క్రికెట్ ప్రీమియర్ లీగ్ పెట్టిన భారత్ మాజీ క్రికెటర్ , ఎంపీ !

Update: 2021-11-09 05:07 GMT
మాజీ క్రికెట‌ర్, ఎంపీ గౌత‌మ్ గంభీర్, ఈస్ట్ ఢిల్లీ ప్రిమియ‌ర్ లీగ్ ను ప్రారంభించాడు. ఈస్ట్ ఢిల్లీ లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గం ఎంపీ అన్న సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో త‌న నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో క్రికెట్ ప్రీమియ‌ర్ లీగ్ ను గంభీర్ నిర్వ‌హిస్తూ ఉన్నాడు. ఈ లీగ్ ప్రైజ్ మ‌నీని 30 ల‌క్ష‌లుగా నిర్ణయించారు. ర‌న్న‌ర‌ప్ కు ఇర‌వై ల‌క్ష‌ల రూపాయ‌ల ప్రైజ్ మ‌నీని ప్ర‌క‌టించారు. ఇత‌ర స్థానాల్లో నిలిచిన జ‌ట్ల‌కు కూడా ప్రైజ్ మ‌నీ ఉండబోతుంది. ఈ లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌తి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికీ ఒక జ‌ట్టును ఎంట్రీగా పిలిచారు. ఆ జ‌ట్ల మ‌ధ్య‌న ఇర‌వై రోజుల పాటు వివిధ స్థాయిల్లో పోటీలు నిర్వ‌హించి ఈ లీగ్ కు ఛాంపియ‌న్ ను నిర్ణయిస్తారు.

ఈ మ్యాచ్ ల‌ను యూట్యూబ్ లో లైవ్ లో పెట్ట‌డంతో పాటు, దీని కోసం ఒక యాప్ ను ప్రారంభించార‌ట‌.  ఇలా మాజీ క్రికెట‌ర్ అయిన రాజ‌కీయ నేత‌, త‌ను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ఒక క్రికెట్ లీగ్ ను ప్రారంభించ‌డం ఇదే తొలిసారి. క్రికెట‌ర్లు, సెల‌బ్రిటీలు ఎంపీలు అయ్యి సాధిస్తున్న‌ది ఏమిటి, అనే ప్ర‌శ్న త‌లెత్తుతున్న నేప‌థ్యంలో గౌత‌మ్ గంభీర్ త‌న వంతుగా త‌న నియోజ‌క‌వ‌ర్గంలోని యువ‌త‌ను ఆక‌ట్టుకునేలా ఒక క్రికెట్ లీగ్ కు శ్రీకారం చుట్టాడు. అది కూడా మంచి స్థాయిలో ప్రైజ్ మ‌నీ నేప‌థ్యంలో ఈ లీగ్ అంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తుంది. అలాగే నాణ్య‌మైన క్రికెట్ ప్లేయ‌ర్ల‌కు కూడా దేశ రాజ‌ధాని ప్రాంతం పెట్టింది పేరు.

రంజీ లెవ‌ల్ స్టాండ‌ర్డ్స్ తో ఈ మ్యాచ్ ల‌ను నిర్వహించబోతున్నారు. ఇక దేశంలోని ఇత‌ర ఎంపీలు కూడా ఈ త‌ర‌హా కార్య‌క్ర‌మాల మీద దృష్టి నిల‌ప‌వ‌చ్చు. త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలోని స్పోర్ట్స్ టాలెంట్ ను కూడా వెలుగులోకి తీసుకు వ‌చ్చే బాధ్య‌త‌ను వారు ఈ ర‌కంగా స్వీక‌రించ‌వ‌చ్చు కూడా, కేవ‌లం క్రికెట్ అనే కాదు. ఇత‌ర క్రీడ‌ల‌నూ ఈ త‌ర‌హాలో ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే చాలా మంచి ప‌నే అవుతుంది. అయితే గంభీర్ అంటే మాజీ క్రికెట‌ర్ కాబ‌ట్టి, ఇలాంటి టోర్నీల నిర్వ‌హ‌ణ‌కు స్పాన్స‌ర్ ను ప‌ట్ట‌డం పెద్ద క‌ష్టం కాదేమో. స్పాన్స‌ర్లు సుల‌భంగానే ల‌భిస్తారు. కోటి రూపాయ‌ల‌కు పైనే ఖ‌ర్చు పెట్టి కూడా  ఇలాంటి లీగ్ ను నిర్వ‌హించ‌డం పెద్ద ప‌నేం కాదు. గంబీర్ ఈ తరహా నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం.

ఇదిలా ఉంటే ఇండియా టి 20 వరల్డ్ కప్ నుండి తప్పుకున్న సంగతి తెలిసిందే.  రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలో టీమిండియా ఐసీసీ టోర్నీల్లో తమ అదృష్టాన్ని మార్చుకోగలదని భారత మాజీ క్రికెటర్‌ గౌతమ్ గంభీర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. మహేంద్ర సింగ్‌ ధోని సారథ్యంలో 2007 టీ20 ప్రపంచ కప్‌, 2011 వన్డే ప్రపంచ కప్‌, 2013 ఛాంపియన్స్ ట్రోఫీను టీమిండియా సొంతం చేసుకుంది. ఆ తర్వాత భారత్‌ ఒక్క ఐసీసీ ట్రోఫీని కూడా సొంతం చేసుకోలేకపోయింది. 2014 టీ20 ప్రపంచ కప్‌, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌, కొత్తగా ప్రవేశపెట్టిన వరల్డ్‌ టెస్టు చాంపియన్‌ షిప్‌ టోర్నీ-2021 ఫైనల్‌ లోనూ భారత్‌ ఓడిపోయింది. రోహిత్ శర్మ , రాహుల్ ద్రవిడ్ టీ20 ఫార్మాట్‌లో భారత జట్టును విజయపథంలో నడిపిస్తారని, ఇంగ్లండ్ విధి విధానాలను అనుసరించి అతి త్వరలో ఐసీసి ట్రోఫీని గెలుస్తారని నేను ఆశిస్తున్నాను గంబీర్ చెప్పుకొచ్చాడు.
Tags:    

Similar News