ఎంపీని అపరిచితుడు ఆవహించాడా ?

Update: 2021-08-25 05:30 GMT
‘అక్రమాస్తుల కేసుల నుండి ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడిగిన ముత్యంలా బయటకురావాలి’.. పై వ్యాఖ్యలు చూసిన తర్వాత వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామకృష్ణంరాజును అపరిచితుడు పూని నట్లే అనుమానంగా ఉంది. ఎందుకంటే ఒకవైపు అక్రమాస్తుల కేసుల్లో బెయిల్ రద్దయి జగన్ మళ్లీ జైలుకు వెళ్లడం ఖాయమని ఒకసారి ఇదే ఎంపి చాలెంజ్ చేశారు. మరోసారి మాట్లాడుతూ బెయిల్ రద్దు చేయించి జగన్ను జైలుకు పంపేవరకు ఏపిలోకి అడుగుపెట్టేది లేదని శపథం చేసింది ఈ ఎంపినే.

తాజాగా మీడియాతో మాట్లాడుతూ అక్రమాస్తుల కేసుల నుండి జగన్ కడిగిన ముత్యంలా బయటకురావాలని అన్నది రఘురాముడే. హోలు మొత్తాన్ని జాగ్రత్తగా గమనిస్తే జగన్ను జైలుకు పంపటమే ఎంపి టార్గెట్టా లేకపోతే కేసులన్నీ కొట్టేయాలని కోరుకుంటున్నది కరెక్టా ? అన్నదే జనాలకు అర్ధం కావట్లేదు. ఒకే వ్యక్తిలో ఇన్ని వేరియేషన్స్ ఉండటం కేవలం అపరిచితుడుకి మాత్రమే సాధ్యం. అందుకనే తిరుగుబాటు ఎంపిని అపరిచితుడు ఆవహించాడా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి.

ఈనెల 25వ తేదీన అంటే బుధవారం సీబీఐ ప్రత్యేక కోర్టు జగన్ బెయిల్ రద్దు విషయంలో తీర్పు చెప్పబోతోంది. ఒకపుడు బెయిల్ రద్దయి జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని బల్లగుద్ది మరీ చెప్పిన ఇదే ఎంపి తర్వాత తానే అనుమానాలు వ్యక్తం చేశారు. జగన్ బెయిల్ రద్దు విషయంలో కోర్టు తాను వేసిన పిటీషన్ను కొట్టేస్తే వెంటనే హైకోర్టుకు వెళతానన్నారు. హైకోర్టులో కూడా కొట్టేస్తే మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. కేసుల మీద కేసులు వేస్తానే కానీ జగన్ను మాత్రం వదిలిపెట్టేది లేదన్నారు.

ఎంపీ వాదన నిజమే అనుకుందాం. తన కేసును కొట్టేస్తే హైకోర్టుకు తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఎంపికి ఉన్నది వాస్తవమే. మరి బెయిల్ రద్దు చేస్తే సీబీఐ కోర్టు తీర్పు చాలెంజ్ చేయడానికి జగన్ కు కూడా అంతే అవకాశం ఉంది కదా. సీబీఐ బెయిల్ రద్దు చేస్తే జగన్ వెంటనే వెళ్ళి జైల్లో కూర్చుంటారా ? తీర్పును చాలెంజ్ చేస్తు హైకోర్టుకు తర్వాత సుప్రీం కోర్టుకు వెళ్లకుండా ఉంటారా ? ఇన్ని కోర్టుల్లో విచారణ జరిగి తీర్పు ఎప్పటికి వచ్చేను ? ఇంత చిన్న లాజిక్ కూడా తిరుగుబాటు ఎంపి మరచిపోయి నోటికొచ్చింది మాట్లాడేస్తుండటమే విచిత్రంగా ఉంది.


Tags:    

Similar News