ఉంటుంది. క‌నుక కోర్టు చెబితేనే వైసీపీ లో క‌ద‌లిక వ‌స్తోంద‌ని అంటున్నారు. అస‌లు త‌మ స‌మ‌స్య‌లు అన్న‌వి ఏవీ విన‌కుండానే జ‌గన్ కొన్ని ఏక‌ప‌క్ష నిర్ణ‌యాలు తీసేసుకున్నార‌ని, త‌రువాత త‌ప్పు దిద్దుకుని సీఆర్డీఏను పున‌రుద్ధ‌రించి ప్లాట్ల అభివృద్ధికి ఇప్పుడు ప్రాధాన్యం ఇవ్వ‌డం అంటే  ఎప్పుడో జ‌ర‌గాల్సిన ప‌నులు కాస్త ఆల‌స్యంగా అయినా  మొదలవుతున్నాయ‌ని సంబంధిత రైతాంగం అంటోంది.
Tags:    

Similar News