పాతికేళ్లలో కేటీఆర్ లో ఎంత మార్పు.. సంతోష్ ఫోటో వేళ కొత్త చర్చ

Update: 2023-02-16 10:34 GMT
ఒక అంశంపై ఎంతటి బలమైన అభిప్రాయం ఉన్నా.. వయసు కీలకభూమిక పోషిస్తూ ఉంటుంది. తమకు ఇష్టం ఉన్నా లేకున్నా తల్లిదండ్రుల అభీష్టానికి తగ్గట్లుగా అడుగులు వేయాల్సిన పరిస్థితి చోటు చేసుకుంటుంది. చిన్నతనంలో తల్లిదండ్రుల ఇష్టానికి తగ్గట్లుగా వ్యవహరించే పిల్లలు.. పెద్దోళ్లు అయ్యాక తమకు తగ్గట్లుగా నడుచుకుంటారు. ఈ విషయంలో మంత్రి కేటీఆర్ తీరు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా టేకప్ చేసిన కొండగట్టు టెంపుల్ డెవలప్ మెంట్ నేపథ్యంలో.. ఆయన అక్కడకు వెళ్లటం.. రూ.500 కోట్లను డెవలప్ మెంట్ కోసం కేటాయిస్తున్నట్లుగా ప్రకటించటం తెలిసిందే. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు.. సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉంటే బంధువు సంతోశ్ కుమార్ తాజాగా ఒక ఫోటోను షేర్ చేశారు.

సదరు ఫోటో పాతికేళ్ల నాటిది. అప్పట్లో ఆయన తన కుటుంబ సభ్యులతోకలిసి కొండగట్టును సందర్శించారు. ఆ ఫోటోలో చిన్నతనంలో ఉన్న కేటీఆర్.. కవితలు కూడా కనిపిస్తారు. ఈ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన నేపథ్యంలో వైరల్ గా మారింది. అయితే.. ఇక్కడ మొదలైన కొత్త చర్చ ఏమంటే.. పాతికేళ్ల క్రితం తండ్రి చాటు బిడ్డగా ఉన్న కేటీఆర్.. బుద్దిగా కొండగట్టుకు వెళ్లటం కనిపిస్తుంది.

కేసీఆర్.. ఆయన సతీమణి శోభతో పాటు.. కుమార్తె కవిత అందరూ ఆస్తికులు కాగా.. మంత్రి కేటీఆర్ మాత్రం నాస్తికుడన్న  మాటను ఆయన సన్నిహితులు ప్రస్తావిస్తుంటారు. దేవుడు.. పూజలు.. యాగాలు.. హోమాలు లాంటి వాటికి ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం కనిపించదంటారు.

ఈ కారణం చేతనే ప్రముఖ దేవాలయాల్నిదర్శించే తీరు మంత్రి కేటీఆర్ లో కనిపించదని చెబుతారు. ప్రభుత్వ కార్యాకలాపాల్లో కీలక భూమిక పోషించే కేటీఆర్.. తన తండ్రి చేపట్టే కొన్ని యాగాలు.. అథ్యాత్మిక కార్యక్రమాల్లో పెద్దగా కనిపించకపోవటానికి ఇదే కారణమని చెబుతారు.

ఈ వయసులో తనలోని నాస్తికుడి గురించి బయట ప్రచారం కాకుండా గుంభనంగా వ్యవహరిస్తారని కేటీఆర్ కు పేరుంది. అలాంటి ఆయన చిన్నతనంలో మాత్రం ఇలా ఉన్నారా? అంటూ ఆయన గురించి బాగా తెలిసిన వారంతా తాజా ఫోటో చూసినంతనే చర్చ షురూ చేయటం కనిపిస్తోంది. కాలం ప్రతి ఒక్కరిలో మార్పును తెస్తుంది. అందుకు మంత్రి కేటీఆర్ మినహాయింపు కాదని చెప్పాలి.       



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News