మరీ ఈ వంతులేంటి జితేందర్ రెడ్డి?

Update: 2016-05-05 06:19 GMT
నిండా మునిగిపోయి ఒకడు ఏడుస్తుంటే.. మరొకడు ఆ ఏడ్చే వాడు అడుగుతున్నవన్నీ తనకు ఇవ్వాలంటూ పేచీ పెట్టిన తీరు బుధవారం పార్లమెంటులో కనిపించింది. ఏపీకీ ప్రత్యేక హోదా విషయంలో మోడీ సర్కారు హ్యాండ్ ఇస్తూ.. ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాదని కేంద్రమంత్రి జయంత్ సిన్హా తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీకి చెందిన అధికారపక్ష ఎంపీలు కొందరు తమ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం గురించి గళం విప్పారు.

ఈ క్రమంలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తన వాణిని బలంగా వినిపించారు. మోడీ సర్కారు ఏపీ ప్రజల్ని మోసం చేసిందని.. విభజన కారణంగా ఏపీకి జరిగిన నష్టానికి సంబంధించి కేంద్రం చేయూతను సూటిగా ప్రశ్నించారు. ఈ సందర్భంగా విభజన చట్టంలో పేర్కొన్న హామీలు ఎప్పటి లోపు తీరుస్తారని ప్రశ్నించటమేకాదు.. ఎన్ని నిధులు ఇస్తారన్న విషయాన్ని చెప్పాలంటూ నిలదీసినంత పని చేశారు.

గల్లా జయదేవ్ వాదనతో లోక్ సభ వాతావరణం ఒక్కసారిగా గంభీరంగా మారిపోయింది. కేంద్ర సర్కారులో మిత్రపక్షం తన వాదనను ఇంత ఘాటుగా వినిపించటం.. మోడీ సర్కారును నిలదీసిన గల్లా వైఖరితో బీజేపీ ఎంపీల ముఖాలు వెలవెలపోయేలా చేశాయి. ఇదిలా ఉంటే.. గల్లా జయదేవ్ తన భావోద్వేగ ప్రసంగాన్ని పూర్తి చేసి తన సీట్లో కూర్చున్నాక తెలంగాణ టీఆర్ ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి లేచి తన వాదనను వినిపించటం షురూ చేశారు.

విభజన చట్టంలో  పేర్కొన్న హామీలకు సంబంధించి తమ పక్క రాష్ట్ర ఎంపీ గల్లా జయదేవ్ అడిగినవన్నీ తమకు కూడా ఇవ్వాలంటూ కోరారు. ఆయన ఏవైతే అడిగారో తమకు కూడా అన్ని చెల్లించాలని డిమాండ్ చేయటంతో అప్పటివరకూ గంభీరంగా ఉన్న వాతావరణం జితేందర్ మాటలతో ఒక్కసారి నవ్వులు విరబూసేలా చేశాయి. అయినా.. ఎపీతో వంతులు వేసుకోకుండా.. తమకేం కావాలో తెలంగాణ అధికారపక్షం ఎంపీ అడగలేరా? తమ వాదనను వినిపించలేరా? అంటూ ఏపీ అధికార పక్ష ఎంపీలు అనుకోవటం కనిపించింది.
Tags:    

Similar News