తమకు నచ్చని విషయంపై నిరసనలు తెలిపేందుకు ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటారు. నల్ల బ్యాడ్జీలు ధరించడం - అర్ధనగ్న ప్రదర్శనలు - మౌన దీక్షలు....ఇలా రకరకాలుగా తమ ఆందోళను ఎదుటివారికి తెలియజేస్తుంటారు. అయితే - చిత్తూరు జిల్లా టీడీపీ ఎంపీ నరమల్లి శివ ప్రసాద్....నిరసనలు తెలియజేసే తీరు మిగతా వారికి చాలా భిన్నంగా ఉంటుంది. రకరకాల వేషధారణలలో ఆయన పార్లమెంటు సాక్షిగా తెలియజేస్తున్న నిరసన జాతీయ మీడియాను కూడా ఆకర్షిస్తుందంటే అతిశయోక్తి కాదు. తాజాగా, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ నిరసన తెలుపుతూ శివ ప్రసాద్....పార్లమెంటు ఎదుట శ్రీ కృష్ణావతారం ఎత్తారు. ప్రస్తుతం శివ ప్రసాద్ గెటప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ ను విభజించవద్దంటూ శివప్రసాద్ వివిధ వేషాలు వేసి నిరసనలు తెలిపారు. తాజాగా, పార్లమెంటు వెలుపల తన తోటి ఎంపీలంతా ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలుపుతుంటే....శివప్రసాద్ మాత్రం తనదైన శైలిలో కేంద్రంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. చేతిలో పిల్లన గ్రోవి పట్టుకొని ....శ్రీ కృష్ణావతారంలో పార్లమెంటు ఎదుట శివప్రసాద్ ప్రత్యక్షమయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రం తక్షణమే నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని శివ ప్రసాద్ మీడియాతో అన్నారు. విభజన చట్టంలోని హామీలను కేంద్రం నెరవేర్చాలని, లేని పక్షంలో తమ ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 5 కోట్ల మంది ఆంధ్రుల ఆకాంక్షను కేంద్రం గుర్తించాలని శివప్రసాద్ కోరారు.