రాత్రి వేళ.. ఎంపీ అర్వింద్ హౌస్ అరెస్టు.. కారణం ఇదేనట

Update: 2021-03-09 02:50 GMT
నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ను బంజారాహిల్స్ పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. సోమవారం రాత్రి చోటు చేసుకున్న ఈ పరిణామం కొద్దిపాటి ఉద్రిక్తతకు దారి తీసింది. ఏం తప్పు చేశారని అర్వింద్ ను హౌస్ అరెస్టు చేశారన్న విషయంలోకి వెళితే.. ఆదివారం రాత్రి వేళ భైంసాలో చోటు చేసుకున్న హింస నేపథ్యంలో ఆయన అక్కడకు వెళ్లాలని భావించారు.

తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న భైంసాలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో.. ఎంపీ అర్వింద్ భైంసా పర్యటన ఉద్రిక్తలకు తావిస్తుందన్న ఉద్దేశంతోనే పోలీసులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు. బంజారా హిల్స్ లోని ఆయన నివాసం నుంచి బయటకు వచ్చిన ఎంపీ అర్వింద్ ను ఎక్కడకు వెళ్లకూడదంటూ పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఆయన్ను ఆయన నివాసానికే తరలించారు.

భైంసాలో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు ఇంటి నుంచి బయటకు వెళ్లొద్దని ఆయనకు పోలీసులు సూచించారు. భైంసా పర్యటనకు సిద్ధమైనందునే ఆయన్ను హౌస్ అరెస్టు చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఆదివారం రాత్రి జరిగిన  ఒక చిన్న ఘటన చివరకు రెండు వర్గాలు పరస్పర గొడవలకు కారణం కావటమే కాదు.. తీవ్ర ఘర్షణకు దారి తీసిన విషయం తెలిసిందే.

ఈ ఘటనలో స్థానికులతో పాటు.. పోలీసులు.. పాత్రికేయులు తీవ్రంగా గాయపడ్డారు. పలువురు కత్తిపోట్ల పాలయ్యారు. వారిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు.  ప్రస్తుతం భైంసాలో 144వ సెక్షన్ విధించారు. 600 మందితో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాడులకు కారణమయ్యారంటూ పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Tags:    

Similar News