మోడీకి షాకిచ్చిన బరువు తగ్గిన ఎంపీ కుమార్తె

Update: 2022-07-28 04:48 GMT
ఆసక్తికర సన్నివేశం ఒకటి చోటు చేసుకుంది. పార్లమెంటు సమావేశాల సందర్భంగా సందడిగా ఉన్న పార్లమెంటులో ఎనిమిదేళ్ల చిన్నారి ఒకరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసే అరుదైన అవకాశం లభించింది. అయితే.. ఆ చిన్నారి మాటతో ప్రధాని మోడీకి ఊహించని షాక్ తగిలింది. ఆమె చెప్పిన మాటతో ఆయన ఒక్కసారిగా నవ్వేసి.. చాక్లెట్ ఇచ్చిన వైనం ఆసక్తికరంగా మారింది.

వార్తల్లోకి వచ్చిన ఈ ఎనిమిదేళ్ల చిన్నారి తండ్రి బీజేపీ ఎంపీ. ఆయన కూడా మామూలు ప్రొఫైల్ కాదు. ఈ మధ్యన పెద్ద ఎత్తున వార్తల్లోకి వచ్చిన అతగాడి పనికి ప్రజలంతా తెగ సంతోషపడ్డారు. ఇంతకీ ఆ ఎంపీ ఎవరు? ఆయనేం చేశారు? ఆయన కుమార్తె మోడీని ఏమన్నది? లాంటి ప్రశ్నలు వస్తున్నాయి కదా. వాటికి సంబంధించిన వివరాల్ని చూస్తే..

మోడీ హవా కారణంగా ఇప్పుడు లోక్ సభలో బీజేపీ ఎమ్మెల్యేలకు కొదవ లేదు. ఒకప్పుడు ఇద్దరు మాత్రమే ఉన్న ఎంపీలు కాస్తా.. ఇప్పుడు 282 మందితో కాషాయ దళం కళకళలాడుతోంది. వీరిలో ఒక ఎంపీ చాలా స్పెషల్. ఆయన పేరు ఆహనా ఫిరోజియా. మధ్యప్రదేశ్ లోని ఉజ్జైన్ నియోజకవర్గం నుంచి తొలిసారి బీజేపీ ఎంపీగా ఎన్నికయ్యారు. భారీ ఆకారంలో ఉండే ఈ ఎంపీకి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ భారీ ఆఫర్ ఇవ్వటంతో ఆయన వార్తల్లోకి వచ్చి.. దేశ ప్రజలకు సుపరిచితులయ్యారు.

భారీ బరువున్న ఆయన్ను.. బరువు తగ్గితే.. ఆయన నియోజకవర్గానికి నిధులు ఇస్తానంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ఒక కేజీ బరువు తగ్గితే.. రూ.వెయ్యి కోట్ల నిధులు ఇస్తానన్న గడ్కరీ మాటల్ని సీరియస్ గా తీసుకున్న సదరు ఎంపీ.. ఏకంగా 21 కేజీల బరువు తగ్గారు. దీంతో.. ఆయన నియోజకవర్గానికి రూ.21 వేల కోట్లు ఇచ్చేందుకు గడ్కరీ సిద్ధమవుతున్నారు. కేంద్ర మంత్రి మాటలతో భారీగా బరువు తగ్గిన ఆయన.. తాజాగా భార్య తన ఎనిమిదేళ్ల కుమార్తెను తీసుకొని పార్లమెంటుకు వచ్చారు.

ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆయన కలిశారు. తనను కలిసేందుకు వచ్చిన చిన్నారిని దగ్గరకు తీసుకొన్న మోడీ.. 'నేనెవరు?' అని ప్రశ్నించారు. దీనికి ఆమె.. మోడీ అంటూ కరెక్టుగా బదులిచ్చింది. అంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. తర్వాత ప్రశ్నకు మోడీ ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ చిన్నారిని తాను ఏం చేస్తుంటానో చెప్పాలని అడగ్గా.. 'మీరు లోక్ సభ టీవీలో పని చేస్తుంటారు కదా' అంటూ సమాధానం ఇచ్చింది.

టీవీలో ఎక్కువగా కనిపించటమే దీనికి కారణమై ఉండొచ్చు. ఎనిమిదేళ్ల చిన్నారి మాటలకు మోడీ గట్టిగా నవ్వేశారు. అనంతరం ఆ చిన్నారికి చాక్లెట్లు ఇచ్చి మరీ పంపారు. మొత్తానికి టీవీల్లో మోడీ ఎక్కువగా కనిపిస్తారన్న విషయం తాజా ఉదంతం మరోసారి స్పష్టం చేసిందని చెప్పాలి. ఎనిమిదేళ్ల చిన్నారికి ప్రధాని నుంచి ఎదురైన ప్రశ్నకు వచ్చిన సమాధానాన్ని మోడీ ఇప్పట్లో మర్చిపోలేరేమో?
Tags:    

Similar News