పెళ్లికి వెళ్లేందుకు మెట్రో ఎక్కిన ఎంపీ జితేంద‌ర్‌

Update: 2017-12-04 08:04 GMT
మాట‌లు చెప్ప‌టం వేరు. చేత‌ల్లో చేసి చూపించ‌టం వేరు. తాను మాట‌ల మ‌నిషిని కాదు.. చేత‌ల మ‌నిషిన‌న్న విష‌యాన్ని నిరూపించారు టీఆర్ఎస్ ఎంపీ జితేంద‌ర్ రెడ్డి.  హైద‌రాబాద్ మెట్రో రైలు ప్రారంభానికి ముందు తాను ఏదైతే చెప్పానో అదే విష‌యాన్ని తాజాగా చేసి చూపించారీ టీఆర్ ఎస్ ఎంపీ.

హైద‌రాబాద్ మెట్రో రైలు వ‌చ్చాక‌.. తానుండే ప్రాంతం నుంచి సిటీలో ఎక్క‌డికైనా వెళ‌తానంటే మెట్రో రైల్లోనే వెళ‌తాన‌ని.. మెట్రో స్టేష‌న్ ద‌గ్గ‌ర‌కు కారు పంప‌మ‌ని చెబుతాన‌ని చెప్పిన జితేంద‌ర్‌.. తాను చెప్పిన మాట‌ల్ని తూచా త‌ప్ప‌కుండా పాటించారు. తాజాగా అమీర్ పేట స్టేష‌న్ నుంచి  నాగోలు స్టేష‌న్ కు వెళ్లే మెట్రో రైలు నిలిచే ఫ్లాట్ ఫాం మీద‌కు వెళ్లారు.

ఎంపీన‌న్న ఆర్భాటానికి పోకుండా క్యూలో వెళ్లి టికెట్ తీసుకున్న ఆయ‌న‌.. హైద‌రాబాద్ మెట్రో మీద ప్ర‌శంస‌లు కురిపించారు. ఢిల్లీ మెట్రోతో పోలిస్తే హైద‌రాబాద్ మెట్రో వ‌స‌తులు బాగున్న‌ట్లు చెప్పారు. మెట్రో రైలు ప్ర‌యాణంతో స‌మ‌యం క‌లిసి వ‌స్తుంద‌ని.. సిటీ ట్రాఫిక్ స‌మ‌స్య‌ల‌కు మెట్రో రైలుతో చెక్ చెప్పొచ్చ‌న్నారు. నాగోల్ ద‌గ్గ‌ర్లో పెళ్లికి వెళ్లాల్సిన ప‌ని ప‌డింద‌ని.. కారులో వెళ్ల‌కుండా ట్రైన్లో వెళితే స‌మ‌యం ఆదా అవుతుంద‌న్న ఉద్దేశంతో తాను ట్రైన్లో వెళుతున్న‌ట్లు చెప్పారు.

ఢిల్లీలో కూడా తాను మెట్రో రైలును ఉప‌యోగిస్తాన‌ని చెప్పారు. త‌న మాదిరే కొంద‌రు ఎంపీలు మెట్రో రైల్లో త‌ర‌చూ ప్ర‌యాణిస్తార‌ని జితేంద‌ర్ రెడ్డి చెప్పారు. నాగోల్ స్టేష‌న్‌ కు వెళ్లినంత‌నే.. ఆయ‌న్ను పిక‌ప్ చేసుకునేందుకు వీలుగా  కారు ఏర్పాటు ఉంటుంద‌న్న విష‌యాన్ని ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదుగా!
Tags:    

Similar News