హాట్ టాపిక్ గా గులాబీ నేతల వాదులాట

Update: 2017-03-20 04:55 GMT
అధినేత బలంగా ఉన్న వేళ.. గుండెల్ని మండించే అసంతృప్తిని పెదవి దాటనీయటానికి భయపడుతుంటారు నేతలు. అందుకు భిన్నంగా గులాబీ నేతల మధ్య  చోటు చేసుకున్నవాదులాట ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తనకు మంత్రి పదవిని రాకుండా అడ్డుకున్నది ఎంపీ జితేంద్ర రెడ్డినేనంటూ అధికారపక్ష ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఓపెన్ కావటం..ఈ విషయం మీద ఇరువురు నేతల మధ్య ఓపెన్ గానే వాదులాట జరగటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

కేసీఆర్ లాంటి అధినేత ఉన్నపార్టీలో ఇలాంటి ముచ్చట?అన్నభావన కలుగజేసే  ఈ ఉదంతంలోకి వెళితే.. మహబూబ్ నగర్ లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది.ఈ కార్యక్రమానికి ఎంపీ జితేందర్ రెడ్డి.. ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్  తదితరులు హాజరయ్యారు. తనకు.. శ్రీనివాస్ గౌడ్ కు మధ్య విభేదాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోందని.. అయితే..అందులో ఎలాంటి వాస్తవం లేదని.. మీడియనే కావాలని ఇదంతా చేస్తుందని మండిపడ్డారు.

జితేందర్ రెడ్డి ప్రసంగం ముగిసిందో లేదో..మైకు అందుకున్నశ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. తనకు మంత్రి పదవిని రాకుండా అడ్డుకున్నది మీరనని.. ఆ విషయాన్ని తనకో మంత్రి చెప్పినట్లుగా గుండెల్లో దాచుకున్నబాధను బయటకు కక్కేశారు. దీంతో ఒక్కసారి కంగుతిన్న ఎంపీ జితేందర్ రెడ్డి.. తాను కానీ మంత్రిపదవి రాకుండా అడ్డుకున్నది నిజమని నిరూపిస్తే.. ఎంపీ పదవికి రాజీనామా చేయటమే కాదు.. రాజకీయాల నుంచి తప్పుకుంటానని జితేందర్ రెడ్డి సవాలు విసిరారు. అయినా.. మంత్రి పదవి తలరాత ఉంటే దక్కుతుందే తప్పించి.. ఎవరో అడ్డుకుంటే ఆగదన్నారు. ‘‘అయినా.. సీఎం కేసీఆర్ ఎవరో చెబితే వింటారా?అందులోకి మంత్రి పదవి విషయంలో ఎవరో మాట వింటారా?’’ అని ఎంపీ వ్యాఖ్యనిస్తూ.. కేసీఆర్ ను తాను 14 ఏళ్లుగా దగ్గరుండి చూసినట్లుగా చెప్పుకునే శ్రీనివాస్ గౌడ్..మంత్రిపదవి గురించి ఎవరో చెబితే వినటం ఏమిటంటూ వ్యాఖ్యానించారు. దీంతో.. ఇరువురు నేతల మద్య మాటలు అంతకంతకూ పెరుగుతుండటంతో..మిగిలిన నేతలు ఇరువురిని సముదాయించటంతో విషయం అక్కడితో ఆగింది. ఏమైనా..గులాబీ నేతలు ఇలా ఓపెన్ గా వాదులాడుకోవటం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News