పెరిగిపోతున్న ఎంపీ కడుపుమంట

Update: 2021-09-09 04:14 GMT
అధికార పార్టీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు ప్రభుత్వంపై కడుపుమంట పెరిగిపోతోంది. జగన్మోహన్ రెడ్డి అన్నా రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నా ఎంపికి ఎంత మంట ఉందో అందరికీ తెలిసిందే. వాళ్ళ మీద కోర్టులో కేసులు వేయడం ద్వారా తనలోని మంటను రఘురామ బయటపెట్టుకున్నారు. తనకు ఎలాంటి సంబంధం లేని వీరిద్దరి బెయిల్ విషయంలో కోర్టులో కేసులు వేయడం ద్వారా వీళ్ళద్దరిపై తిరుగుబాటు ఎంపి ఎంతగా మండిపోతున్నది అందరికీ తెలిసిపోయింది.

ఇదే పద్దతిలో తాజాగా ప్రభుత్వ సలహాదారు, పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన సజ్జల రామకృష్ణారెడ్డి పైన కూడా కోర్టులో కేసు వేశారు. ప్రభుత్వం నుండి జీత, బత్యాలు తీసుకుంటున్న సజ్జలపై ఏపీ సివిల్ సర్వీస్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని పిటీషన్లో కోర్టును కోరారు. సజ్జలకు వ్యతిరేకంగా వేసిన ప్రజాహిత వ్యాజ్యంలో ప్రజాహితం ఏముందో ఎంపికే తెలియాలి. ప్రభుత్వం, పార్టీ తరపున సజ్జల మీడియా సమావేశాలు పెడుతున్నారట వాటిని పెట్టకుండా ఆపాలని చీఫ్ సెక్రటరీని ఆదేశాలించాలంటు ఎంపి తన పిటిషన్ లో కోరారు.

వైసీపీకి చెందిన సజ్జల ప్రభుత్వం సలహాదారుగా, మూడు జిల్లాలకు పార్టీ తరఫున ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారట. పై రెండు పోస్టుల్లో కంటిన్యూ అవుతున్న సజ్జల పార్టీ ఆఫీసు నుండి రెగ్యులర్ గా ప్రెస్ మీట్లు పెడుతున్నారట. పార్టీ తరపున ప్రత్యక్షంగా, పరోక్షంగా రాజకీయ పాత్ర పోషిస్తున్నట్లు ఎంపి తెగ బాధపడిపోయారు. క్యాబినెట్ హోదాలో ప్రభుత్వం నుండి జీతభత్యాలు అందుకుంటున్న సజ్జలకు తాత్కాలిక ఏపీ సివిల్ సర్వీసెస్ నిబంధనలు వర్తిస్తాయట. ఏపీ సివిల్ సర్వీసెస్ నిబంధనల ప్రకారం సజ్జల మచ్చ తెచ్చేలా వ్యవహరిస్తున్నట్లు ఎంపి తన పిటిషన్లో చెప్పారు. సజ్జలను మీడియా సమావేశాలు పెట్టనీయకుండా ఆపాలట.

సజ్జల పై వేసిన పిటీషన్లో ప్రజాహితం ఏముందో ఎంపికే తెలియాలి. నిజానికి ప్రభుత్వ సలహాదారుగా ఉన్న వ్యక్తి మీడియా సమావేశాలు పెట్టకూడదని ఎక్కడా లేదు. సజ్జల మీడియా సమావేశాలు పెట్టడాన్ని అభ్యంతర పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబునాయుడుకు మీడియా సలహాదారుగా ఉన్న పరకాల ప్రభాకర్ కూడా రెగ్యులర్ గా మీడియా సమావేశాలు పెట్టేవారు. అప్పటి ప్రతిపక్షాల ఆరోపణలకు, విమర్శలకు సమాధానాలు చెప్పేవారు. చంద్రబాబునాయుడు పెట్టే మీడియా సమావేశాలకు  కూడా హాజరయ్యేవారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎంపికి జగన్+విజయసాయిరెడ్డిపైన విపరీతంగా మండిపోతోంది. దాన్ని ఏ విధంగా తీర్చుకోవాలో తెలీటం లేదు. అందుకనే ప్రతిరోజు ఏదో అంశాన్ని పట్టుకుని మీడియా సమావేశాలు పెట్టి నోటికొచ్చింది మాట్లాడుతున్నారు. అయినా కడుపుమంట తీరినట్లు లేదు.  ఏదో రూపంలో జగన్ను ఇబ్బంది పెట్టడమే టార్గెట్ గా  పెట్టుకున్న ఎంపి ఇపుడు సజ్జల మీద కేసు వేశారు. ఇప్పటికే జగన్, విజయసాయి మీద వేసిన కేసులు విచారణ పూర్తయి తీర్పుకు రెడీగా ఉంది. ఇపుడు సజ్జల కేసు ఏమవుతుందో ?
Tags:    

Similar News