ప్రజలకు అండగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులే జనాన్ని భయపెడుతున్నారు. తుపాకులు తీసి భయభ్రాంతులను చేస్తున్నారు. గాల్లోకి కాల్పులు జరిపి గుండె గుభేల్ మనిపిస్తున్నారు. సాధారణంగా ఉత్తరప్రదేశ్ - బీహార్ ప్రజాప్రతినిధుల్లో కనిపించే ఈ తుపాకీ సంస్కృతిని తెలంగాణలో తీసుకొస్తున్నారు. స్వీయ భద్రత, ఆత్మరక్షణ కోసం తుపాకులు కొనుగోలు చేసినా వాటిని అవసరం లేకుండా, ఆత్మరక్షణ పరిస్థితులు లేకుండా బయటకు తీయకూడదు. కానీ, తెలంగాణకు చెందిన ఎంపీ మాత్రం తన దర్పం, డాబు చూపించుకోవడానికి, సరదా తీర్చుకోవడానికి బహిరంగంగా గాల్లోకి కాల్పులు జరిపి భయానక వాతావరణం సృష్టించారు.
టీఆరెస్ కు చెందిన మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి మొన్న దసరా రోజున జూబ్లీ హిల్స్ లోని తన ఇంటి బయటకొచ్చి తుపాకీతో హల్ చల్ చేశారు. కుమారుడు మిథున్ - ఆయన ఇద్దరూ బయటకొచ్చి తలో తుపాకీ పట్టుకుని గాల్లోకి ఫైరింగ్ చేశారు. ఆ చప్పుళ్లు విన్న స్థానికులు భయభ్రాంతులయ్యారు. దసరాసందర్భంగా ఇంట్లో ఆయుధ పూజ చేసిన అనంతరం ఆయన ఈ హడావుడి చేశారు.
కాగా దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఆచారం అంటూ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. 63 ఏళ్లుగా తమ కుటుంబం ఈ ఆచారం పాటిస్తోందని, ఆయుధ పూజ చేసిన అనంతరం గాల్లోకి కాల్పులు జరపడం ఏటా తమ అలవాటని, అది ఆచారమని ఆయన చెప్పుకొస్తున్నారు. ఆయుధాలు ప్రయోగించడం ఆచారమెలా అవుతుందో మరీ ఎంపీగారే చెప్పాలి.